ఎన్ఆర్ఐ లలో మోడీ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ లు: మధుయాష్కిగౌడ్
మధుయాష్కిగౌడ్ సమక్షంలో ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ లో పలువురు ఎన్ఆర్ఐల చేరిక
హైదరాబాద్ : అమెరికాలోని న్యూ జెర్సీ చాప్టర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ కొటారి, ఇన్చార్జి హర్కేష్ ఠాకూర్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదరు వేడుకలకు మధుయాష్కికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తాను అమెరికాలో నివాసం ఉన్నప్పటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మధుయాష్కి తో తమకున్న అనుబందాన్ని, ఆత్మీయతను పంచుకున్నారు.
న్యూ జెర్సీ చాప్టర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐఓసీ లో పలువురు ఎన్ఆర్ఐ లు చేరారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్ర చెందిన పలువురు ఎన్నారైలు ఐఓసీలో చేరారు. వారికి మధుయాష్కి కండువాలు కప్పి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లో కార్యవర్గ ప్రతినిధులకు ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది ఎన్నారైలు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం పై ఎన్నారై ల నుంచి వ్యతిరేకత ఏర్పడిందన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన గడ్డ అయిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు మోడీ – బిజెపి ప్రభుత్వ నిజ స్వరూపం తెలుసుకుని కాంగ్రెస్ వైపు ఆకర్షితులైతున్నారన్నారు. విదేశాంగ విధానంలోనూ మోడీ ప్రభుత్వం విఫలమైందని, పబ్లిసిటీ స్టంట్ తప్ప మోడీ అమెరికాతో వాణిజ్య విధానాల లో వైఫల్యం చెందారన్నారు. అడ్డగోలు టారిఫ్ లతో భారత వ్యాపార రంగం పై ప్రభావం పడుతున్నప్పటికీ ట్రంప్ తన మిత్రుడే నన్న మోడీ మాత్రం నోరు మెదపటం లేదన్నారు.
Also Read-
భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా మహాత్మా గాంధీ, పటేల్ గార్లు కోరుకున్న తీరుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారత్ జోడోయాత్ర, ఓటర్ అధికార్ యాత్ర తదితర కార్యక్రమాలతో మోడీ ప్రభుత్వం చేపడుతున్న రాజ్యాంగ విలువల ధ్వంసం పై.. రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న తీరు మీ అందరికీ తెలిసిందేనన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేపడుతున్న పోరాటంలో ఎన్నారైల మద్దతు కాంగ్రెస్ కు ఎంతో అవసరమన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బలోపేతానికి శ్యామ్ పిట్రోడ గారు, ప్రదీప్ కొఠారి గార్ల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐఓసీ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని, ఐఓసీ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ బాల్దేవ్ రంద్వ గారు, రామ్ గడుల, ఐఓసీ తెలంగాణ జనరల్ సెక్రటరీ సుధీర్ బండిగారి తదితరులు పాల్గొన్నారు.
