కవిత పోరాటాన్ని పక్కదోవ పట్టించేలా గుంపు మేస్త్రీ, గుంటనక్కకుమ్మక్కయ్యారు: టీఆర్ఎస్ నాయకులు

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులపై గన్ ఎక్కు పెట్టించి వారి రక్తం కళ్లజూసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల రంజిత్, వేణుమాధవ్ మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజును చంపిన రూథర్ ఫర్డ్ మాదిరిగా ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారన్నారు.

శనివారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ఆ అంశాలను పక్క దోవ పట్టించేందుకు గుంపు మేస్త్రీ, గుంటనక్క కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. భూపోరాటం చేస్తోన్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసినా బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు గొంతు విప్పలేదో చెప్పాలని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కాదు… రేవంత్ ఫర్డ్ : గొంగళ్ల రంజిత్

స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజును కాల్చి చంపిన రూథర్ ఫర్డ్ మాదిరిగానే తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి గన్ ఎక్కు పెట్టించి వారిని హింసించారని గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ఉద్యమకారుల పట్ల అన్యాయంగా వ్యవహరించిన ఆయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఫర్డ్ అని విమర్శించారు. కవిత చేస్తున్న ప్రజా ఉద్యమాలు జనాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు గుంపుమేస్త్రీ, గుంటనక్క ఒక్కటయ్యారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ పార్టీ అధినేత కవిత బాయిబాట ప్రకటించగానే హరీశ్ రావు సింగరేణి పర్యటన పెట్టుకున్నారని గుర్తు చేశారు.

కవిత భూ పోరాటానికి పిలుపునిచ్చిన జులై 2నే పిల్లల చేష్టల మాదిరిగా ప్రభుత్వంలోని మంత్రులు, గంపులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వదిలేసి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి పనికి రాని అంశాలను లేవనెత్తుతూ ప్రధాన ప్రతిపక్షం టైమ్ పాస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా మీకు బుద్ది చెప్తారని హెచ్చరించారు.

ఉద్యమకారులపై లాఠీచార్జీ చేసినా స్పందించరా? : వేణుమాధవ్

ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ భూపోరాటం చేస్తే పోలీసులతో అమానవీయంగా లాఠీచార్జీ చేయించారని టీఆర్ఎస్ నాయకుడు వేణుమాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై లాఠీచార్జీ చేస్తే బీఆర్ఎస్, బీజేపీ నేతలు కనీసం ఖండించలేదన్నారు. ఉద్యమకారుల సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యమకారులను ఎలా మోసం చేసిందో కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోందన్నారు. ఉద్యమకారులకు పెన్షన్లు, ఇంటి స్థలం, అమరవీరులకు కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా గురించి ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారని.. త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X