బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ కర్ణాటక-తమిళనాడు కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు గారు ప్రసంగిస్తూ, గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. ఐటీ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, అంతరిక్ష పరిశోధనలు మరియు రక్షణ రంగంలో స్వదేశీ యుద్ధ విమానాలను తయారు చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. నాడు దేశంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే, నేడు వాటి సంఖ్య 20కి చేరడంతో పాటు ఎయిమ్స్, ఐఐఎంలు, ఎన్‌ఐటీల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. యువతను ఉద్యోగాలు కోరేవారిగా మాత్రమే కాకుండా, ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేర్చేందుకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర పథకాల ద్వారా కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల ఆదర్శాలతో యువత ముందుకు సాగాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కాశ్మీర్ ఆజాదీ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చే విచ్ఛిన్నకర శక్తులకు, పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడే శక్తులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వీధి నాటకాలు చేస్తూ దేశం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విపక్ష కూటమి పాలనలో ఉన్న జార్ఖండ్‌లో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి 12 రోజులుగా న్యాయం కోసం పోరాడుతుంటే ఈ కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Also Read-

అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, చేస్తున్న మోసాలు, అన్యాయం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 4.5 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే మరో రూ. 2 లక్షల కోట్లకు పైగా భారం మోపి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలను, బీసీ రిజర్వేషన్ల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) అమలు చేయకపోగా, విద్యార్థులకు అందాల్సిన దాదాపు రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరిట రియల్ ఎస్టేట్ బడా బాబులకు వేలాది ఎకరాల విలువైన భూములను ధారాదత్తం చేసే కుట్రలు చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్ల విభజన పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకానికి 90 శాతానికి పైగా నిధులు కేంద్రానివేనని, అయితే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టకుండా ప్రజలను వంచించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని వివరించారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రైల్వేస్టేషన్ల మోడ్రనైజేషన్, కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్, రామగుండం ఫెర్టిలైజర్స్ (RFCL) పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్ (NIMZ), హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO),ఎంఎంటీఎస్ విస్తరణ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిందని రాంచందర్ రావు గారు స్పష్టం చేశారు.

దేశ రక్షణ, దేశభక్తిపై యువతకు పిలుపునిస్తూ… గతంలో ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగినా పట్టించుకోని పరిస్థితులు ఉండేవని, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి గట్టి ప్రతీకారం తీర్చుకున్నామని గుర్తుచేశారు. ఈ దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ “హమ్ కరేంగే.. హమ్ కరేంగే” అంటూ బాధ్యతగా ముందుకు రావాలని, “అగర్ భారత్ మే రహనా హోగా.. తో వందేమాతరం కహనా హోగా” అనే జాతీయ భావనతో ప్రతి పౌరుడూ నిలబడాలని ఉద్ఘాటించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన 150 ఏళ్ల చరిత్ర గల పవిత్రమైన ‘వందేమాతరం’ గేయం ఆలపిస్తుంటే కూర్చుని అవమానించే మజ్లిస్ నాయకుల తీరును సమాజం అసహ్యించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను, భారతావనిపై చేసే అనుచిత వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని తీవ్రంగా హెచ్చరిస్తూ, దేశ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ రాంచందర్ రావు గారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X