“డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక విప్లవం”

• అడవి బిడ్డలకు, ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు అక్షరాలతో ఆత్మీయ ఆలింగనం
• విధ్యార్ధులను విశేషంగా ఆకట్టుకున్న “సమతా ఫ్రీ షిప్” ఉచిత ఉన్నత విద్య
• ఉచిత ఉన్నత విద్యా స్కీం “సమతా ఫ్రీషిప్” లో 516 మంది ఆదివాసీ తెగల విద్యార్ధులు నమోదు
• నలుగురు ట్రాన్స్ జెండర్ విద్యార్ధులు చేరిక
• దివ్యాంగులు 146 మంది ఉన్నత విద్యకు నమోదు
• అన్ని కోర్సుల్లో గత విద్యా సంవత్సరం 51,564 కాగా ఈ విద్యా సంవత్సరం 56,180 విద్యార్ధుల చేరిక
• అడ్మిషన్స్ లో గత విద్యా సంవత్సరంతో పోల్చితే సుమారు 10 శాతం వృద్ధి

హైదరాబాద్ : చీకటి అడవిలో పుట్టి, వెలుగు అక్షరాలకు దూరంగా ఉండిపోయిన అత్యంత వెనకబాటుకు గురైన ఆదివాసీ తెగలు, సమాజం చిన్నచూపు చూసిన ట్రాన్స్ జెండర్స్, దివ్యాంగులు – వీరంతా ప్రస్తుతం మిగిలిన అందరితో కలిసి ఒకే తరగతి గదిలో డిగ్రీ పుస్తకం పట్టుకోనున్నారు. ఈ మానవీయ దృశ్యానికి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) వేదిక అయింది.

“విద్య ఒక్కటే విముక్తి మార్గం” అన్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని అక్షరాలా ఆచరణలో చూపిస్తోంది డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. సమాజ చివరి అంచుల్లో నిలిచిపోయిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, ఉన్నత విద్యా రంగంలో నిశ్శబ్ద మానవతా విప్లవానికి శ్రీకారం చుట్టింది. అడవి బిడ్డలకు, ట్రాన్స్‌జెండర్లకు, దివ్యాంగులకు అక్షరాలతో ఆత్మీయ ఆలింగనం పలుకుతూ, వారికి ఆర్థిక భారం లేకుండా మానవతా హృదయంతో ఉన్నత చదువుల తలుపులు తెరిచింది ఈ యూనివర్సిటీ. సామాజిక సమానత్వం వైపు సమాజాన్ని నడిపించేలా యూనివర్సిటీ అడుగులు వేస్తోంది. యూనివర్సిటీ వీసీగా ప్రొ. ఘంటా చక్రపాణి భాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ధృడ సంకల్పంతో విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఉచిత ఉన్నత విద్యా పథకం “సమతా ఫ్రీషిప్” ఈ మార్పునకు చోదక శక్తిగా నిలిచింది.

ఈ పథకం ద్వారా ఈ విద్యా సంవత్సరం 516 మంది ఆదివాసీ తెగల విద్యార్థులు ఉన్నత విద్యలో అడుగుపెట్టారు. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న నలుగురు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు చేరి గౌరవప్రదమైన భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. సంకల్పానికి వైకల్యం అడ్డు కాదని చాటుతూ 146 మంది దివ్యాంగులు ఈ విద్యా సంవత్సరం యూనివర్సిటీ లో చేరడం విశేషం. ఈ సమ్మిళిత విధానాలు విశ్వవిద్యాలయంపై విద్యార్థుల నమ్మకాన్ని మరింత పెంచాయి. అన్ని కోర్సుల్లో కలిపి మొదటి సంవత్సరం లో చేరిన వారు గత విద్యా సంవత్సరంలో 51,564 మంది విద్యార్థులు కాగా, ఈ విద్యా సంవత్సరం ఆ సంఖ్య 56,180కి చేరింది. గత ఏడాదితో పోల్చితే అడ్మిషన్లలో ఫస్ట్ ఇయర్ లో సుమారు 10 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. చదువును హక్కుగా మార్చి, ప్రతి గడపకూ చేరవేస్తున్న ఈ ప్రయాణం దేశంలోని ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Also Read-

దేశంలోనే మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ప్రారంభమైన డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిజంగా బహుజన బడి గా మారింది. ఇక్కడ 90 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. అందులో సగం మంది మహిళలు. అయినా, ఈ బడిలోకి కూడా అడుగు పెట్టలేని మరి కొన్ని వర్గాల వారు ఉన్నారనే విషయాన్ని గుర్తించి గత విద్యా సంవత్సరం (2025-26) నుండి “సమత ఫ్రీషిప్ ప్రత్యేక స్కీం” ను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పెట్టింది.

ఆదివాసీ బిడ్డలకు ఉన్నత విద్య పూర్తిగా ఉచితం: తెలంగాణ అడవుల్లోని గోండు, కోయ, చెంచు, కొండరెడ్లు తదితర ఆదిమ తెగల పిల్లలకు డిగ్రీ పూర్తిగా ఉచితంగా యూనివర్సిటీ అందిస్తోంది. ఈ వర్గాల బిడ్డలకు ఏడాదికి రూ. 3,200 ఫీజు కూడా భారమే అని గ్రహించి, ట్యూషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. కేవలం రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించి డిగ్రీ లో చేరొచ్చు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఆడియో-వీడియో పాఠాలు, వారి గూడెం దగ్గరే సమీపంలోని స్టడీ సెంటర్లో చదువుకునేలా యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది. ఈ పథకం ద్వారా గత విద్యా సంవత్సరంలో 376 మంది విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 516 మంది ఆదివాసీ తెగల విద్యార్థులు ఉన్నత విద్యలో అడుగుపెట్టారు.

