హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్నిరోజులుగా మెట్రోప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా నేను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశాను. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నాతో, ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మెట్రో ఫేజ్-1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చింది. మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని మిగిలిన నగరాల్లాగే హైదరాబాద్ విషయంలోనూ సాంకేతికతంగా చర్చించి కేంద్రం సహకరిస్తుంది. అంతే తప్ప కిషన్ రెడ్డి ఆపమంటే ఆపరు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఈ విషయంలో ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు.
నాకు, మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. తెలంగాణలో మేం ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా మేం అమలు చేస్తున్నాం. జాతీయరహదారులైనా, రైల్వేలైనా ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులైనా, అభివృద్ధి పనులైనా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. నేను కేంద్రమంత్రులను కలిసి నిధులు రాకుండా ఆపానని సీఎం విమర్శించారు. నేను ఖట్టర్ ని కలిసిన ప్రతిసారి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టాను. నా తేదీలను నాకే చెబుతున్నాడు సీఎం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ బిడ్డగా నేను ఉద్యమాలు చేశాను. అమరణ నిరాహార దీక్ష చేశాను. బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించాను.
Also Read-
తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎవరి సూచనలు మాకు అవసరం లేదు. 1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మించాం. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు ఇలా అనేక అభివృద్ధిపనులు చేశాం. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి స్పందించలేదు. నాడు కేసీఆర్ సహకరించకపోయినా MMTS Phase-2ను కేంద్ర నిధులతో నిర్మించాం. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో అమలుచేస్తున్నాం. డీఎంకే ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా.. ఎలాంటి వివక్ష లేకుండా.. మా సహకారం ఉంటుంది.
రేవంత్ రెడ్డివి దిగజారుడు రాజకీయాలు. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటాం. ఇటీవల రూ.11వేల కోట్ల రుణాలను 50 ఏళ్ల కోసం వడ్డీలేని రుణాలు ఇచ్చింది. మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించాం. NCDC కోసం 12 ఏళ్లలో లక్షకోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ.34వేల కోట్లను అందించాం. ముఖ్యమంత్రి అనేకసార్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు. వారు కొన్ని మార్పులు సూచించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల ద్వారా.. టెక్నికల్ అంశాలను చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప కిషన్ రెడ్డి ఆపితే ఆగవు.
ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీలో ఉండవు. ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాజెక్టు విషయంలో మార్పులు అవసరమైతే ధైర్యంగా చెబుతాం తప్ప ఇలా ప్రాజెక్టులను అడ్డుకోం. తెలంగాణ అభివృద్ధికోసం ప్రాజెక్టులకు సహకరిస్తాం. అందులో సందేహం అక్కర్లేదు. జనవరి 15న సీఎంకు లేఖ రాశాను. అనేక సార్లు లేఖలు రాశాను. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 కోసం ముందుకు రావాలని అందులో పేర్కొన్నాను. ఇవాళ IRFC గురించి సీఎం మాట్లాడారు. ఈ రుణాలకు సంబంధించి నేను ఏనాడూ మాట్లాడలేదు. రూ.13,500 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వాళ్లు, వాళ్లు తేల్చుకోవాల్సిన అంశం.
నేను దీనిపై ఖట్టర్ తో మాట్లాడాను. మెట్రో ఆదాయంలో ముందుగా IRFCకి రుణాలను చెల్లించడానికి సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరు.. మెట్రో ఆదాయంలో.. ఆపరేషన్స్, మెయింటేనెన్స్‌కు ఖర్చుచేయాలి. ఆ తర్వాతే రుణాలు చెల్లించాలి. ముందుగా లోన్ కట్టడంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రికి సూచించాను. ముందుగా ఆపరేషన్, మెయింటేనెన్స్ చూడాలి. అప్పుడు మెట్రో సస్టేన్ అవుతుందని చెప్పాను. దీనికి సీఎం అంగీకరించలేదన్నారు.
కిషన్ రెడ్డి ఫైనాన్స్ ఇవ్వొద్దని ఏ మంత్రి చెప్పారో రేవంత్ చెప్పగలరా? ఊరికే ఆధారాల్లేని ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. తప్ప విమర్శల ద్వారా సమస్యల పరిష్కారం కాదు. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. గతంలోనూ మెట్రో విషయంలోనూ కేసీఆర్ అలైన్ మెంట్ మార్పుపేరుతో 3 ఏళ్లు కాలయాపనచేశారు. ఇవాళ రేవంత్ కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఖట్టర్ సమావేశానికి ఎప్పుడొచ్చినా నేను కూడా వస్తాను. నాకు ఎలాంటి భేషజాల్లేవు.
కేసీఆర్ నాడు చేసిన విమర్శలనే నేడు రేవంత్ రిపీట్ చేస్తున్నాడు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వమే లేదు, పాలన లేదు రేవంత్ రెడ్డి వచ్చాకే ప్రజాస్వామ్యం వచ్చిందన్నట్లు వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీరిచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయి? దాని గురించి ఏనాడూ మాట్లాడటం లేదు ఎందుకు? తెలంగాణకు రూపాయి వచ్చినా సంతోషపడే మొదటి వ్యక్తిని నేను. తెలంగాణ అభివృద్ధి కోసం స్పెషల్ సెల్ పెట్టుకుని పనిచేస్తున్నాం. మెట్రోకు సంబంధించి. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ విషయంలో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలి.
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను రెగ్యులర్ గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తున్నాను. ఈ విషయంలోనూ మీతో కలిసి వచ్చేందుకు నేను సిద్ధమే. ఫేజ్1 కు లోన్ విషయంలో ఫేజ్ 2 విషయంలో కలిసి పనిచేసే విషయంలో కూర్చుని నిర్ణయించుకోవాలి. నేను ఇవాళ ఖట్టర్ తో మాట్లాడినపుడు ఈ లోన్ విషయంలో ఇరు పార్టీలకు స్పష్టత రాలేదు. దీన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. NoC విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
