తెలంగాణలో ఊరూరా చెరువుల పండుగ, పాల్గొన్నారు ఈ ఈ నాయకులు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది సంబురానికి చెరువు గట్లు వేదికైనాయి. ఊరూరా చెరువుల పండుగతో తెలంగాణ పల్లెలు మురిసిపోతున్నయి. బోనాలు, బతుకమ్మలు, వలల ప్రదర్శనలతో.. కులలాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా వెల్లివిరిసిన ఉత్సాహంతో ప్రజలంతా సంబురంగా వచ్చారు. వట్టి పోయిన,పగుళ్లు పడ్డ చెరువులు నేడు నిండు కుండలా జలకళను సంతరించుకున్నాయి. ఇదంతా.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి…తెలంగాణ బ్రతుకు మార్చిన కేసిఆర్ వల్లే సాధ్యం అయ్యింది. ఊరు చెరువు బాగుంటే ఊర్లో లక్ష్మీ దేవి ఉన్నట్టే అని కేసిఆర్ గారు చెరువులను బాగు చేశారు. నాడు గోస పడ్డ పల్లెలన్నీ నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఊరూరా చెరువుల పండుగలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పురాణీపేట్ వేడుకలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలంలోని పురాణీపేట్ గ్రామ శివారులోని చెన్న చెరువు వద్ద ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పురాణీపెట్ గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. గ్రామ కూడలి నుండి డప్పు వాయిద్యాలు, బోనాలు, బతుకమ్మలతో మంత్రి, కలెక్టర్ లకు ఘన స్వాగతం పలికి వారితో కలిసి ప్రదదర్శనగా చెన్న చెరువు వద్దకు చేరుకున్నారు.

రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులు గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ గేయాలు ఆలపించగా, మంత్రి, కలెక్టర్ సైతం పాల్గొని మహిళలను ఉత్సాహపర్చారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. చెరువుల ఔన్నత్యాన్ని చాటుతూ, గోరెటి వెంకన్న ఆలపించిన గేయాల రికార్డింగులు ఆలోచింపజేస్తూ అందరిలోనూ జోష్ నింపాయి. చెరువు గట్టున కట్ట మైసమ్మకు పూజలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, తీర్థ ప్రసాదాలను చెరువు జలాల్లోకి వదిలారు. చెరువు గట్టునే స్థానికులతో కలిసి మంత్రి, కలెక్టర్ సహపంక్తి భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…

నిండు కుండలను తలపిస్తున్న చెరువుల వద్ద పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందని, తెలంగాణ సాధన కోసం తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనడానికి చెరువు గట్లపై ఊరూరా ఉత్సవాలు నిర్వహించుకోవడం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత చెరువులు నీళ్లు లేక బీటలు వారి కనిపించేవని, బోరుబావులు వట్టిపోయి, కరెంటు కష్టాలతో రైతులు తల్లడిల్లేవారని నాటి దుర్భర స్థితిగతులను గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గంగాళం వంటి తెలంగాణ చెరువులు తాంబూలం (సాసర్లు)గా కుచించుకుపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సివచ్చేదని అన్నారు.

మలివిడత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో సబ్బండవర్ణాలు ఏకమై పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన దార్శనిక పాలనతో నాలుగైదేళ్ల స్వల్ప వ్యవధిలోనే సాగు, తాగు నీటి ఇక్కట్లను పారద్రోలారని, పల్లె పల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని మంత్రి తెలిపారు. చెరువుల్లో నీళ్లుంటే అందరి బతుకులు బాగుపడతాయని, రైతులకే కాకుండా మత్స్య కార్మికులకు, రజకులకు, వివిధ వర్గాల వారికి ఉపాధి మెరుగుపడుతుందని, ప్రజల అవసరాలకు సరిపడా నీటి వసతి లభిస్తుందని భావించి మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 వేళా చెరువుల్లో పూడికతీత, కట్టలు, తూముల మరమ్మతులు వంటి ఆధునికీకరణ పనులు జరిపించారని అన్నారు. దాని ఫలితంగానే ప్రస్తుతం మండుటెండల్లోనూ చెరువులు జలకళతో అలుగులు పారుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యామ్ ల నిర్మాణాలతో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు.

ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 16 చెక్ డ్యాంలు నిర్మించామని, మరో 7 చెక్ డ్యామ్ లు కొత్తగా మంజూరు చేయించానని తెలిపారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఏడాది పొడుగునా నీటి నిల్వలు నిండుగా ఉండాలనే తపనతో సుమారు 2 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ పునరుజ్జీవ పథకం కింద రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను మళ్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందేలా 21 వ ప్యాకేజీ పనులను 1700 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, సాగు,తాగు నీటికి ఇబ్బంది ఉండదని భరోసా కలిపించారు. మరో పక్షం రోజుల్లో కప్పలవాగు లోకి నీటిని మళ్లిస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడుతూ, ఆయన సారధ్యంలో తెలంగాణ సంక్షేమాభివృద్ధిలో అగ్రపథంలో పయనిస్తోందని అన్నారు. తెలంగాణ రైతాంగానికి తమ ప్రభుత్వం చేస్తున్నంతగా మేలు, దేశంలోనే మరే ప్రభుత్వాలు చేయడం లేదన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని అన్నారు. జిల్లాలో రూ. 351 కోట్లను వెచ్చిస్తూ 841 చెరువులను పునరుద్ధరించుకోవడం జరిగిందని వివరించారు. పూడికతీత పనులతో చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. దీంతో 986 చెరువులలో 18 కోట్ల రూపాయల విలువ చేసే చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదిలిందని తెలిపారు. మరో ముప్పై జలాశయాల్లో ఆరు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రొయ్య పిల్లలు విడిచిపెట్టడం జరిగిందని వివరించారు. ఇదివరకు 300 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా నీరు వచ్చేది కాదని, ప్రస్తుతం అనేక చోట్ల 60 అడుగులకే నీళ్లు పడుతున్నాయని అన్నారు.

నీటి సౌలభ్యం అందుబాటులోకి రావడంలో పంటల సాగు భారీగా పెరిగిందన్నారు. వరి పంట సాగులో దేశవ్యాప్తంగా 24 వ స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు 2 వ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. గత యాసంగిలో దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా, అందులో తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలలో వరి పండించారని వివరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రతి ఏటా సుమారు 2600 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, భీంగల్ జెడ్పిటీసి రవి, ఎంపిపి మహేష్, చేయుట స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు మధుశేఖర్, గ్రామ సర్పంచ్ శంకర్, రైతు బంధు కమిటీల ప్రతినిధులు శర్మానాయక్, లింగం, జెడ్పి కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లి అక్కపల్లి చెరువు ఊరూరా చెరువుల పండుగ ఉత్సవాల్లో పాల్గొని మైసమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.

చెరువుల పండగలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

ఎడపల్లి : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కారణంగా దేశంలో చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి లో జరిగిన చెరువుల పండుగ లో స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి కవిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ…

చెరువులను బాగు చేయాలన్నదానికి వెనుక కారణమేంటన్నది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందు 75 ఏళ్ల క్రితం చెరువులు నిండుకుండలా ఉండేవని, ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు. చెరువు బాగుంటే ఊరుఊరంతా చెరువుపై ఆధారపడి బ్రతికే పరిస్థితి అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చెరువు, నది ఉంటే ఆ సంస్కృతి, జనజీవితం వాటిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రూ. 5 వేల కోట్ల వ్యయంతో 47 వేల చెరువులను మరమ్మత్తు చేసుకున్నామని చెప్పారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశమని, అవి ఎప్పటికీ ఎండిపోవద్దన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 20 వేల చెరువులను నింపుతున్నామని, కాబట్టి ఎండకాలంలోనూ రాష్ట్రంలో చెరువుల ఎండిపోవడం లేదని స్పష్టం చేశారు.

ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని నీటి వనరులను కొల్లగొట్టారని చెప్పారు. దాని వల్ల మనం ఆగమైనందునే ఇవాళ చెరువులను మంచిగచేసుకుంటున్నామన్నారు. చెరువు మంచిగయ్యి పంటలు పండడం మొదలైతే ఊరుఊరంతా బాగుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతాంగంపై అధికంగా దృష్టి సారించారని తెలిపారు. చెరవులు బాగుచేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో చేప పిల్లలను వేస్తున్నదని, దాంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. ఏదైనా ఒక్క మంచిపని జరిగితే దాని ఫలితాలు ప్రత ఒక్కరికి అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో కనీసం ఏదో ఒక పథకం రాని ఇల్లు తెలంగాణలో లేదని స్పష్టం చేశారు.

10 సంవత్సరాల క్రితం సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కనీసం ఆయన సొంత గ్రామంలో కూడా 20 – 30 మందికి పెన్షన్ ఇప్పించుకోలేదని ఆరోపించారు. పెన్షన్ వస్తున్న ఎవరైనా మరణిస్తేనే ఆ స్థానంలో కొత్త వాళ్లకు పెన్షన్ ను మంజూరు చేసేవారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో దుఖంతో మనం తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. కానీ ఈ రోజు ఊరిలో ఎంత మంది దరఖాస్తు చేస్తే అంత మందికి పెన్షన్ వస్తోందని, బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ ను సడలించి మరీ పెన్షన్ ఇచ్చామని తెలిపారు. అధికారంలో సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి చివరిగా ఉన్న వాళ్ల వరకు ఫలాలు అందుతాయని చెప్పారు.

“కాంగ్రెస్ నాయకుడు మహేశ్ కుమార్ గౌడ్ లొల్లి చేస్తుండని ఆ పార్టీ వాళ్లు చిన్న పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత లొల్లి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అన్నా… ఒక్కసారి ఎడపల్లి వచ్చి చూడు అన్న. పెన్షన్లు , కేసీఆర్ కిట్ లు ఎన్ని ఇచ్చామో చూడు. అందుకే సంబరాలు చేసుకుంటున్నాము.” అని మహేశ్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాది మొత్తంలో రూ. 600 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేదని, 2014 నుంచి ఇప్పటి వరకు కరూ. 12 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాము కాబట్టి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నామని తేల్చిచెప్పారు. గతంలో పండిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు పంటకు పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకొచ్చామని తెలిపారు.

