‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిరాహార దీక్ష ప్రారంభం, ఆర్. కృష్ణయ్య మద్దతు

హైదరాబాద్ : తెలంగాణలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరిట పెండింగ్‌లో ఉన్న రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది.

ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గకుండా, విద్యార్థుల పక్షాన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే రాంచందర్ రావు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక, ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన పాలకుల తీరుపై రాజీలేని పోరాటం చేస్తూ, తెలంగాణవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకానికి బీజేపీ పూర్తి భరోసా కల్పిస్తోంది. ఫీజు బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ పోరాటం ఆగదని పార్టీ స్పష్టం చేసింది.

దీక్షా కార్యక్రమానికి విద్యార్థులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ శ్రీమతి రేఖా శర్మ, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి & మీడియా ఇంచార్జ్ న్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బొడిగె శోభ, రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్టీ పదాధికారులు మరియు పెద్దఎత్తున విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read-

రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య మద్దతు

రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టడాన్ని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే రాంచందర్ రావు విద్యార్థుల సమస్యలపై అనేక సమరశీల పోరాటాలు చేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడిన చరిత్ర ఆయనది.

ఈరోజు కూడా విద్యార్థుల బాధను అర్థం చేసుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం 48 గంటల దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షతో అయిన స్పందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకపోతే.. ఈ ఉద్యమం మంటగా, జ్వాలగా మారి చివరకు రేవంత్ రెడ్డి అధికారానికే సవాల్‌గా మారుతుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే మూడేళ్లు గడిచినా విద్యార్థులకు బకాయిలు చెల్లించలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులు ఉద్యమాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, చివరకు కాలేజీ యాజమాన్యాలు సైతం ఫీజు బకాయిల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది.

డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు నిర్వహించినా.. వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం వారిని బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తోంది. మేము బీసీ సంఘాలుగా, రాజకీయ నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తుంటే.. సమస్యను పరిష్కరించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ముఖ్యమంత్రి వైఖరికి నిదర్శనం.

నేను విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తే “ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీగా ఉన్నావు.. అక్కడికి వెళ్లి ఉద్యమాలు చేయాలి” అంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సమస్యను డైవర్ట్ చేయడం కాకుండా.. దాని పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇకపై విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు.

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకొని అవసరమైన నిధులు తీసుకొస్తాం.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రేవంత్ రెడ్డి పెట్టింది కాదు. దీని కోసం గతంలో కూడా మేము అనేక పోరాటాలు చేశాం. విద్యార్థుల కోసం బీజేపీ నాయకులు శ్రీ రాంచందర్ రావు, శ్రీ కిషన్ రెడ్డితో పాటు తదితరులు ఉద్యమాలు చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాడితే ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం పోరాడుతున్న నాయకులను బ్లాక్‌మెయిల్ చేయడం ఇకనైనా మానుకోవాలి. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి.

ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోవద్దు. ఈ ఉద్యమం చివరకు మీ అధికారానికే సవాల్‌గా మారుతుంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం బడ్జెట్ లేదని ప్రభుత్వం చెప్పడం అర్థరహితం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. మరి 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా?

రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెస్తోంది.. భూములు అమ్మి వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటోంది.. తెలంగాణకు ప్రతి నెలా భారీ ఆదాయం వస్తోంది. అయినా విద్యార్థుల ఫీజుల కోసం నిధులు లేవని చెప్పడం సరికాదు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజులు చెల్లించడానికి ఎందుకు వెనుకాడుతోంది?

పేద కులాల పిల్లలు చదువుకొని కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, డిప్యూటీ కలెక్టర్లు కావాలంటే విద్యే ప్రధాన మార్గం. మొదటి సంవత్సరం ఇవ్వలేదు.. రెండో సంవత్సరం ఇవ్వలేదు.. మూడో సంవత్సరం కూడా విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టిస్తోంది. విద్యార్థులను “క్రిమినల్స్” అంటూ విమర్శించే ముందు.. విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేసిందో ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

చదువుకునే పిల్లలు భవిష్యత్తులో గొప్పవారవుతారు. వారిపై పెట్టే ప్రతి రూపాయి సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ కనీస అవగాహన ప్రభుత్వానికి ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఒక్కరోజులో వచ్చినది కాదు. దీని కోసం గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా ఈ పథకాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించినప్పుడు.. నేను, శ్రీ కిషన్ రెడ్డి గారు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టాం. దీంతో ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించడంతో పాటు పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.

ఇప్పుడు మా డిమాండ్ పాత బకాయిలు చెల్లించడం మాత్రమే కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్డీయేలో భాగస్వామిగా నడుస్తోంది. అక్కడ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించడంతో పాటు కాలేజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. తెలంగాణలో కూడా కాలేజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల స్కాలర్‌షిప్ ఇవ్వాలి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులకు ఎంత ఫీజు ఉంటే అంత మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదు. ఫీజు బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X