హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే, రైలు కార్యకలాపాలలో భద్రత పట్ల తన నిబద్ధతను ఈరోజు, అనగా 29 జూన్ 2026న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో నిర్వహించిన ఒక సవివరమైన సమీక్షా సమావేశం ద్వారా పునరుద్ఘాటించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు సిబ్బంది అసురక్షిత పరిస్థితులను నివారిస్తూ తమ విధి నిర్వహణలో చురుకుదనం మరియు అంకితభావాన్ని ప్రదర్శించినందుకుగాను ఐదుగురు ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు మరియు సికింద్రాబాద్, హైదరాబాద్,నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

విధులలో అప్రమత్తత, సమయపాలన, పరిపూర్ణత మరియు అంకితభావం చూపినందుకు గాను లోకోపైలట్లు, పాయింట్స్‌మ్యాన్ , అసిస్టెంట్ టిఆర్‌డి, కీమ్యాన్‌లతో కూడిన ఫ్రంట్‌లైన్ సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేయబడ్డాయి. డివిజన్ల వారీగా పురస్కార గ్రహీతల పంపిణీ ఈ క్రింది విధంగా ఉంది: సికింద్రాబాద్ డివిజన్ – 03; హైదరాబాద్ డివిజన్ – 01 మరియు నాందేడ్ డివిజన్ – 01. జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, విధుల నిర్వహణలో వారి అంకితభావాన్ని మరియు చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఇటువంటి గుర్తింపు ఇతర ఉద్యోగులను కూడా అప్రమత్తంగా ఉండటానికి మరియు రైలు కార్యకలాపాలలో భద్రతా ప్రమాణాలను కాపాడటానికి ప్రేరేపిస్తుందని మరియు ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ టెర్మినల్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన అధిక శక్తిని గ్రహించే డెడ్ ఎండ్ బఫర్ స్టాప్‌ల పనితీరును సమీక్షించారు. ఆయన చెట్ల కొమ్మల కత్తిరింపును పరిశీలిస్తూ, లోకో సిబ్బందికి సిగ్నల్ అంశాలు స్పష్టంగా కనిపించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జోన్ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు సన్నద్ధతను ఆయన వివరించారు.

Also Read-

తదుపరి, జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, “వర్షాకాల సన్నద్ధత అనేది కేవలం ఒక కాలానుగుణమైన నియమావళి మాత్రమే కాదు—ఇది ప్రయాణీకుల భద్రత మరియు మౌలిక సదుపాయాల పటిష్టత పట్ల మన చురుకైన దృక్పథానికి ప్రతిబింబం. ప్రతి సూపర్‌వైజర్, ప్రతి బృంద సభ్యుడు సమయస్పూర్తితో మరియు ఖచ్చితత్వంతో వ్యవహరించాలి” అని ఆయన స్పష్టం చేశారు.

