హైదరాబాద్: సిటిలో పలుచోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే తనిఖీలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో సీబీఐ, ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టించగా.. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. సీబీఐకు వివరణ ఇవ్వడంపై కవిత రోజుకో ట్విస్ట్ ఇస్తోన్నారు. వివరణ ఇస్తానంటూ ఒకరోజు.. వివరణ ఇవ్వలేనని, మరో తేదీలలో వచ్చి వివరణ తీసుకొవచ్చంటూ మరో రోజు సీబీఐకు కవిత ఆప్షన్లు ఇస్తోన్నారు. ఈ నెల 6న వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొనడం, సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీబీఐ అధికారులు చేరుకోవడంతో నేడు ఏం జరగబోతుందనేది టెన్షన్ గా మారింది.