బస్సు చార్జీల పెంపు భారాన్ని పేదలపై రుద్దడం సరికాదు
తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని విమరించుకోవాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించి.. బస్సు ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మార్చేసింది.. బస్సుల సంఖ్యను పెంచడాన్ని పక్కన పెట్టి చార్జీల భారాన్ని భారీగా పెంచేసింది. పండుగల పేరుతో ప్రజలపై అదనపు చార్జీల భారాన్ని మోపిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పండుగ ముగియగానే సిటీలో చార్జీలను భారీగా పెంచింది. ఒక్క స్టేజీ దాటితే రూ.10 అదనపు చార్జీ అంటే సామాన్యులు, నిత్యం పని చేసుకుంటేనే బతికేవారి పరిస్థితి ఏం కావాలి?
Also Read-
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేదే సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు.. వారిపై ఇంతలా చార్జీల భారం మోపడం సరికాదు.. ప్రజలకు ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత అన్ని చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారి తప్పుడు విధానాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతోందని.. ఇప్పుడు చార్జీల పెంపుతో సామాన్యులు మరిన్ని ఇబ్బందుల పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జాగృతి పక్షాన ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు, యువ జాగృతి అధ్యక్షుడు శివారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి, నాయకులు సత్యనారాయణ, జితేందర్, రవి రాథోడ్, పాలె నిష, కిషన్ నాయక్, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
