Hyderabad: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారి ఫోన్ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడుతుండటం, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్‌ను అధికార పీఠం నుంచి దించేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తోన్న సమయంలో ఆమెకు మోదీ ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి మోదీ ఆరా తీసినట్లు తెలుసింది. షర్మిలను మోదీ ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో మోదీతో షర్మిల భేటీ అయ్యే అవకాశముంది.
మరోవైపు గత కొంతకాలంగా షర్మిల బీజేపీ వదిలిన బాణం అని, ఆమె బీజేపీ మనిషి అంటూ విమర్శలు వస్తున్న క్రమంలో మోదీ ఫోన్ చేయడం, షర్మిలపై జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ నేతలు ఖండించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల గట్టిగా ప్రశ్నిస్తోంది. టీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా పాదయాత్రలో తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న షర్మిలకు బీజేపీ కూడా మద్దతు పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లలో భారీగా అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ డైరెక్టర్, కాగ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనతో భారీగా అవినీతి జరిగిందంటూ వైఏస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ కాల్‌తో రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ప్రధాని మోదీ ఫోన్ చేయడంపై షర్మిల స్పందించారు. తనకు అండగా నిలిచిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ఒక్కరే కాదని, తనపై జరిగిన దాడికి ఘటనపై చాలామంది ఫోన్ చేసి పరామర్శించినట్లు షర్మిల పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి, అరెస్ట్‌పై సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీల మద్య ఒప్పందం పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. (Agencies)