హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖలో జరుగుతున్న టెండర్ల వ్యవహారం పూర్తిగా అక్రమం, కుట్రపూరితంగా ఉందని BRS ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. గతంలో విద్యాసంస్థలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ మొత్తం డీసెంట్రలైజ్డ్ విధానంలో జరిగేదని, వివిధ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంస్థలు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో టెండర్లు పిలిచి స్థానిక అవసరాలను తీర్చుకునేవారని తెలిపారు.
ఆ విధానంలో స్థానిక చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), పద్మశాలి కుటుంబాలు, టైలర్లు, చిన్న స్టీల్ పరిశ్రమలు మరియు ఇతర చిన్న వ్యాపారులు సరఫరాలు చేసేవారని గుర్తుచేశారు. దాని ద్వారా స్థానిక ఉపాధి, సంపద పంపిణీ, చిన్న వ్యాపారాల అభివృద్ధి జరిగేదని అన్నారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్‌గా మార్చేశారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలతో గానీ, సంబంధిత వర్గాలతో గానీ ఎలాంటి చర్చ జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
Also Read-
ఈ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం “సెంట్రలైజ్డ్ కరప్షన్” కోసం తీసుకొచ్చిన వ్యవస్థ అని డా. శ్రవణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో మొత్తం టెండరింగ్ ప్రక్రియను నియంత్రిస్తూ, వేల కోట్ల కాంట్రాక్టులను తమకు నచ్చిన కంపెనీలకు కట్టబెట్టి కమిషన్లు దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ వ్యవస్థను అమలు చేయడానికి “ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU)” పేరుతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. GO Ms No.17/202 ద్వారా ఏర్పాటు చేసిన ఈ PMUను ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల నియమించబడిన శారద అనే నాన్-ఐఏఎస్ అధికారిని కీలక బాధ్యతల్లో పెట్టి, ప్రశ్నించే ధైర్యం లేని అధికారులను ఉపయోగించుకుంటూ వ్యవస్థను నడుపుతున్నారని విమర్శించారు.
ఇంతకుముందు నికోలస్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రోనాల్డ్ రోస్ వంటి ప్రతిష్టాత్మక అధికారులు పనిచేసిన స్థానాల్లో ఇప్పుడు నాన్-క్యాడర్ అధికారులను పెట్టడం వెనుక ఉద్దేశ్యం ప్రశ్నలు రాకుండా చూడటమేనని అన్నారు.
ప్రస్తుతం టెండర్ల అర్హత నిబంధనలను కూడా కావాలనే కొద్ది పెద్ద కంపెనీలకు అనుకూలంగా రూపొందించారని ఆరోపించారు.
యూనిఫార్మ్ మెటీరియల్ సరఫరా చేయాలంటే రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలని
నోట్‌బుక్స్ సరఫరా చేయాలంటే రూ.150 కోట్ల టర్నోవర్ ఉండాలని
రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించాలని
నిబంధనలు పెట్టారని తెలిపారు. దీనివల్ల చిన్న పద్మశాలి కుటుంబాలు, చిన్న తయారీదారులు టెండర్లలో పాల్గొనే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు.
ట్రాలీ బ్యాగులు, పీటీ డ్రెస్సులు, దుప్పట్లు వంటి వస్తువులకు సంబంధించి డిజైన్ వివరాలు ముందుగా ఇవ్వకుండా “కాంట్రాక్ట్ తర్వాత డిజైన్ చెబుతాం” అని పేర్కొనడం కూడా భారీ లోపమని అన్నారు. డిజైన్ చెప్పకుండా కంపెనీలు ఎలా ధర కోట్ చేస్తాయని ప్రశ్నించారు.
అదేవిధంగా టెండర్లలో “బేస్ ప్రైస్” కూడా పేర్కొనలేదని తెలిపారు. సాధారణంగా ప్రభుత్వం బేస్ ధర నిర్ణయించి, దాని కంటే తక్కువ ధర కోట్ చేసిన వారికి టెండర్ ఇస్తుందని, కానీ ఈసారి ఎలాంటి బేస్ ప్రైస్ ప్రకటించకుండా కంపెనీలకు ఇష్టం వచ్చిన ధరలు కోట్ చేసే అవకాశం కల్పించారని ఆరోపించారు. దీనివల్ల కాంట్రాక్ట్ విలువలను కావాలనే పెంచే అవకాశం కలిగిందని అన్నారు.
డా. శ్రవణ్ కుమార్ మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 2024లో GO Ms No.1 జారీ చేసి, ప్రభుత్వ శాఖలకు అవసరమైన అన్ని క్లాత్ సంబంధిత ఉత్పత్తులను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (TGSCO/TESCO) నుంచే కొనాలని ఆదేశించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని సుమారు 40 వేల చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ జీవో తీసుకొచ్చారని తెలిపారు.
అయితే ఆ జీవో అమల్లో ఉండగానే ప్రభుత్వం దానిని పక్కనపెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లకు వెళ్లిందని విమర్శించారు. ఈ విషయంపై “ఆదివీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ, కొత్తవాడ, వరంగల్ Vs స్టేట్ ఆఫ్ తెలంగాణ” కేసులో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని తెలిపారు.
గౌరవ న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఇచ్చిన తీర్పులో, Article 43B ప్రకారం కోఆపరేటివ్ సంస్థల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇచ్చిన GO Ms No.1ను ఉల్లంఘిస్తూ టెండర్లు పిలవడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించిందన్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా, “TESCO సరఫరా చేయలేకపోతుంది” అనే సాకుతో మార్కెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే TESCO తక్కువ ధరలకు సరఫరా చేస్తామని పలుమార్లు లేఖలు రాసిందని తెలిపారు. సరఫరా సామర్థ్యం లేదని అధికారిక “నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్” ఇచ్చినప్పుడే మూడో వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఉల్లంఘించిందన్నారు.
రూ.1200 కోట్ల టెండర్లను బ్లాక్‌లిస్ట్ చేయాల్సిన కంపెనీలకు ఎలా కట్టబెడుతున్నారని ప్రశ్నించిన డా. శ్రవణ్ కుమార్, “ఇది ప్రజాపాలన కాదు… దోపిడి పాలన” అని విమర్శించారు.
ఈ మొత్తం వ్యవస్థ ఒక పెద్ద కుట్ర, పెద్ద మోసం అని ఆరోపిస్తూ, “ఇంకా రెండేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం దిగిపోతుంది. అప్పటివరకు ఎవరూ తప్పించుకోలేరు. ఈ టెండర్లలో పాల్గొన్న అధికారులు, PMU సభ్యులు, కాంట్రాక్టర్లు, కమిషన్లు తీసుకున్న వారందరిపైనా విచారణ జరుగుతుంది” అని హెచ్చరించారు.
పేద విద్యార్థుల పేరుతో, BC, SC, ST, మైనారిటీ పిల్లల అవసరాల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడి జరుగుతోందని, అదే సమయంలో 40 వేల చేనేత కుటుంబాల ఉపాధిని కూడా నాశనం చేస్తున్నారని అన్నారు.
ఈ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, మొత్తం ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్, కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
