“రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నాం”

న్యూఢిల్లీ : దేశంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) పేరుతో అర్హులైన కోట్ల కొద్దీ పౌరుల ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుట్రపూరితంగా తొలగిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధ్వర్యంలో పార్లమెంట్ మకర ద్వారం నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కార్యాలయం వరకు భారీ ప్రొటెస్ట్ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు.

“ఈరోజు పార్లమెంట్ మకర ద్వారం దగ్గర నుంచి బయలుదేరి ప్రొటెస్ట్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్ పార్టీలు ఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉన్న టీఎంసీ అందరం ఎంపీలు పార్లమెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ వరకు పాదయాత్రలు, ఎలక్ట్రోరల్ ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది” అని ఆయన తెలిపారు.

13 కోట్ల ఓట్ల తొలగింపంటే ఆషామాషీ కాదు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరు మీద ఇప్పటివరకు భారతదేశంలో 13 కోట్ల మంది పౌరుల ఓటు హక్కును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మల్లు రవి తెలిపారు. దేశంలో ఏకంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు అంటే అషామాషీ విషయం కాదన్నారు. 13 కోట్ల ఓట్లు అంటే ప్రపంచంలో కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువని అన్నారు. పది, పదిహేను దేశాల ప్రజల సమూహానికి ఓట్లు లేకుండా చేసినంత మందికి ఓట్లు తొలగించారని మండిపడ్డారు.

బడుగు, బలహీన వర్గాల ఓట్లు తొలగించే కుట్ర

ఎస్ఐఆర్ పేరుతో దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఓట్లు తొలగించే కుట్ర జరిగిందని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఫామ్ 6 లో ఇంతకుముందు ఉన్న ప్రణాళికలు కాకుండా ఉద్దేశ పూర్వకంగానే కొత్తమార్పులు తీసుకొచ్చారని తెలిపారు. మీ పేరుందా, మీ తల్లిదండ్రుల పేరుందా, మీ తాత ముత్తాతల పేరుందా అంటూ ఒక డజన్ సర్టిఫికెట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ ఓట్లు అన్నీ తీసేయడం జరిగిందని పేర్కొన్నారు.

“ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు పనికొరకు అనేక ప్రాంతాలు తిరుగుతుంటారు, మైగ్రేషన్ జరుగుతుంటది. వాళ్లకు సరైన టైంలో నోటీస్ అందకపోవటం, అందిన వాళ్లకు టైం ఇవ్వకపోవటం వల్ల ఓట్లు తీసేస్తున్నారు. తెలంగాణలో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టైం పొడిగించమంటే వీలేదని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్ లో కూడా ఇదే రకంగా చేశారు” అని మల్లు రవి వివరించారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ల ఓట్లే టార్గెట్

దేశంలో బీజేపీకి, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఓట్లన్నీ టార్గెట్ చేసేలా ఎస్ఆర్ఐ ప్రక్రియ సాగిందని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గ్రామ స్థాయిలో బిఆర్ఓ, బిఎల్ఓ లు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏఆర్ఓ దగ్గర ఏమి నిర్ణయం తీసుకోకుండానే, మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి చేరేలా ప్రణాళిక రచించారని అన్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సోషల్ మీడియాలో వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారో తెలుసుకొని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ తీసేయడం వల్ల 13 కోట్ల మంది ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఓటు హక్కు తొలగించడం దేశద్రోహంతో సమానం

ఒక వ్యక్తి ఓటు హక్కును అన్యాయంగా, అతని ప్రమేయం లేకుండా తొలగించడం అంటే దేశద్రోహంతో సమానమని మల్లు రవి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కే పునాదని తెలిపారు. ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం లేదని, ప్రభుత్వాలు లేవని చెప్పారు. ప్రతి పౌరుడుకీ ఒకే ఓటు – ఓకే విలువ అని తెలిపారు. అంతటి విలువైన ఓటు హక్కుని అన్యాయం తీసేస్తున్నారు అంటే ఇది దేశద్రోహం లాంటిదేనని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో చర్చించి అందరికీ సమాన ఓటు హక్కును ఇచ్చారని గుర్తు చేశారు. అమెరికాలో కూడా రాజ్యాంగం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదని తెలిపారు. కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు. కానీ, మనదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, బడుగు, బలహీన వర్గాలు అందరికీ ఓటు హక్కు కల్పించారని స్పష్టం చేశారు. ఆ ఓటు హక్కును ఇప్పుడు అక్రమంగా తీసెయ్యడం ద్వారా మళ్లీ రాచరిక పాలనను తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరు చెబుతూనే లోలోపల మాత్రం రాజుల్లా పరిపాలించాలని చూస్తోందని మండిపడ్డారు.

ఫామ్ 6లో మార్పులకు తాము అనుమతించలేదని సుప్రీం చెప్పంది

సుప్రీంకోర్టు ఆమోదంతోనే ఫామ్-6లో చేర్పులు, మార్పులు చేశామని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిందని, కానీ అదంతా అబద్ధమేనని తేలిపోయిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. “నిన్నటి వరకు ఫామ్ 6 మార్పులు సుప్రీంకోర్టు అప్రూవల్ తోనే జరిగాయని ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం ఫామ్- 6 మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం లేదని కేటాగారికల్ గా చెప్పారు. ఎవరు ఈ మార్పులు చేయమన్నారో వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ అబద్ధాలు చెబుతోంది, ప్రస్తుత ప్రభుత్వం ఈసీకి మద్దతు ఇస్తోంది” అని ఆయన వెల్లడించారు.

రాహుల్ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం

ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం సాగుతోందని ఎంపీ మల్లు రవి తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, పటేల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలా పోరాడిందో, ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా అలయన్స్ తో కలిసి దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar