“తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లివ్వాలి, జీవో 150ను రద్దు చేయాలి”

హైదరాబాద్ : తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నీట్ ర్యాంకులు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కవితతో భేటీ అయ్యారు.

ప్రభుత్వం 2014లో తీసుకువచ్చిన 150 జీవో కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తున్నాయని.. ఫలితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతోందని వివరించారు. కవిత స్పందిస్తూ, వారం రోజుల్లో ఎంబీబీఎస్ సీట్లు అలకేట్ చేసే అవకాశ ఉండటంతో ప్రభుత్వం తెలంగాణ స్థానిక విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్య సంవత్సరం నాటికి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నం.150ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తెచ్చిన అనాలోచిత జీవోతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రెండేళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తించేలా జీవో నం.150 తేవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతోన్న విద్యార్థులకే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కుతున్నాయని తెలిపారు.

ఏటా సుమారు 1,500ల నుంచి 2 వేల సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకే దక్కుతున్నాయని, ఆమేరకు తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడేళ్లు ఏ రాష్ట్రంలో జరిగితే అక్కడ స్థానికత వర్తించేలా పాత జీవోను పునరుద్ధరించాలని సూచించారు. నీట్ కారణంగా ఇప్పటికే 15 శాతం సీట్లు కోల్పోతున్నామని, ఏ రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి ఆ రాష్ట్రమే ఎంట్రన్స్ నిర్వహిస్తే సీట్లు కోల్పోవాల్సిన ఆస్కారమే ఉండదన్నారు. విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ అంశం అత్యంత సెన్సిటివ్ అని.. ప్రభుత్వం వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ విద్యార్థులకు మళ్లీ అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈమేరకు చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Also Read-

రాహుల్ జీ.. తెలంగాణలో విద్యార్థులపై పోలీసుల అఘాయిత్యాలపై మౌనమెందుకు?

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై ఆఘమేఘాల మీద స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తే కనిపించటం లేదా అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయమా అని ఆమె రాహుల్ గాంధీని నిలదీస్తూ శుక్రవారం ఎక్స్ లో ట్వీట్ చేశారు.

“రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మీరు విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తీరును స్వాగతిస్తున్నాం. పోలీసుల వ్యవహరశైలిని కూర్రత్వమంటూ మీరు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం. కానీ అంతకన్నా క్రూరంగా తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన అంశంలో మీ గొంతు ఎందుకు మూగబోయింది? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నరాష్ట్రంలో విద్యార్థులపై ఇంతటి అరాచకాలు జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ నుంచి ఇలాంటి ద్వంద్వ వైఖరి బాధకలిగిస్తోంది.” అంటూ కవిత ట్వీట్ లో పేర్కొన్నారు.

ఢిల్లీలో పోలీసుల క్రూరత్వంపై విద్యార్థులతో కలిసి కంప్లైంట్ చేసిన రాహుల్ గాంధీ ఆ అంశాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీని కవిత నిలదీశారు. జీవో 97 కి వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 19 న పాలిటెక్నిక్ విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ధర్నా చేస్తే స్థానిక సీఐ అత్యంత అనాగరికంగా ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకొని, వారిని ఊపిరాడకుండా చేస్తూ వెనక్కి నెట్టిన అంశంపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని కవిత ప్రశ్నించారు.

మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థులపై జరుగుతున్న అరాచకాలు కనిపించటం లేదా అని రాహుల్ గాంధీని కవిత క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రాహుల్ గాంధీ స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే సరైన సమయంలో తెలంగాణ విద్యార్థులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయమని కవిత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X