ట్రాన్స్ జెండర్లకు

తెలంగాణలో 10+2 అర్హత ఉన్న ఏ ట్రాన్స్ జెండర్ అయినా ఏ డిగ్రీ కోర్సులోనైనా చేరవచ్చు. రూ. 500 తో అడ్మిషన్ పొంది మిగిలిన ఫీజు మొత్తం మాఫీ. దేశంలోనే ఇలాంటి అవకాశం కల్పించిన మొదటి విశ్వవిద్యాలయం డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిలిచింది. క్లాసుకు వచ్చినా, ఇంటి నుండే చదివినా ఒక్క రూపాయి అదనంగా కట్టనక్కర్లేదు. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో ముగ్గురు విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 2026-27 లో నలుగురు విద్యార్ధులు అడ్మిషన్ పొందారు.

దివ్యాంగులకు

40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి కూడా ఇదే పథకం కింద ఉచిత విద్యను యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో 94 మంది దివ్యంగా విద్యార్ధులు పలు కోర్సుల్లో చేరగా ఈ విద్యా సంవత్సరం 2026-27 లో 146 మంది దివ్యంగా విద్యార్ధులు అడ్మిషన్ పొందడం యూనివర్సిటీ కే గర్వకారణం.

రానున్న 5 ఏళ్లలో 1000 మంది ఆదివాసీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మానవతా హృదయంతో తీసుకున్న ఈ నిర్ణయం ఫలితం ఒక్క సంవత్సరంలోనే కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. అడవి బిడ్డల చదువుల తల్లిగా, అందరికీ సమాన అవకాశం ఇచ్చే సంస్థగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మరోసారి నిరూపించుకుంది. రానున్న 5 సంవత్సరాల్లో కనీసం ఒక వెయ్యి మంది ఆదివాసీ, దివ్యాంగ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో యూనివర్సిటీ ముందుకెల్లుతోంది.

ఇప్పటికే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, దేశ సరిహద్దుల్లో అనునిత్యం కాపలా కాసే సైనికులకు ఉచిత విద్యను అందిస్తూ ఇప్పటికీ పలువురి ప్రశంసలు పొందింది యూనివర్సిటీ, ఇప్పుడు సమాజానికి దూరంగా ఉన్న వారిని అక్షరాలతో అక్కున చేర్చుకుంటోంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.

ఇది కేవలం అడ్మిషన్ల సంఖ్య కాదు, ఆత్మగౌరవానికి ప్రతీక : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటేనే సమానతకు ప్రతిరూపం. రాజ్యంగా నిర్మాత అంబేద్కర్ ఆశించిన సమతా సమాజం తరగతి గదిలోనే మొదలవ్వాలి అని మేం భావించాం. అందులో భాగంగానే “సమతా ఫ్రీ షిప్” స్కీం ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచా. మా పాలకమండలి సభ్యులు మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. అనేక సందర్భాల్లో పలు వేదికలపైన మా “సమతా ఫ్రీ షిప్ స్కీం” ఉచిత ఉన్నత విద్యా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రస్తావించడం మేం గౌరవంగా భావిస్తున్నాం. గత విద్యా సంవత్సరం నుంచి మేము ప్రారంభించిన సమత ఫ్రీషిప్ కేవలం ఫీజు మాఫీ కాదు. అడవిలో పుట్టిన బిడ్డ, నేను ఉన్నత విద్యను చదవలేను, నాకు డిగ్రీ అందుకునే అవకాశం లేదు అనే భయాన్ని వారిలో పోగొట్టడం.

సమాజం నన్ను వెలివేసింది అనుకునే ట్రాన్స్ జెండర్ బిడ్డకు – ‘ఈ విశ్వవిద్యాలయం అండగా నిలిచి’ ఉన్నత విద్యను అభ్యసించేలా తోడ్పాటు అందిస్తుంది అనే భరోసా ఇవ్వడం మా కర్తవ్యంగా భావించాం. ప్రవేశాలు 10 శాతం పెరగడం బాధ్యతను మరింత పెంచింది. ఒక గోండు యువకుడు తన గూడెంలో మొదటి గ్రాడ్యుయేట్ అయినప్పుడు, ఒక ట్రాన్స్ జెండర్ విద్యార్థిని తన డిగ్రీ సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించినప్పుడు – అదే మాకు అసలైన గుర్తింపుగా భావిస్తాం. చదువు అనేది దయ కాదు, హక్కు. ఆ హక్కును అట్టడుగు వర్గాల వారి వరకు చేర్చడమే మా లక్ష్యం. రండి, మీ కలలకు అక్షరాల రెక్కలు తొడుగుదాం. ఈ బహుజన బడి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి. అందరం చేయి చేయి కలిపి రాజ్యాంగ రచయిత డా. బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి వైపు ప్రయాణం కొనసాగిద్దాం. యూనివర్సిటీ. వివరాలకు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar