తాటి, ఈత వనాల పెంపకానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకోవాలి: వినోద్ కుమార్

తాటి, ఈత వనాల పెంపకానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకోవాలి

స్వరాష్ట్రంలోనే గౌడ కులస్తుల సమస్యలకు పరిష్కారం లభించాయి

రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభ

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

Hyderabad: తాటి, ఈత వనాల పెంపకానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకోవాలని, ఈ దిశలో ఉన్న అవకాశాలను కల్లు గీత సహకార సొసైటీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం పీర్జాదీగూడ, బోడుప్పల్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభకు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాను కరీంనగర్ ఎంపిగా ఉన్న సమయంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తాటి, ఈత వనాలు పెట్టించి, ఆ వనాలలో బోర్ బావులను ఏర్పాటు చేసి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తాటి, ఈత మొక్కల పెంపకానికి నిధులు కేటాయించానని, దీనికి సంబంధించి ప్రత్యేక జీ. వో. కూడా తీసుకొచ్చామని తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణ ఆవిర్భావం తర్వాతే గౌడ కులస్తుల సుదీర్ఘ కాల సమస్యలు పరిష్కారం అయ్యాయని వినోద్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉమ్మడి రాష్ట్రంలో కల్లు ను నిషేధించారని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే జంట నగరాలలో కల్లు విక్రయాలను పునరుద్దరించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. గౌడ కులస్తులు చెట్లపై నుంచి పడి మృతి చెందినా.. గాయపడినా ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని, నీరా విక్రయాలు చేస్తోందని, చెట్టు టాక్స్ లు మినహాయింపు ఇచ్చినట్లు వినోద్ కుమార్ వివరించారు.

తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన మహాసభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ధర్మభిక్షం శతజయంతి నిర్వహణ కమిటీ ఛైర్మన్ చాడ వెంకట్ రెడ్డి ప్రారంభించగా, గీత పనివారల మహాసభ ఆహ్వాన సంఘం చీఫ్ పల్లా వెంకట్ రెడ్డి, వృత్తి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు, ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ గౌడ్ హాజరయ్యారు.

ఈ మహాసభలో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలపై మహాసభలో చర్చించి, తీర్మానం చేస్తూ తమకు నివేదికను అందజేస్తే, ఆ సమస్యలను ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కార మార్గాన్ని చూపేందుకు ప్రతినిధుల సభ ఎంతో దోహద పడుతుందన్నారు. సమస్యలను, డిమాండ్లను పాలకులు, అధికార యంత్రాంగానికి నిత్యం తెలియజేయాలని, అప్పుడే అవి పరిష్కారానికి నోచుకుంటాయని తెలిపారు.

తెలంగాణలోని పేద వర్గాలు, కష్టాలలో ఉన్న వారికి స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం ఒక దిక్సూచి లాంటి వారని కొనియాడారు. గీత కార్మికులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ధర్మభిక్షం చేసిన పోరాటాలు, ప్రయత్నాలను తాను స్వయంగా చూశానని, ఆ ప్రభావం తనపైన ఉన్నదని తెలిపారు. గీత పనివారల సంఘం చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాలు, సాధించిన హక్కులను తాను స్వయంగా చూసినందునే, దీనికి సంబంధించిన అంశాలను టిఆర్ పాటు, అనేక అఖిపక్ష సమావేశాల్లో కూడా తాను ప్రస్తావనకు తీసుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయని వినోద్ కుమార్ అన్నారు.

గీత కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన తొలి సంఘమే గీత పనివారల సంఘం : చాడ వెంకట్ రెడ్డి

గీత కార్మికుల సమస్యలు,ఎక్స్ లాంటి అనేక అంశాలపై పోరాటాలు, ఉద్యమాలు చేపట్టిన తొలి సంఘమే ‘గీత పనివారల సంఘం’ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సంఘం చేసిన సమరశీల పోరాటాల ఫలితంగానే అనేక హక్కులను, పథకాలను సాధించామని వివరించారు. ‘గార్ల’లో 65 ఏళ్ల క్రితమే గీతపనివారల సంఘం ఏర్పడిందని, సహకారసంఘాల ఏర్పాటు, ఎక్స్‌గ్రేషియా లాంటి అనేక అంశాలపైన ధర్మభిక్షం పోరాటాలు చేపట్టారని, చట్టసభలలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రస్తావించారన్నారు.

వృత్తి తల్లిలాంటిదని, పోరాటాలు, ఉద్యమాలు చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోబోదని, అందుకే సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, పోరాటానికి సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో చెట్లు ఎక్కకుండానే కల్లు తీసేలా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివిధ కారణాలతో గీతకార్మికులకు తొలగించిన పెన్షన్ ను పునరుద్ధరించాలన్నారు.

పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చేతి వృత్తులలో యువతరం రావడం లేదని, అందుకే శాస్త్రీయంగా కొత్త పధ్దతులను ప్రవేశపెట్టి చేతివృత్తులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ధర్మభిక్షం ఆజాత శత్రువు అని, ఆయన నాయకత్వంలో గీత పనివారల సంఘం ఒక వెలుగు వెలిగిందన్నారు .గీత పనివారల సంఘం ఒక వృత్తి సంఘమన్నారు. ధర్మభిక్షం స్పూర్తి, ఆయన ఆదేశాలకనుగుణంగానే గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిందేనని తెలిపారు .తమ నినాదమే ఐక్యత, పోరాటం అని, ప్రజా సమస్యల అంశంలో ప్రభుత్వం మంచిగుంటే ఐక్యతగా ఉంటామని, కాదంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ఎక్స్‌గ్రేషియా మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ విధానాన్ని రద్దు చేసి, సివిల్ సర్జన్, అసిస్టెంట్ సర్జన్ సర్టిఫికెట్ అనుమతించాలని కోరారు. వివిధ కారణాలతో గీత కార్మికులకు రద్దు చేసిన పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు వృత్తుల్లోని సమస్యల పరిష్కారానికి వృత్తి సంఘం తరపున పోరాటం చేస్తామన్నారు. డి.జి.సాయిలుగౌడ్ మాట్లాడుతూ గీత పనివారల సంఘాన్ని మరింత విస్తరించి, గీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. మోపెడ్ పథకాన్ని అమలు చేయాలని, అబ్దుల్లాపూర్ స్టేడియంకు ధర్మభిక్షం పేరు పెట్టాలని కోరారు. కాగా మహాసభకు ‘ఆల్ ఇండియా 52 శాతం ఒబిసి -బిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు సిహెచ్.భూపాల్ గౌడ్ సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ మహాసభలో ప్రతినిధుల సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పండ్ల రాములు,తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కెవిఎల్, కోశాధికారి బి.నాగభూషణం, పబ్బు వీరస్వామి, దూసరి శ్రీరాములు, మారగోని ప్రవీణ్ శ్రీనివాస్, సిపిఐ నాయకులు గోదా శ్రీరాములు, మంద పవన్, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.పాండురంగా చారి, ఎఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X