హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే వర్షాకాలం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి జోన్ సంసిద్ధతను అంచనా వేయడం, అలాగే నిరంతరాయ, సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ తో పాటు వివిధ శాఖల ప్రధాన అధిపతులు హాజరయ్యారు. సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్లలోని డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, దట్టంగా పెరిగిన వృక్షసంపద వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి రైల్వే ట్రాక్‌లు మరియు ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్(ఓ.ఎచ్.ఈ) సమీపంలోని చెట్లను నరికి, కత్తిరించి, వాటికి గుర్తులు పెట్టాలని రైల్వే బృందాలను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యవేక్షకులు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే గుర్తించి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలనే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతను నిర్ధారించేందుకు కచ్చితమైన పర్యవేక్షణపై గట్టి దృష్టి సారించబడింది. పట్టాలు మరియు ఓహెచ్‌ఈ లపై వదులుగా ఉన్న లోహ వస్తువులను ఉంచడం లేదా నిర్మాణ సామగ్రిని వదిలివేయడం వంటి ఆకతాయి చర్యలను నివారించాలని అధికారులకు సూచిస్తూ, వాటివలన ట్రాక్‌లకు మరియు ఓహెచ్‌ఈ పై ఆపరేషనల్ ప్రమాదాలకు దారితీయవచ్చునని తెలిపారు.
Also Read-

అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, కీలక ప్రాంతాల్లో 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని మరియు చేయవలసిన మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ గారు ఆదేశించారు. ఈ ముందస్తు చర్యలు, వర్షాకాలంలో రైలు సేవలలో భద్రతను మరియు విశ్వసనీయతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయని తెలియజేశారు.
