హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని అంబేద్కర్ వర్శీటీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యలు పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భూ కేటాయింపు ఆలోచనను వెంటనే ఉప సంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా వ్యాప్తిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, మహిళలకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని ఆ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పూర్వ విద్యార్ధుల సమాఖ్య అధ్యక్షులు సాక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు. వీరి నిరసనకు యూనివర్సిటీ జేఏసీ, ఉద్యోగులు మద్దతు తెలిపారు. విశ్వవిధ్యాలయ విస్తరణకు, మౌళిక వసతుల కల్పనకు ఎక్కువ మొత్తంలో భూమి అవసరం ఉందని ఇలాంటి క్రమంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి భూమిలో 10 ఎకరాల భూమి వేరే యూనివర్సిటీ కి కేటాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీ భూమిని వేరే వాళ్లకు కేటాయించడం అంటే ఉన్నత విద్యా వ్యాప్తిని, దూర విద్య విస్తరణను అడ్డుకోవడమేనని జాయింట్ యాక్షన్ కన్వీనర్ ప్రొ.వడ్డాణం శ్రీనివాస్, చైర్ పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే, పూర్వ విద్యార్ధుల సమాఖ్య అధ్యక్షులు సాక వెంకటేశ్వర్లు, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి తదితరులు పేర్కొన్నారు.
ఇది కూడ చదవండి-
అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు తమ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు పూర్వ విద్యార్ధుల సమాఖ్య అధ్యక్షులు సాక వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్ధుల సమాఖ్య సెక్రటరీ డా. ఉదయిని, కార్యవర్గ సభ్యులు ఎన్.సీ. వేణు గోపాల్, రుశేంద్ర మణి, యాదగిరి, మజుల పూర్వ విద్యార్ధులు ఉమా రాణి, క్రాంతి, అనిల్, సువర్ణ, చిరంజీవి, ఉద్యోగులు డా. రవీంద్రనాథ్ సోలోమన్, డా. కిషోర్ కుమార్ రెడ్డి, డా. రమా దేవి, డా. నారాయణ రావు, అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి హాబీబుద్ధిన్, కె. ప్రేమ్ కుమార్, భూ లక్ష్మి, షబ్బీర్, డా. యకేష్ దైదా, డా. కంబంపాటి యాదగిరి, డా. కిషోర్ ఎక్కువ సంఖ్యలో పూర్వ విద్యార్ధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.