“తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టులను చాలా కాలం క్రితమే అంతం చేసేవారు”

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యమని, “అబ్‌కీ బార్ తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం” అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్లే, తెలంగాణలో కూడా ప్రజలు కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ప్రజలను మోసం చేశాయని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరింగ సభలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సభా ప్రారంభానికి ముందు తన కోసం కార్యకర్తలు, చిన్నారులు తీసుకొచ్చిన పెయింటింగ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ చిత్రాలను సేకరించాలని ఎస్పీజీ అధికారులను ఆదేశించిన ఆయన, సేకరించిన పెయింటింగ్స్ పై చిత్రకారుల అడ్రస్‌లు ఉంటే వారికి స్వయంగా లేఖలు రాస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని, “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా… మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున నినాదాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని, అక్కడి చారిత్రాత్మక విజయోత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో అపారమైన జోష్ కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్‌, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా “అబ్‌కీ బార్ తెలంగాణాలో కూడా” అని స్పష్టంగా చెబుతున్నారని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని విమర్శించారు. అదే మార్గంలో టీఎంసీ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు.

Also Read-

ఒకప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారని, కానీ నేడు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగిందని చెప్పారు. అసోంలో కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. బెంగాల్‌లో మూడు ఎమ్మెల్యేల స్థాయి నుంచి బీజేపీ 200కి పైగా స్థానాలకు చేరుకుందని గుర్తు చేశారు.

తెలంగాణకు బీజేపీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు. దేశంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారని గుర్తుచేశారు. మిగతా దేశంలో అంతగా మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలిచారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధాని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. “రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి” అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణలో పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు గుర్తుచేశారు. అందులో దేశవ్యాప్తంగా 14 ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు అవుతోందన్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహన తయారీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు ఆధునిక పరిశ్రమల ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఇది లక్షలాది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు, మధ్యతరగతికి వరంగా మారుతుందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఆమోదించిన ఏడు PM మిత్ర టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి వరంగల్‌లో ఏర్పాటు అవుతోందని ప్రధాని వెల్లడించారు. ఇది తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని, ముఖ్యంగా పత్తి రైతుల భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి, నాణ్యత పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మిషన్‌ను ఆమోదించిందని, దీని ద్వారా తెలంగాణలోని లక్షలాది పత్తి రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు.

బీజేపీ అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటేనని — ముందుగా అబద్ధపు హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడమేనని ఆరోపించారు. హిమాచల్‌, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని అన్నారు.

కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను “ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్”గా అభివర్ణిస్తున్నారని అన్నారు.

మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందన్నారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం క్రితమే అంతం చేసేవారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు.

ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తోందన్నారు. ప్రపంచ మార్కెట్లో రూ.3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నామని వెల్లడించారు.

దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్‌, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరారు. కరోనా కాలంలో అలవాటు అయిన వర్క్ ఫ్రం హోమ్‌, ఆన్‌లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

మరోవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని ప్రధాని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు, విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. “వోకల్ ఫర్ లోకల్”ను మరింత బలంగా అమలు చేయాలని, రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించారు.

రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి నాశనం అవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 25% నుంచి 50% వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు. డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలని కూడా కోరారు.

ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి, ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని అన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే భారత్ ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా సభకు భారీగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X