10 ఏళ్ల తెలంగాణలో ఒక్కొమెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నామని, మొదటి ఐదేళ్లలో చెరువుల్లో పూడికలు తీసుకున్నామని, చెక్ డ్యాములు నిర్మించుకోవడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని, పెన్షన్లు ఇచ్చుకున్నామని వివరించారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకోడానికి రూ. 3 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు. దాని పేరు గృహ లక్ష్మి పథమని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్లాట్లు చేసి ఇచ్చే ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే షకీల్ చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. చెరువుల మరమ్మత్తు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని, అమృత్ సరోవర్ పేరిట దేశమంతా బీజేపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. కానీ మనం చేస్తున్నదానిలో 10 పైసల మందం కూడా కేంద్రం ఆ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వడం లేదని, దాని వల్ల చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు. దాదాపు 12-13 రాష్ట్రాల్లో చెరువుల మరమ్మత్తు కార్యక్రమం జరుగుతుందని ప్రస్తావించారు. అంటేమంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా మారిందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలలో భాగంగా వనపర్తి బాలకిష్డయ్య క్రీడాప్రాంగణంలో మత్స్య శాఖ ఏర్పాటు చేసిన ఫిష్ ఫెస్టివల్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు.

గంట్లకుంట చెరువులో జాలర్లతో కలిసి చేపలు పట్టిన మంత్రి ఎర్రబెల్లి

గంట్లకుంట (పెద్ద వంగర): ప్రజల్లో… వారు చేసే పనుల్లో కలిసిపోవడం ఎవరైనా మంత్రి ఎర్రబెల్లి తర్వాతే. జనంతో మమేకం అవడం మంత్రి ఎర్రబెల్లి కే చెల్లింది. సందర్భం వస్తె చాలు… ఏదో ఒక విధంగా అందరినీ ఆశ్చర్య పరిచే విధంగా దయన్న ప్రవర్తన ఉంటుంది. అదంతా అలా అలవోకగా జరిగి పోతుంది. ఇలాంటి ఒక సందర్భం, సన్నివేశం ఈ రోజు ఆవిష్కృతం అయింది. జాలర్లతో కలిసి చేపలు పట్టి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అబ్బురపరిచారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ గ్రామాల్లో ఘనంగా జరుగుతున్నది. ఈ పండుగ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొంటూ వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని సోమవారం గుర్తూరు తదితర గ్రామాల్లో జరుగుతున్న చెరువుల పండుగ కార్యక్రమాల్లో గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విందు, వినోదాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంటపడ్డారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి వారితో ముచ్చట్లు పెట్టారు. చేపలు పడ్డాయా? అంటూ ఆరా తీశారు. ఇప్పుడే పడుతున్నాం అని వారు చెప్పడంతో తాను కూడా చేపలు పట్టడానికి ఉపక్రమించారు. వేసుకున్న ప్యాంటు ను పైకి లాగి, నేరుగా చెరువులోకి దిగారు. ఆశ్చర్యపోయిన జాలర్లు మంత్రిని, స్వాగతించారు. వల ను ఒకవైపు మంత్రికి అందించారు. మరో వైపు జాలర్లు వలను పట్టుకున్నారు. అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. అందులో పడ్డ చిన్నచిన్న, కాస్త పెద్ద చేపల్ని చూసి సంబురపడ్డారు. ఇంకా పెద్ద చేపలు లేవా? అని అడిగారు. వారు దానికి సమాదానంగా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇవే పడ్డాయి… అని తెలియజేశారు.

అలాగే ఒకటికి రెండుసార్లు అలా వల విసిరి చేపలు పట్టి కొద్దిసేపు వాళ్లతో గడిపి ముచ్చట్లు పెట్టారు. చేపలు ఉచితంగా వస్తున్నాయా? చేపలు పెద్దగా అవుతున్నాయా? చేపల ద్వారా వారి ఆదాయ మార్గం ఎలా ఉంది? వంటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నీటితో చెరువులను నింపి, ఆ నీటిలో ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించడమే కాక, ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి వారికి చెప్పారు.

చెరువులు ఒకప్పుడు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో, తిరిగి వాటిని బాగు చేసి అదే తరహాలో ప్రజలకు ఉపయోగ0లోకి సీఎం కెసిఆర్ తెచ్చారని, ఇవాళ చెరువులు ప్రజలకు ఆదెరువుగా మారాయని మంత్రి తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ గారి దయవల్ల, కృషి వల్ల జరుగుతుందని చెప్పారు. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని వారిని కోరారు. అక్కడి నుంచి మరో కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపక్రమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X