హైదరాబాద్ : “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అంతర్గత నాణ్యత హామీ విభాగం (IQAC), జాతీయ అధ్యయన, గుర్తింపు మండలి (NAAC), కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) సహకారంతో “న్యాక్ తో విద్యాపరమైన సంభాషణ” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్ పాల్గొని విశ్వవిద్యాలయంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగబోయే జాతీయ స్థాయి వర్క్‌షాప్ కోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.
నాణ్యతా హామీ వ్యవస్థలను (క్వాలిటీ అస్యూరెన్స్ సిస్టమ్స్) మెరుగుపరచడానికి ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయ డీన్లు, డైరేక్టర్లతో సమావేశమయ్యారు. వారు తమ శాఖలలోని ప్రామాణిక కార్యాచరణ విధానం (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గురించి వివరించారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా సమ్మిళిత విద్యను అందించడానికి అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ప్రొ. కన్నాభిరాన్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. ఒకవైపు ఆదివాసీ గిరిజన విద్యార్ధులకు, ట్రాన్స్ జెండర్ లకు, దివ్యాంగులకు ఉచిత విద్యను ప్రవేశాపెడుతూనే మరో వైపు కార్పొరేట్ కంపనీలతో అవగాహనా ఒప్పందాలు చేస్తూ, తమ విద్యార్ధులకు ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Also Read-
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్, డా. విజయ కృష్ణా రెడ్డి; ప్రొ. పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, డా.వై. వెంకటేశ్వర్లు; ప్రొ. రజనీ, ప్రొ. చంద్రకళ, ప్రొ. రాణి రజిత మాధురి తదితరులు పాల్గొన్నారు.
