హైదరాబాద్ : భూభారతి- 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ‘భూభారతి, 22ఏపై మహాధర్నా’ నిర్వహించారు. బిజెపి శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ మహాధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, శ్రీమతి డి. కె. అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, డా. గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు ఇతర బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు మాట్లాడుతూ, భూభారతి మరియు 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్రంలో ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను మరియు రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్లిస్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీకి వ్యవస్థను అప్పగించి అవకతవకలకు పాల్పడితే, ఆ లోపాలను సరిదిద్దేందుకు భూభారతి తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితాలోని భూములను తొలగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వేసిన కోదండరాం కమిటీ వంటి వాటితో కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నారని, తప్పు జరిగిందని ముఖ్యమంత్రి మరియు మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనని అన్నారు.

రైతులే కాకుండా మల్కాజిగిరి వంటి శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకున్న మధ్యతరగతి ప్రజల ఇళ్లను, చివరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు భూముల పేరు చెప్పి ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం (మాలఫైడ్ ఇంటెన్షన్) స్పష్టంగా కనిపిస్తోందని, ఇది కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనని ఆరోపించారు. ఏదైనా సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే, ఏకంగా మిగతా సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల కడుపు కొట్టేలా సాగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని బిజెపి తరఫున డిమాండ్ చేశారు.
Also Read-
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, రైతులు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కలెక్టర్లు సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది తమ భూములను అమ్ముకోలేక, పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్ల కోసం బ్యాంకుల్లో రుణాలు సైతం తీసుకోలేక తీవ్ర క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. సొంత భూమిపై హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన మానవ హక్కు అని, రాష్ట్ర ప్రభుత్వం ఆ మానవ హక్కులను సైతం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ప్రభుత్వం మాత్రమే బాగుపడుతోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే సభను కేవలం రెండు రోజులకే పరిమితం చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ధర్నాలకు కూడా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. 22ఏ జాబితాలో పెట్టిన రైతుల, ప్రజల భూములన్నింటినీ తక్షణమే విముక్తి చేయాలని, లేనిపక్షంలో సడక్ నుంచి సదన్ వరకు భారతీయ జనతా పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని రాoచందర్ రావు గారు హెచ్చరించారు.

One thought on “రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే: ఎన్. రాoచందర్ రావు”