ఎత్తయిన కొండలు, లోయలు, సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో దట్టమైన అడవిలో “వస్తున్నం లింగమయ్యా వస్తున్నమంటూ” స్వామి దర్శనానికి సాగించే సాహసోపేత ప్రయాణం సలేశ్వరం. అందుకే ఇది దక్షిణాది అమర్నాథ్ యాత్రగా,తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినది.
ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత తొలి పౌర్ణమి అనగా చైత్రశుద్ధ పౌర్ణమిన నల్లమల్లలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతర శుక్రవారం మొదలై ఈనెల 11, 12, 13తేదీలలో మూడురోజులపాటు సాగనున్నది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలో మున్ననూర్ దాటిన తర్వాత ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది.

పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. ఈ నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్‌క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. రాంపూర్ చెంచు పెంట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని ఏర్పాటు చేస్తారు.
ఈ చెంచు పెంట దాటిన అనంతరం వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. లింగాల వైపు నుంచి వచ్చే భక్తులు లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దతేరును దర్శించుకొని, అక్కడి నుంచి అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు భారీ సంఖ్యలో చేరుకుంటారు.
Also Read-
రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలొ ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటారు.. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి.
ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు కొండల మధ్య సుమారు 280 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం.

గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. స్వామి దర్శనానంతరం భక్తులు ఇంటికి వెళ్లే తిరుగు ప్రయాణంలో “పోతున్నం పోతున్నం లింగమయ్యొ” అని అరుస్తూ నడుస్తుంటారు.
చుట్టూ ఎత్తైన కొండల మధ్య గుహలో కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు ప్రతిసంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తులకు అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు రాంపూర్ పెంట, సలేశ్వరం లోయ వద్ద హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా బస్సులను సైతం ఏర్పాటు చేశారు. అచ్చంపేట నుంచి ఫస్ట్ బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంటకు చేరుకొని అక్కడి నుంచి ఆటో ద్వారా సలేశ్వరం వెళ్లవచ్చు.
అమెరికాలోని గ్రాండ్ క్యానన్ అందాలను మైమరిపించే సలేశ్వరం పచ్చటి ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక భక్తి పారవశ్యం ఈ క్షేత్రం దర్శించిన వారికి ఆజన్మాంతం గుర్తుంటాయి.

– కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’
