హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ప్రధానితో వేదిక పంచుకోవటం శోచనీయమని అన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ మీటింగ్ కు వెళ్లాల్సింది కాదన్నారు. బడాబాబుల పిల్లలు ఏం చేసిన సరే పోలీసులు చర్యలు తీసుకోరన్న అభిప్రాయం ప్రధాని సభతో ప్రజల్లోకి వెళ్లిందన్నారు. నిందితులను దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉందని గుర్తు చేశారు. ప్రజ్వల్ రేవణ్న కేసులో అది నిరూపితమైందన్నారు. బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

కొందరు ట్వీట్స్ చేస్తూ సమస్యను పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తున్నారని.. అలాంటి పార్టీ వాళ్లు తానేందుకు స్పందించలేదని అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్ల విషయం, అందులోనూ మైనర్ విషయంలో స్పందించే ముందు సంయమనం పాటించాలన్నారు. ఈ సమాజం మగపిల్లలను క్షమించినట్లుగా ఆడపిల్లలను క్షమించదని చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫోటోలు బయటకు వస్తే వాళ్ల జీవితం నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఫోటోలు పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఎకౌంట్లను గుర్తించి వాళ్లను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయాల్లోని లేని బండి సంజయ్ కుమారుడి విషయంలో రాజకీయాలను చేయటం తనకు ఇష్టం లేదని బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరోసారి మొండి చెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తారని భావించిన మనకు పొదుపు సూత్రాలు చెప్పి… ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జాతీయ హోదా గురించి ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని కవిత ప్రశ్నించారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు ఏం ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
ALSO READ-
తెలంగాణపై మళ్లీ అదే వివక్ష
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మరోసారి రాష్ట్రం పై వివక్ష చూపారని కవిత అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సహా మహిళ బిల్లు, జన గణనలో కుల గణన గురించి మాట్లాడతారని భావించినప్పటికీ వాటి గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులకు ఆమోదం తెలుపాలని మరోసారి డిమాండ్ చేశారు. జనగణనలో కుల గణన కాలంతో పాటు సబ్ క్యాస్ట్, ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకునేలా వివరాలు పొందుపర్చాలని కేంద్రాన్ని కవిత కోరారు. మహిళ బిల్లులో ఓబీసీ మహిళల సబ్ కోటా ఉండాల్సిందేన్నారు.
మీ గురువును చూసి నేర్చుకో
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కవిత మండిపడ్డారు. నీళ్ల విషయంలో మనకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా కోసం ప్రధాని మోడీకి లేఖ రాయాలని రేవంత్ ను కోరారు. ఒక వైపు పోలవరం పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే…రేవంత్ రెడ్డి మాత్రం పాలమూరు ప్రాజెక్ట్ ను ఎందుకు పట్టించుకోవటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కూడా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదని కవిత విమర్శించారు. మాట్లాడితే నల్లమల్ల బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు- రంగారెడ్డి విషయంలో చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పోలవరం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న మీ గురువు చంద్రబాబు నాయుడిని చూసైన నేర్చుకో అంటూ రేవంత్ కు సూచించారు. పాలమూరు -రంగారెడ్డి లాంటి పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు కూడా జాతీయ హోదా ఇచ్చారని కవిత గుర్తు చేశారు. కేంద్రం పై ఒత్తిడి పెంచి జాతీయ హోదా వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో జాతీయ హోదా గురించి బీఆర్ఎస్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
సాగు యోగ్యమయ్యే ప్రతి గుంట భూమికి నీళ్లిస్తాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసమని కవిత చెప్పారు. కానీ ఇప్పటికి కూడా మనం గోదావరి లో మన వాటాలో పావు శాతం, కృష్ణాలో అరశాతం కూడా వాడుకోవటం లేదని చెప్పారు. ఆంధ్రాలో మాత్రం వాళ్ల వాటాకు మించి నీళ్లు వాడుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. వారితో పోల్చుకుంటే మనం ఎంతో వెనుకబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తుందని కానీ నీళ్లు మాత్రం వాడుకునే సిస్టమ్ చేయలేకపోయారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ లో సాగు యోగ్యమైన ప్రతి గుంటకు నీళ్లు ఇస్తామని కవిత చెప్పారు. ఇందుకోసం వాటర్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తామని చెప్పారు. తెలంగాణలో ఉన్న అన్ని నదులపై వందేళ్లు పటిష్టంగా ఉండేలా గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు కడుతామన్నారు.
జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది
ఈ నెల 20 నుంచి చేపట్టబోయే జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది అని కవిత అన్నారు. పలు నియోజకవర్గాల్లో జెండా పండుగకు తాను హాజరవుతానని చెప్పారు. జెండా పండుగ నిర్వహణ ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు తిరిగి ఈ అంశంపై తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఇక నీట్ పేపర్ లీక్ అయి పరీక్ష రద్దు చేయటంపై కవిత మండిపడ్డారు. పది రూపాయల డైపర్ కూడా లీక్ కావటం లేదని, అలాంటి నీట్ పేపర్ ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా కేంద్రం చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీక్ కాకుండా చర్యలు తీసుకోలేరా అని ప్రశ్నించారు.
రైల్వే కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత
నాంపల్లి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 2025 నవంబర్ 28న కామారెడ్డిలో టీఆర్ఎస్ నాయకులు రైల్ రోకో చేశారు. ఈ ఆందోళనపై రైల్వే పోలీసులు కల్వకుంట్ల కవితతో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. మనోరంజన్ రైల్వే కోర్టు విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కేసులకు, విచారణలకు భయపడేది లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అవసరమైతే నిరవధిక రైల్ రోకో చేసేందుకు కూడా సిద్ధమని తేల్చిచెప్పారు.
