హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. ఈ సభ కార్యకర్తల సభ అని, తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలికారని తెలిపారు. సికింద్రాబాద్‌లో జరిగిన ఈ భారీ జనసంద్రం, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్న స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు.
మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ గారికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత స్వాగతానికి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని రాంచందర్ రావు గారు పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17 తేదీనే మోదీ గారి జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ముఖ్యమైన రోజని, అదే రోజు దేశ ప్రధానమంత్రి జన్మదినం కావడం విశేషమని చెప్పారు.
ఇది కూడ చదవండి-
ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే శక్తులపై పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశాన్ని నక్సలిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం వంటి శక్తులు భయపెట్టాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం “నక్సలైట్ ముక్త్ భారత్”, “లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ముక్త్ భారత్” దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దీనికి పూర్తి ఘనత ప్రధాని మోదీ కే చెందుతుందని అన్నారు.
దక్షిణాది-ఉత్తరాది పేరుతో దేశాన్ని విభజించే రాజకీయ శక్తులతో పాటు కుటుంబ పాలన పేరుతో దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ వంటి పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సంకల్పాన్ని, అభివృద్ధి సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని తెలంగాణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఘన స్వాగతం పలికారు.
