హైదరాబాద్ : మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చెత్త పనులు మానుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రాంకీ సంస్థకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పగిస్తోందని, ప్రాపర్టీ ట్యాక్స్ లో కలిపి చెత్త పైసలు వసూలు చేస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని కార్మికులు వివరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాంకీ సంస్థకు లాభం చేయడానికి స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారిని రాంకీ సంస్థకు జీతగాళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. స్వయం ఉపాధి ద్వారా మంచి ఆదాయం పొందుతున్న వారికి నెలకు రూ.16 వేలు మాత్రమే జీతం ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చెత్త పైసలపై ముఖ్యమంత్రి కన్నుపడింది
చెత్త పైసలపై ముఖ్యమంత్రి కన్నుపడిందని కవిత మండిపడ్డారు. హైదరాబాద్ లో 20 వేల ఆటోల ద్వారా 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులు ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. చెత్త సేకరిస్తున్న ఇంటి నుంచి నామామాత్రంగా ఛార్జ్ చేస్తూ ఒక్కో కుటుంబం నెలకు రూ.50 వేల వరకు సంపాందించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వంపై రూపాయి భారం వేయకుండా నగరాన్ని స్వచ్చంగా ఉంచుతూ ఉపాధి పొందుతున్న వారిపై ఆదాయంపై ముఖ్యమంత్రి కన్ను పడటం దారుణమన్నారు. రాంకీ సంస్థ కోసం ఇప్పుడు వారి ఉపాధికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Also Read-
చెత్త ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్
ప్రజల నుంచి వారికి డబ్బులు రాకుండా చెత్త ట్యాక్స్ ను ప్రాపర్టీ ట్యాక్స్ లో కలపాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని.. దీని ద్వారా 20 వేల స్వచ్ఛ ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛ కార్మికులను రాంకీకి జీతగాళ్లుగా మార్చి నెలకు రూ.16 వేల జీతం మాత్రం ఇస్తామనడం దారుణమన్నారు. నెలకు రూ.16 వేలతో స్వచ్ఛ ఆటో కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. చెత్త సేకరణ కాంట్రాక్టు రాంకీకి ఇచ్చే ప్రయత్నాలు విరమించుకోవాలని, చెత్త సేకరణ యథావిధిగా కార్మికులతోనే చేయించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ఇంటి ముందు వెయ్యి ఆటోల చెత్త పోస్తాం
స్వచ్ఛ ఆటో కార్మికులకు అన్యాయం చేస్తామంటే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని కవిత హెచ్చరించారు. భయపడితే, బెదిరిస్తే బెదిపోవద్దని కార్మికులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు అన్యాయం జరగనివ్వనని హామీ ఇచ్చారు. రాంకీకి కాంట్రాక్టు ఇచ్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే సీఎం ఇంటి ముందు వెయ్యి ఆటోల చెత్త పోస్తామని హెచ్చరించారు.
కార్మికులు సైనికులతో సమానం
ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి పొందుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు సైనికులతో సమానమని కవిత అన్నారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎంత గౌరవమిస్తామో నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులకు అంతే గౌరవమివ్వాలని సూచించారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఇన్సూరెన్స్ చేయాలన్నారు. రాంకీ సంస్థ నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్వచ్ఛ ఆటో కార్మికులు పాల్గొన్నారు.
