“కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదం”

హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదం, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, RDS కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో‘ నవేలి రిజర్వాయర్‘ నిర్మాణానికి పూనుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ మాట్లాడారు.

హరీశ్ రావు మాట్లాడుతూ ఈ విధంగా ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చేస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గుండ్రేవుల ప్రాజెక్టుపై 2013 నాటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్‌లో చాలా స్పష్టంగా ఉంది.. సిల్టేషన్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్ప కొత్త ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదని, గుండ్రేవులకు నీటి కేటాయింపులు చేయలేమని తేల్చి చెప్పింది. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తే తీవ్రంగా వ్యతిరేకించి, నిరసన తెలపడం ద్వారా దాన్ని కోల్డ్ స్టోరేజీలో పడేశాం.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచరుడు, శిష్యుడైన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం వల్లే మళ్లీ గుండ్రేవుల ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చారు. తుంగభద్ర నదిపై ఈ 55 టీఎంసీల నీటిని అటు కర్ణాటక, ఇటు ఏపీ ఆపేస్తే ఆ నీరు అల్టిమేట్‌గా శ్రీశైలం ప్రాజెక్టుకు రాదు.. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మన రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టారు.

Also Read-

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు కేవలం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీతో అనుబంధం ఉండి, చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడితో కేంద్రంలో కార్యదర్శిగా నియమింపజేసుకున్న కాంతారావు సమక్షంలో జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్ లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలి. దేవాదుల ఏ దేశంలో ఉందో తెలియదు, నల్లమల ఏ రాష్ట్రంలో ఉందో తెలియదు.. బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియక గతంలో అనేకసార్లు అభాసుపాలైన రేవంత్ రెడ్డికి నదీ జలాలపై అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ.

మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగిందంటున్న రేవంత్ రెడ్డి.. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల న్యాయమైన వాటా సాధించారా లేదా స్పష్టం చేయాలి. నాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి కనీసం 50 వేల ఎకరాలకైనా నీళ్లు వచ్చేలా చేశారు.. మరి నిన్నటి మీటింగ్‌లో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల గురించి కేంద్రమంత్రితో రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నారా? తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కురుడి 2 టీఎంసీలు, చిక్కలపర్వి 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్, చుక్కలమంచి 5 టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్ పేరుతో మొత్తం 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు కడుతోంది.

కర్ణాటక బ్యారేజీల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో కనీసం మాట్లాడలేదు.. వీటిని నిలిపివేయాలని కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ నుంచి ఎలాంటి హామీ తీసుకోలేదు. కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖలో.. ‘చిక్కమంచి, చిక్కలపర్వి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పవద్దు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా సైలెంట్‌గా ఉండండి’ అని కోరినట్లు స్పష్టంగా ఉంది. కర్ణాటక కడుతున్న ఈ మూడు అక్రమ ప్రాజెక్టుల పనులు ప్రారంభమై ఏడాది దాటి, ఇప్పటికే సగానికి పైగా పూర్తయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి గానీ, కృష్ణా బోర్డుకు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా మౌనంగా ఉండి కర్ణాటకతో కుమ్మకైంది.

పైన కర్ణాటక 35 టీఎంసీల నవేలి, 9.5 టీఎంసీల బ్యారేజీలతో మొత్తం 45 టీఎంసీల నీటిని ఆపేస్తే.. రేపు ఆర్డీఎస్‌కు 5 టీఎంసీలు కూడా రావు.. శ్రీశైలంకు నీళ్లు తగ్గి పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారి ఆగమైపోతుంది. తెలంగాణను పోరాడి సాధించిన పార్టీగా బీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర నీటి హక్కులను హరిస్తానంటే చూస్తూ ఊరుకోదు.. గోదావరి, కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీరు తగ్గినా, ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఊరుకునే ప్రసక్తే లేదు. గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నికర నీటి కేటాయింపులు ఉండగా, బీఆర్ఎస్ హయాంలో 830 టీఎంసీలకు పూర్తి అనుమతులు తెచ్చుకున్నాం.. మరో 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉంది.

గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు గోదావరిలో కేవలం 265 టీఎంసీలకే అనుమతులు తెచ్చాయి.. అంటే ఏడాదికి సగటున 4.48 టీఎంసీలు సాధిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తొమ్మిదిన్నరేళ్లలో 383 టీఎంసీలకు ఏడాదికి సగటున 40.36 టీఎంసీలు అనుమతులు సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతులు సాధించలేదు. నదుల అనుసంధానం జరగాలంటే ముందు తెలంగాణ 968 టీఎంసీల ప్రాజెక్టుల అనుమతులన్నీ క్లియర్ కావాలని బీఆర్ఎస్ నాడే కేంద్రానికి తేల్చి చెప్పింది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు సాధించకుండానే నదుల అనుసంధానానికి ఎలా ముందుకు వెళ్తోంది?

పెండింగ్‌లో ఉన్న 138 టీఎంసీలకు సంబంధించి సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వాద్ర ప్రాజెక్టు 20 టీఎంసీలు, ఎల్లంపల్లి 30 టీఎంసీలు డీపీఆర్‌లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో సబ్మిట్ చేసింది.. కానీ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, క్లియరెన్స్ లేకపోవడం వల్ల సమ్మక్క సాగర్, వాద్ర డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 147 టీఎంసీల నదుల అనుసంధానం చేయాలని, ఆ అనుసంధానం తెలంగాణ భూభాగం సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్ నుంచి వెళ్లాలని, అందులో సగం నీళ్లు 74 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ నాడే కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో వందల సార్లు మినట్స్ ఆఫ్ మీటింగుల్లో రికార్డు చేయించింది.

