హైదరాబాద్ : దేశంలో ఇంకా కుల వివక్ష ఉందని, ఆధునిక యుగంలో కూడా ఇది ఉండడం దురధృష్టమని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి శ్రీ బెజవాడ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో “పూర్వ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రసంగం” అనే అంశంపై విద్యార్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్ మెగాసెసే అవార్డు 5గ్రహీత, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి శ్రీ బెజవాడ విల్సన్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 వసంతాలు కావస్తున్నా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా సఫాయి ఖర్మచారి వ్యవస్థ ఉందని దాన్ని నిర్మూలించడానికి చేపట్టిన ఇండియా @ 80 ఉద్యమానికి విద్యావంతులు మేధావులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్ధులను వారి మానసిక, సామాజిక పరిస్థితిని, అర్ధం చేసుకొని అధ్యాపకులు విద్యాబోధన చేయాలని అందరు విద్యార్ధులతో కలిపి చూడరాదని అభ్యర్ధించారు.
Also Read-
దేశంలో ప్రభుత్వ స్కూల్స్ కొంతమేర బాగా పనిచేస్తున్నా కూడా ప్రైవేటు స్కూల్స్ ధనికులకే ఉపయోగం అన్నారు. చదువు అన్ని వర్గాల వారికి ఉన్నతమైన విలువలను నేర్పలాని, అందరూ సమానమే అనే భావన ప్రతీ ఒక్కరిలో రావాలని ఆ దిశగా యూనివర్సిటీ లు, విద్యా సంస్థలు పని చేయాలని పిలుపునిచ్చారు. తనలాంటి లక్షలాది మందికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ జీవితాన్ని ప్రసాదించిందని వెల్లడించారు. దేశంలో ఇంకా పితృస్వామ్య వ్యవస్థ ఉందని, దీనిపై విస్తృత చర్చ జరగాలని బెజవాడ విల్సన్ పిలుపు నిచ్చారు.
Also Read-

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ… దేశంలో సఫాయి కర్మచారి వృత్తిని రూపు మాపడానికి తమ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి బెజవాడ విల్సన్ చేసిన ఆందోళనలు ఆయన పోరాట పటిమను చూపుతోందని, ఇది తమకు గర్వ కారణంగా పేర్కొన్నారు. తన జీవితం మొత్తం ఒకే అంశంపై పోరాటానికి అంకితం చేశారని, అణగారిన వర్గాల గొంతుకగా మారారని, మానవతా విలువల కోసం పోరాటం చేశారని వివరించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా. విజయ కృష్ణా రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సామాన్య గొంతుల పక్షాన నిలబడ్డ బెజావాడ విల్సన్ లాంటి వారు నేటి యువతకు ఆదర్శం అన్నారు.

కార్యక్రమంలో విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు; ప్రొ.పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ; పలువురు డిరెక్టర్లు, డీన్ లు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. సాక వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక సభ్యులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
