హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ నిన్న కిషన్ రెడ్డి కి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 71 సార్లు వెళ్లారని, కనీసం 15 సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. అర్బన్ డెవలప్‌మెంట్, మెట్రో అంశాలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని 5 సార్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని 3 సార్లు కలవడమే కాకుండా, హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమైన రేవంత్ రెడ్డి ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డి కి చెప్పి కలిశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అపాయింట్‌మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్ రెడ్డి పై ఆరోపణలు చేయడం రాజకీయ నాటకం, బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి లేఖ రాశారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని, అలాగే ఇచ్చిన 420 హామీలను కూడా గాలికొదిలేసిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువులకు దూరమవుతూ భవిష్యత్తు భారంగా మారుతోందన్నారు. పాఠశాలల్లో టీచర్లు, కళాశాలల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేక ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందని, గురుకులాల పరిస్థితి దయనీయంగా మారి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవని, పెన్షన్లు సక్రమంగా అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా అమలు కాలేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర సమస్యలు ఉండటంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ఆసక్తి లేదని, ఆ పార్టీకి కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. 2G స్కామ్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్ లు కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ (DPR)లను ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం ముమ్మాటికీ అవాస్తవమని, కేంద్రం మెట్రో ఫేజ్-2కు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు.
Also Read-
ఇది కేంద్రం చేసిన ‘రిజెక్షన్’ కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ‘డిలే’ (ఆలస్యం) మాత్రమేనని తేల్చిచెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రోను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, మెట్రో ఫేజ్-1ను ప్రధాని మోదీ ప్రారంభించారని, ఫేజ్-2కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది కూడా కేంద్రమేనని చెబుతూ.. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం గానీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గానీ కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
2014 వరకు దేశంలో కేవలం 248 కి.మీ. మెట్రో మాత్రమే ఉండగా, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 1,155 కి.మీ.లకు పెరిగిందని రాంచందర్ రావు వివరించారు. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి వాజ్‌పేయి హయాం, మోదీ పాలన స్వర్ణయుగాలని, బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్దపీట వేస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 13 లక్షల కోట్లకు పైగా సహకారం అందించిందని, కేంద్రం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అదనంగా ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పడంలోనే కాదు, ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని, అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ‘గోబెల్స్’ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. పరిపాలనలో ఫెయిల్ అయి, ప్రచారంలో పాస్ కావాలనే ప్రయత్నంలో, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే ఈ రాజకీయ డ్రామాలని ఆరోపించారు. సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనా అనుభవం లేక తెలంగాణకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజలకు జరుగుతున్న నష్టానికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలే కారణమని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలని రాంచందర్ రావు హెచ్చరించారు.
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని రాంచందర్ రావు హామీ ఇచ్చారు. దేశంలో 70 ఎయిర్‌పోర్టులు ఉన్న స్థితి నుంచి 150కి పైగా ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఘనత, ప్రతిరోజూ సగటున 68 కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తున్న చరిత్ర, వందే భారత్ రైళ్లు మరియు రైల్వే బ్రాడ్‌గేజ్ విస్తరణలో చారిత్రక పురోగతి సాధించిన రికార్డు బీజేపీ ప్రభుత్వానిదేనని చాటిచెప్పారు. కాంగ్రెస్ చేసినది స్కాములు అయితే, బీజేపీ చేసినది అభివృద్ధి అని అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని, అహంకారాన్ని పక్కనపెట్టి తెలిసిన వారి సలహాలు తీసుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ చేసే ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఇవాళ బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరడానికి కారణమని ఆయన స్పష్టం చేశారు.