రేవంత్ రెడ్డి మన 968 టీఎంసీల హక్కుల గురించి ఆలోచించకుండా, గోదావరి-బనకచర్ల ఇంటర్ లింకింగ్‌కు ఓకే చెప్తూ తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తున్నాడు. ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాను పూర్తిగా వాడేసుకుని, ఇప్పుడు నదుల అనుసంధానం పేరిట గోదావరి నుండి మరో 200 టీఎంసీల నీటిని తరలించాలని చూస్తోంది.. దీనిపై రేవంత్ రెడ్డి తెలంగాణకు దక్కాల్సిన సగం వాటా కోసం వాదించడం లేదు. పోలవరం-బనకచర్ల లింకింగ్ తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రా పోలవరం నుంచే పోయే విధంగా రేవంత్ రెడ్డి అగ్రిమెంట్లు చేసుకున్నారని పత్రికల్లో లీకులు వస్తున్నాయి.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలి.

కేసీఆర్ గారు తొమ్మిదేళ్లు పోరాడి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి కృష్ణా నదీ జలాల పునర్ పంపిణీ కోసం ట్రిబ్యునల్ సాధించారు.. కొద్ది నెలల్లోనే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు నీటి లెక్కలు తేలనున్నాయి. కానీ రేవంత్ రెడ్డి అజ్ఞానం, గురువుకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే తపన.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు శాపంగా మారింది. రేవంత్ రెడ్డి గత ఏడాది జూన్ 18న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ NOC ఇస్తామని, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారు.. మళ్లీ సెప్టెంబర్ 13 సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారు. ఢిల్లీ మీటింగ్‌కు పోను పోను అంటూనే పోయి ఎజెండాలో లేని బనకచర్లపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.. సంతకం పెట్టను అంటూనే సంతకం పెట్టి, కమిటీ వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ పరిచారు.

ప్రతి దశలోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తూ, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు.. సీక్రెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు, కేంద్ర కార్యదర్శి కాంతారావు ఏం చెప్పారో రేవంత్ రెడ్డి బయటపెట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డి నిన్ను బయట కూర్చోబెడితే ఎలా ఊరుకున్నావు.. కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకైనా తెలంగాణ సోయి లేదా? 968 టీఎంసీల నికర గోదావరి జలాలు, నదుల అనుసంధానం, కృష్ణా నికర జలాలు, ఆర్డీఎస్-తుంగభద్ర అంశాలపై రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల వల్ల రాష్ట్ర భవిష్యత్తు కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల్లో పెట్టారు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు చెప్తే వినే పరిస్థితిలో ఉంది.

ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి.. ముగ్గురు సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను వెంటనే శాసనసభలో పెట్టి చర్చించాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ తెచ్చే పేరుతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టును బలి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు 4 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది.. దాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు బలిపెడుతున్నారు? కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పరివాహక ప్రాంతం చట్టా రీత్యా తెలంగాణకు 700-800 టీఎంసీలు వస్తాయి.. పోలవరం డైవర్షన్ కింద 45 టీఎంసీలు, పాలమూరుకు 90 టీఎంసీలు రావాల్సిందే.. దీనికి చంద్రబాబు భిక్షం పెట్టాల్సిన అవసరం లేదు.

నదుల అనుసంధానం చంద్రబాబు, మోదీ కల కావచ్చు.. కానీ అది తెలంగాణను బలిపెట్టి చేయకూడదు.. పైన కర్ణాటక 16 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపుకొని, కింద గోదావరి నీళ్లను ఏపీ వాడుకుంటే మధ్యలో నష్టపోయేది తెలంగాణే అనే కనీస జ్ఞానం రేవంత్ రెడ్డికి లేదు. హైడ్రా విషయంలో హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్ల విషయంలో రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన ‘నీరో చక్రవర్తి’ స్ఫూర్తిగా తీసుకుని ఉండవచ్చు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక నిరసన ఉత్తరం కూడా రాయడం లేదు. ఆంధ్రప్రదేశ్కేమో గురుదక్షిణ, కర్ణాటకకేమో ఎన్నికల సహాయానికి ప్రతిఫలంగా దక్షిణ చెల్లించుకుంటూ తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ధారపోస్తున్నారు.

968 టీఎంసీల గోదావరి హక్కులను కాపాడారా? సమ్మక్క సాగర్ ఇంటర్ లింకింగ్ ప్రతిపాదన ఉందా లేదా? అందులో 50% నీళ్లు తెలంగాణకు వస్తున్నాయా? ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలు సాధించారా? కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని లేఖ రాస్తారా లేదా? అన్ని విషయాలపై రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ట్రిబ్యునల్స్ ముందు గట్టిగా వాదనలు వినిపించి, మంచి లాయర్లను పెడితే 700-800 టీఎంసీలు సాధించే అవకాశముంది.. రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణను ముంచే ‘ముంపు మేస్త్రివి’ కావద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X