సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం సంకల్పం తీసుకుంటున్న
ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ కొట్లాది మంది జీవితాలను మార్చబోతోంది
నేను బీసీల కోసం మాట్లాడితే అగ్రకులం అంటూ నన్ను హేళన చేస్తారు
నా పుట్టుక నా చేతిలో లేదు.. నేను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం నా చేతుల్లోనే ఉంది
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా
బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్ లోపు పాస్ చేసి పంపించాలి
హైదరాబాద్: సామాజిక న్యాయ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాల్లో సాధికారిత వచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు పోరాటం చేయాలంటే అందుకు దమ్ము, ధైర్యం ఉండాలని…ఆ దమ్ము, ధైర్యం తనకు ఉందని చెప్పారు. బీసీల కోసం నేను మాట్లాడితే అగ్రకులంలో పుట్టిన నీకెందుకంటూ కొందరూ మాట్లాడుతారని అన్నారు. కానీ నా పుట్టుక నా చేతిలో లేదని, కానీ నేను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు తనకుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న సామాజిక తెలంగాణ సాధించి తీరుతానని సంకల్పం తీసుకుంటున్నట్లు కవిత చెప్పారు.

సామాజిక తెలంగాణ కోసం జీవితం అంకితం
సామాజిక తెలంగాణ కోసం ఇక తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని కవిత అన్నారు. ఇప్పటి వరకు కనీసం సర్పంచ్ కూడా కానీ కులాల్లో సాధికారిత వచ్చే వరకు వారితో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. అగ్రకులంలో పుట్టిన తాను బీసీ ల కోసం మాట్లాడటం ఏంటనీ ఈ సభ తర్వాత కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు. కానీ ఇప్పటి వరకు సమాజంలో జరిగిన అనేక ప్రజాస్వామిక మార్పులకు అగ్రకులాల్లో పుట్టిన ప్రజాస్వామిక వాదులే కారణమయ్యారు. అని ఆమె అన్నారు. ఆనాటి రాజుల కాలంలోనూ గౌతమ బుద్దుడు, సాహు మహారాజు లాంటి క్షత్రియ పుత్రులే అట్టడుగు వర్గాల మేలు కోసం పనిచేశారని గుర్తు చేశారు. మండలి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు బిర్వాలో పెడితే దాన్ని క్షత్రియుడైన వి. పి సింగ్ అమలు చేశారని చెప్పారు. తమిళనాడు లో బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు కావాలని వాటిని 9 వ షెడ్యూల్ లో చేర్చింది అగ్రకులానికి చెందిన జయలలితేనని అన్నారు. తన పుట్టుక తన చేతిలో లేదని…కానీ తాను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునేది తనేనని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఇక తాను సంకల్పం తీసుకున్నానని…అందు కోసం తన జీవితాన్నే అంకితం చేస్తున్నానని చెప్పారు.

సామాజిక సంకల్ప సభ కొట్లాది జీవితాల్లో మార్పు తెస్తుంది
తాము చేపట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కచ్చితంగా కొట్లాది మంది జీవితాల్లో మార్పు తెస్తుందని కవిత అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కే విధంగా గ్రామ గ్రామనా తమ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమాజంలో ఒక గొప్ప మార్పు తెచ్చే అవకాశం ఒక పార్టీగా తమకు దక్కిందని అన్నారు. ఈ పోరాటాన్ని సాయిత్రి భాయ్ పూలే జయంతి వరకు 5 నెలల పాటు మరిన్ని సభలు సమావేశాలు నిర్వహిస్తూ కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 6 న నాటికి సామాజిక న్యాయ తెలంగాణ పోరాటంలో పురోగతిని సమీక్షించుకుంటామన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారందరితో కలిసి పనిచేస్తామని కవిత చెప్పారు. సామాజిక న్యాయం అంటే 10 శాతం ఉన్న వాళ్లు 90 శాతం అవకాశాలను దక్కించుకోవటం కాదని…90 శాతం ఉన్న వాళ్లకు సమానంగా అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. రాజుల కాలం నాటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ల్లో ఆర్థిక అసమానతలు కాస్త తగ్గించినప్పటికీ కుల వివక్ష విషయంలో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షను పొగొట్టటంలో జరగాల్సినన్నీ పోరాటాలు జరగలేదని కవిత చెప్పారు.

ఇది కూడ చదవండి-
బీసీ బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్ లోపు పాస్ చేయాలి
బీసీ లకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందన్నారు. 46 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లింలు ఉంటే 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు అంటూ వింత లెక్కలు ప్రతిపాదించిందన్నారు. పైగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు కాకుండా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ లేఖలు రాసుకుంటూ గల్లీ లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎందుకు కలిసి పనిచేయరంటూ కవిత ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సెషన్ లోపు బీసీ బిల్లు పాస్ చేసి పంపించాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కు లు సహా ఎస్సీ, ఎస్టీలకు వారి నిధులు వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలన్నారు. ముస్లింలను కేవలం మాటలతోనే అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో కడుపు నిండదని వారికి న్యాయం చేయాలని కోరారు. ముస్లింలు తమతో కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు.

జయశంకర్ సార్ కన్న కలను నిజం చేస్తా
తెలంగాణ ఉద్యమ సమయంలోనే సామాజిక తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడే వారని కవిత అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా శక్తులతో పోరాడుతూ సామాజిక తెలంగాణ కోసం పోరాటం కష్టమని ఆయన చెప్పారన్నారు. అయితే భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక తెలంగాణ సాధించాలని చెప్పేవారన్నారు. ఆయన కన్న కలను నిజం చేసేందుకు తాను సంకల్పం తీసుకున్నానని కవిత చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ 97 శాతం జనం పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇక 71 శాతం మంది బీసీలు పరిస్థితి ఎస్సీ ల కన్నా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాలని కవిత అన్నారు.

సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ
సామాజిక న్యాయ తెలంగాణ కోసం కవిత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కే వరకు పోరాటం చేస్తామని అన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక స్వావలంభన అన్ని వర్గాలకు దక్కే వరకు అంకితభావంతో పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సభలో కవిత పలు తీర్మానాలు ప్రతిపాదించారు.
- బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసి వచ్చే వారితో దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది.
- మహత్మా జ్యోతిరావ్ పూలే దంపతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలి.
- ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని పెట్టాలి.
- ఎస్సీ, ఎస్టీల నిధులను వాళ్ల అభ్యున్నతి కోసమే వాడాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నింపేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి.
- ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు రావాలి.
- డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.
- ముస్లింలకు ఆర్థిక స్వావలంభనతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి.
- సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంభన ఉండేలా చర్యలు తీసుకోవాలి.
10 . ట్రాన్స్ జండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి.
- వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి. వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఈ తీర్మానాలకు సభికులు ఆమోదం తెలిపారు.
ఎక్స్ (ట్విట్టర్) ట్రెండింగ్ లో ఇండియా నంబర్ వన్ గా టీఆర్ఎస్ 4 సోషల్ జస్టిస్
#TRS4SocialJustice హాష్ ట్యాగ్ పై కవిత చేసిన పోస్ట్ ఇండియాలోనే నంబర్ వన్ గా ట్రెండ్ అవటం విశేషం.
సరూర్ నగర్ లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ నాయకులతో ప్రతిజ్ఞ చేయించిన వీడియోను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇండియాలోనే నంబర్ వన్ గా డ్రెండ్ అవటం తో టీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
