“ఆంధ్రా ప్రజలతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సమస్యంతా ఆంధ్రా రాజకీయ నాయకులతోనే”

హైదరాబాద్: తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనాన్ని సహించబోమని టీఆర్ఎస్ ఛీప్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన “ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” పై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఎలాంటి విబేధాలు లేకుండా కలిసే ఉన్నారని గుర్తు చేశారు. కానీ రాజకీయ నాయకులే తెలంగాణ ఆస్తిత్వంపై దాడి చేస్తూ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రక్షణ సేన మాత్రమే కాపాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలను ఆంధ్రాకు పార్సల్ చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ సీఎంగా ఉండటంతో మళ్లీ ఈ ప్రాంతంలో కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రాలో 12 ఏళ్లు గడిచిన రాజధాని నిర్మాణం చేతకాక ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మన అస్తిత్వం పై దాడి చేస్తూ వారి సంస్కృతిని రుద్దుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ తల్లి మీద కన్నేస్తే ఊరుకునే తెలంగాణ కాదన్నారు. తమతో పెట్టుకున్న వాళ్లెవరు బాగుపడలేదని…ఇప్పటికే ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ తమతో పెట్టుకుంటే పళ్లు రాలుతాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.

విగ్రహాలు పార్సిల్ చేస్తాం

తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తమ అస్తిత్వంపై దాడియే అన్నారు. తమతో పెట్టుకుంటే గతంలో తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. మరోసారి తమ జోలికి వస్తే ఈసారి పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నఆంధ్రా నాయకుల విగ్రహాలను తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పగలకొట్టి మరీ పార్సిల్ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంతో సహన శీలురుని… అందుకే ఇప్పటికీ కూడా ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పటికీ గౌరవిస్తున్నామన్నారు. కానీ శృతి మించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కవిత హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతున్నట్లుగానే ఆంధ్రాలో తెలంగాణ నాయకుల విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

మన సీఎం ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ అని కవిత ఆరోపించారు. ఆయన సహకారంతోనే తెలంగాణపై ఆంధ్రా నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో ఈ ప్రాంతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అప్పటి నుంచి మళ్లీ కుట్రలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి లాంటి వాళ్లు తమ విశ్లేషణలు చేస్తే ఆంధ్రా పోలీసులు ఇక్కడకు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పే ధైర్యం చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని …కానీ ఆంధ్రా రాజకీయ నాయకులతో మాత్రం సమస్య ఉందన్నారు. తెలంగాణ సెక్రటేరియేట్ లో, ఇక్కడి రాజకీయాల్లో వేలు పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కవిత తేల్చిచెప్పారు.

Also Read-

రాజధాని నిర్మాణం చేతకాకే

ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని ప్రజలను డైవర్ట్ చేయటానికి మహానాడులో తెలంగాణ వ్యక్తితోనే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అనిపించారని విమర్శించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు అలా మాట్లాడడని చెప్పారు. ఇవన్నీ యాధృచ్చికంగా కాకుండా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలని కవిత చెప్పారు. రాజ్యాంగం తమకు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. మీ డిక్షనరీ లో తెలంగాణ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఫైర్ అయ్యారు. వానకాలం వచ్చిందంటే సెక్రటేరియేట్ లోకి నీళ్లు, రాజధాని మునిగిపోవటం అనేది ఆంధ్రా ప్రజలకు అవమానమని కవిత అన్నారు. నాయకులకు ఏదైనా అయితే వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారని…కానీ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. నెల్లూరు వాళ్లు చెన్నైయ్ కి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు రావాల్సిందేనా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం 80 వేల ఎకరాలు సేకరిస్తున్నారని…అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. పాలన సౌలభ్యం కోసం కొన్ని భవనాలు నిర్మించేందుకు 80 వేల ఎకరాలు ఎందుకన్నారు. ఈ విషయంలో అవసరమైతే ఆంధ్రా ప్రజల హక్కుల కోసం పోరాడుతామని కవిత చెప్పారు.

11 రోజులు పస్తులున్న వ్యక్తిని ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటుందా?

తెలంగాణలో నవ నిర్మాణ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ సిద్ధమవటంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు 11 రోజులు పస్తులుండి బాధపడిన వ్యక్తికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని…సినిమా యాక్టర్ గా రెండు డైలాగ్ చెప్పుకోని సభ పెట్టుకోవచ్చని అన్నారు. తెలంగాణలో నవ నిర్మాణ్ సంగతి తర్వాత ముందు ఆంధ్రా సెక్రటేరియేట్ నీళ్లు రాకుండా చూసుకోవాలని పవన్ కు సలహా ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన యోగా చేసిన ఒక్క ఓటు కూడా రాదన్నారు.

