రూ.50 లక్షలతో నిర్మించిన బంజారా భవన్ ప్రారంభోత్సవం

బంజారాల సంక్షేమానికి కేసిఆర్ సర్కారు పెద్దపీట

సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను గురువారం అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని, గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తండాలు జీ.పీలుగా అవతరించాయని వివరించారు.

గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రూ. 1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతి తండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోంది గుర్తు చేశారు. అన్నింటికి మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా 300 వరకు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కేవలం పాతిక వరకు మాత్రమే ఉండేవని అన్నారు. ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా అదనంగా 3200 మందికి ఇంజనీరింగ్ లో, 190 మందికి మెడిసిన్ కోర్సులలో ప్రవేశాలు లభించాయని వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనుల కోసం తెలంగాణాలో అమలవుతున్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో తన సొంత నియోజకవర్గంలో ప్రతి తండాకు సి.సి రోడ్డు ఏర్పాటు చేయించగలిగానని, ప్రస్తుతం వాటిని బీ.టీ రోడ్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతోనే దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉంటూ వచ్చిన మానాల – మర్రిమడ్ల, దేవక్కపేట – కారేపల్లి రోడ్లకు అటవీ శాఖ అనుమతులు సాధించి ప్రస్తుతం పనులను వేగంగా జరిపిస్తున్నామని అన్నారు.

భవిష్యత్తులోనూ తండాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం కృషి కొనసాగిస్తామన్నారు. భీంగల్ లోని కస్తూర్బా పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన వెంట కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కు సూచించారు. భీంగల్ లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. 18 వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని అన్నారు. ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

అహింసా మార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. వనాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఆ రోజుల్లోనే నొక్కి చెప్పారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు, నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ మహేష్, జెడ్పిటీసి రవి, జెడ్పి కో-ఆప్షన్ మొయిజ్, బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, ఆర్మూర్ ఆర్ డీ ఓ శ్రీనివాసులు, బంజారా సేవా సంఘం ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ తండాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X