ఆదిలాబాద్ : తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ఆదివాసీల దీవెనలు ఉండాలని..మీ ఆశీర్వాదం కోసమే ఈ జిల్లాకు వచ్చామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పాంచజన్య సంకల్ప సభల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి వద్ద నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. పంటలు కాపాడుకునేందుకు మీటింగ్ పెట్టుకోవాలనుకున్న ఆదివాసీలను కనికరం లేకుండా పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అయిన సరే కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ కోరి ఇంద్రవెల్లి వీరులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకోని ఆ పార్టీకి నాలుగు సీట్లు ఇచ్చారన్నారు. అయిన సరే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాను మోసం చేసిందని మండిపడ్డారు.
తెలంగాణ సాధించుకోని 12 ఏళ్లు అవుతున్న సరే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి లేదని, 750 ఊళ్లలో కనీసం స్కూల్స్ లేని పరిస్థితి ఉందన్నారు. తలసరి ఆదాయంలో ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రాజెక్ట్ లు, అభివృద్ధిని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యం చేశాయన్నారు. అడవులు, ఆదివాసీలు సహజ సంపదతో ఉన్నఈ జిల్లాను అభివృద్ది చేసేందుకు రాజకీయ నాయకులకు మనసు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా తుమ్మడి హెట్టి ప్రాజెక్ట్ పేరుతో ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మురిపించాయే తప్ప చేసేందేమీ లేదన్నారు. కాగజ్ నగర్ లో కాగజ్ నగర్ లో లక్షా 5 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే 6 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఏళ్లకు ఏళ్లుగా ప్రాజెక్ట్ లను పెండింగ్ పెట్టారన్నారు. తుమ్మిడి హెట్టిని పూర్తి చేసి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు.

ఆదివాసీలు ఎక్కువగా ఉండే జిల్లాలో కనీసం వారిని పట్టించుకోవటం లేదని చెప్పారు. ఐటీడీఏ లో జీవో 57 తో సహా 27 జీవోలను మళ్లీ అమలు చేయాలని, 1972 లో ఆస్తులు కొనుక్కున్న ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రక్త హీనతతో బాధపడుతున్న ఆదివాసీల మహిళలకు పోషకాహారం అందిస్తామని అది కూడా చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు కాంగ్రెస్, నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ముఖ్యమంత్రిపై ఈగ వాలితే కూడా సహించటం లేదన్నారు. ప్రజలను అభివృద్ధి చేయాల్సింది మరిచి బీజేపీ మత రాజకీయాలతో గెలవాలని చూస్తోందని..ప్రజలు ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే రౌడీ అని ఆయన మంత్రిని కూడా నియోజకవర్గంలోకి రానివ్వటం లేదని విమర్శించారు. ఆయన కారణంగా మంచిర్యాల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read-
పంటలు వేయవద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని కవిత అన్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన రైతులను పంటలు వేయవద్దంటున్న ముఖ్యమంత్రి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశారు. పంటలు వేయద్దన్న ముఖ్యమంత్రి పదవి ఉండొద్దన్నారు. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాకు నెలకు రెండుసార్లు వస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి..మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే ఇక్కడకు వచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇంద్రవెల్లి వీరులకు ఇంద్రవెల్లి వీరులకు రూ. 25 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి వీరులను కూడా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు.

కరువు వస్తుందని ఏడాది ముందే తెలిసినప్పటికీ పట్టించుకోకుండా.. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో తుమ్మడి హెట్టిపై చర్చలు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి వ్యవహారం ఇల్లు అంటుకున్నప్పుడే బాయి తవ్వుకున్నట్లు ఉందన్నారు. మహారాష్ట్రతో ఉన్న ఒప్పందం ప్రకారం 148 మీటర్ల నీళ్లు నిల్వ చేసుకుంటూ 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ కట్టాలని కోరారు. తుమ్మడి హెట్టి విషయంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ను పూర్తిగా నాశనం చేశారని..తాము డిమాండ్ చేస్తే గానీ చనఖా- కొరటా ప్రాజెక్ట్ ముందుకు పడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు, మోసాలు చేస్తూ ప్రజలను వంచిస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ ది గర్జన కాదు..తర్జన భర్జన
ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గర్జన సభ నిర్వహిస్తామని చెబుతోందని కానీ వారిది గర్జన కాదు, తర్జన భర్జన అని కవిత ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల బాబుల అధిపత్యం కోసం నిర్వహిస్తున్న ఈ సభ కారణంగో క్యాడర్ లో అయోమయం నెలకొందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆదిలాబాద్ కు ఒక్క ఎకరం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్..ఏ మొఖం పెట్టుకోని రైతు గర్జన సభ నిర్వహించటానికి వస్తుందని ప్రశ్నించారు. గర్జన సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. స్వయంగా కేసీఆరే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తానని మాట ఇచ్చినప్పటికీ ఎందుకు ఒక్క యూనివర్సిటీ, కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు కోసం ప్రైవేట్ వ్యక్తులకు వెెయ్యి కోట్లు ఇచ్చి..కార్మికులకు ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్..పత్తి ఎక్కువగా పండే ఆదిలాబాద్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయకపోవటానికి కారణం ఏంటన్నారు. పదేళ్లలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదో చెప్పాలని నిలదీశారు.
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మూత పడటానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లే కారణమని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉండగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకపోవటం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. తుమ్మిడి హెట్టి ని పూర్తి చేసి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఏ మొఖం పెట్టుకోని రైతు గర్జన సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. పైగా చనఖా కొరటా ప్రాజెక్ట్ లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. రూ. 368 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ను ఏకంగా 2100 కోట్లకు పెంచారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ని యువత ప్రశ్నించాలని కోరారు. ఈ అవినీతి సొమ్ము మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న ఇళ్లకు పోయాయా? లేదంటే గుంటనక్క మింగేసిందా? లేక బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి పోయాయా చెప్పాలంటూ కేటీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఏ సభ అయిన పెట్టుకోండని..లేదంటే ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మరని అన్నారు.
సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపుతున్నాం
సామాజిక తెలంగాణ సాధించటమే టీఆర్ఎస్ లక్ష్యమని..ఆ లక్ష్యం దిశగా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు స్థానాలను తమ పార్టీ బీసీలకే ఇచ్చిందన్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక బలం లేకపోయినా చదువు, సమాజం కోసం పనిచేసే యువకులకు తాము సీట్లిచ్చామన్నారు. బీసీలకు, యువతకు అవకాశం ఇస్తే రాజకీయాలు మారుతాయని, రాజకీయాలు మారితే రాష్ట్రం మారుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే, ప్రజలను మోసం చేస్తున్న పార్టీలను ప్రశ్నించేందుకే కొత్త రాజకీయ శక్తిగా వచ్చామన్నారు. పాంచజన్యం పేరుతో కీలకమైన ఐదు అంశాలను తాము ప్రాధాన్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలకు ప్రైవేట్ లోనూ మెరుగైన ఉచిత విద్య, వైద్యం ఇచ్చి చూపిస్తానని చెప్పారు. యువతకు వ్యాపారం చేసేందుకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు వారికి గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సభ గ్రాండ్ సక్సెస్
ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు, జిల్లా ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోగానే ముందుగా ముత్నూర్ లో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో సభ ప్రాంగణానికి అభిమానుల కేరింతలు, నృత్యాలు, డప్పుల కొలహలం మధ్య ర్యాలీగా తరలి వెళ్లారు. దారి పొడువునా ఆదివాసీలు కవిత ఘనస్వాగతం పలికారు.
