తెలంగాణ భాష లో మరింత విస్తృతంగా సాహిత్య సృజన జరగాలి
తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాదులోని తన నివాసంలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ … తెలంగాణ భాషలో రాసే కవితలు, కథల తో మనుగడలో లేని తెలంగాణ పదాలు, సామెతలు, నుడికారాలు వెలుగులోకి వచ్చి తెలంగాణ అస్తిత్వం ఘనంగా నిలబడుతుందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న తెలంగాణ భాషలో కవితలు కథలు రాసేవారికి ఇది గొప్ప అవకాశం అని అన్నారు. ఈ బృహత్కార్యాన్ని తలపెట్టిన హరిదా రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ కవితలను, కథలను పంపించి కవులు, రచయితలు పోటీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read-
ఈ కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసి మే 30వ తేదీ లోపు haridaasaraswathiraj@gmail.com అనే జిమెయిల్ చేయాలని, వివరాలకు 9948032705 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, రామ్ స్మృతిక తదితరులు పాల్గొన్నారు.