తెలంగాణ తల్లిపై కన్నేస్తే ఊరుకోం

తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్ కు, తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించిన లోకేష్ కు కలిసి కవిత కౌంటర్ ఇచ్చారు. విస్తరించటానికి లోకేష్ బాబు ఇదేం మీ సామ్రాజ్యం కాదని చెప్పారు. అసలు ఆంధ్రా నాయకులు ఎప్పుడైనా తెలంగాకు మంచి జరగాలని కోరుకున్నారా అని కవిత ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు మన నీళ్లు దోచుకుందామని చూశారే తప్ప సమానంగా పంచుకుందాని ఏనాడైన అన్నారా అని కవిత నిలదీశారు. ఈ ప్రాంతం మీద ఏ మాత్రం ప్రేమ లేని వాళ్లు ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తారని చెప్పారు. తెలంగాణ తల్లి మీద కన్నేస్తామంటే ఊరుకునే ఎడ్డి తెలంగాణ ఇది కాదని కవిత స్పష్టం చేశారు. అదే విధంగా తమకు ఆంధ్రా ప్రజలతో ఎలాంటి సమస్య లేదన్నారు. తెలంగాణను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రా రాజకీయ నాయకులతోనే అసలైన సమస్య అని అన్నారు. ఆంధ్రాలో రైతులను, ప్రజలను దోచుకున్నది చాలక తెలంగాణను కూడా దోచుకుంటారా అని నిలదీశారు. కర్ణాటకలోనో, తమిళనాడులోనో మీ పార్టీ విస్తరించుకోవాలని తెలంగాణలో మిమ్మల్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ఇక్కడి ప్రజలు మీ పార్టీలను నమ్మకపోవటంతోనే దుకాణాలు బంద్ చేసుకున్న సంగతి మర్చిపోయారా అని వారికి గుర్తు చేశారు.

ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం

తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు 250 గజాల భూమికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత కోరారు. లేదంటే భూపోరాటాలు తప్పవని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రభుత్వానికి సరిగ్గా నెల రోజులు సమయమిస్తామని ఈ లోగా ఇస్తామన్న భూమి ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవన్నారు. ఉప్పల్ భగాయత్ లోని 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జులై 2 న లక్షలాది మంది ఉద్యమకారులతో హైదరాబాద్ మహాసంద్రంగా మారుతుందని చెప్పారు. కేసులు లేనివాళ్లు, ఉన్న వాళ్లు అంటూ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే సహించేది లేదని కవిత అన్నారు. మొదటి దఫాలో కేసులు ఉన్న వాళ్లకు భూములు కేటాయించాలని తర్వాత మిగతావారికి ఇవ్వాలన్నారు. ఇక ప్రభుత్వం వేసిన కేకే, పీకే కమిటీ తో అయ్యేదేమీ లేదన్నారు. ఆ కమిటీకి కాయకల్ప చికిత్స చేయాల్సి ఉంటుందని కవిత అన్నారు. కేవలం కాలయాపన కోసమే కేకే కమిటీ వేశారని చెప్పారు. కమిటీ తో సంబంధం లేకుండా అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలి

తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తుందో లేదో తెలియని సమయంలో ఎంతో మంది ప్రాణత్యాగానికి సిద్ధపడి ఉద్యమం చేశారని చెప్పారు. ఎంతో మంది ప్రాణ త్యాగంతో రాష్ట్రం తెచ్చుకున్నామని కవిత గుర్తు చేశారు. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదని చాలా మంది అంటుంటారని…కానీ వాళ్లు మనకన్నా ఉషారే ఉన్నారని చెప్పారు. 1969 లో జరిగిన ఉద్యమంలో మొట్ట మొదట అమరులయ్యింది కూడా కృష్ణ, శంకర్ అనే యువకులేనని కవిత గుర్తు చేశారు. ఆ తర్వాత కాసు బ్రహ్మనంద రెడ్డి రాక్షసత్వంతో 369 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆనాటి ఉద్యమం రాజకీయ కారణాలతో వీగిపోయిందన్నారు. ప్రజలు మాత్రం తొలి, మలి దశలో ఎంతో స్పష్టతతో ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. తాము అధికారంలో వచ్చాక అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామన్నారు. తాము పార్టీ ఏర్పాటు చేసిందే తెలంగాణ అస్తిత్వ, హక్కుల పరిరక్షణ కోసమని చెప్పారు. మీ అందరీ ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్తామని కవిత స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల సంఘాల నేతలు పాల్గొన్నారు. కుసుమ సిద్ధారెడ్డి, పాలమూరు జ్యోతిరాజ్, నవీన్ యాదవ్, సామ అంజిరెడ్డి, మల్లూరి అనిల్ కుమార్, రామగిరి ప్రకాశ్, పూస శ్రీనివాస్, కొడిమ్యాల కృష్ణ, బోగె పద్మమ్మ, మాదాసు శ్రీనివాస్, సాజదా సికిందర్, బాన్సువాడ చందు, రంజిత్ కుమార్, మధు రావు, దామోదర్ గౌడ్, తన్వీర్ సుల్తానా, బీరకాయల మధుసూదన్, మూల ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చిన కవిత గారితో కలిసి నడుస్తామని చెప్పారు.

ఆగస్ట్ 6 లోపు జయశంకర్ సార్ విగ్రహాం ఏర్పాటు చేయాలి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్నిఆయన జయంతి అయిన ఆగస్ట్ 6 నాటికి పూర్తయ్యేలా ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాశారు. ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో విగ్రహ ప్రాంగణం గ్రీనరీ నిర్వహణ కూడా తమ సంస్థ పక్షాన చూస్తామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి తుదికంటా పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని 12 ఏళ్లు అయిన ఏర్పాటు చేయకపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో అధికారికంగా జయశంకర్ సార్ విగ్రహాం కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X