Special Article : మండుతున్న అడవిలో “గాంధారి” జాతర, దాని ప్రత్యేకతల గురించి చదవాలి-తెలుసుకోవాలి-చూడాలి

[మంచిర్యాల బాగా వేడిగా ఉంటది .ఎండాకాలం వచ్చిందంటే అడవిలో మంటలు మండుతాయి. ఇప్పుడు చెట్ల మీద ఆకులు గలగల రాలుతున్నయ్. వాటికి ఎవ్వరైనా నిప్పుపెడితే అడవి మొత్తం భరభర అంటుకుంటే దాన్ని ఆపడమెట్లా అన్న దాని మీదనే వారి ధ్యాస.గాంధారి వనంలోకి కొన్నిరోజులు ఎవ్వరిని అనుమతి లేదు.ఇప్పుడైతే ఇలాంటిది ఏమి లేదనేది. చాలా సహాకారంతో ఉన్నారు‌. ఇప్పడసలే గాంధారి జాతర, వేలమంది వస్తారు.అడవిలో గద్దెలు కట్టించారు. ఆకులను అంటకుండా దూరం కందకం తీశారు. అడవి కాలకుండా ముందు జాగ్రత్తలతో ఫైర్ ఇంజన్ కూడా రెడీ ఉంది. అటవీ అధికారులు, సిబ్బందికి పాపం కునుకు లేదు. పారెస్ట్ అధికారుల పనితీరు, కమిట్మెంట్, ధ్రృఢ సంకల్ఫం చాలా గొప్పది కాబట్టే ఈ మూడు రోజులు గాంధారి జాతర సహాకారం మరువలేనిది. ఈ మండుతున్న అడవిలో గాంధారి జాతర అని వ్యాసం రాశాను. – అక్కల చంద్రమౌళి]

ఉమ్మడి అదిలాబాద్ అంటేనే జాతరలే జాతరలు. చలికాలంలో (శిశిర ఋతువులో) నుంచి మెల్లిగా చెట్లాకులు వెలవెలబోయిన పసుపు రంగులోకి మారి గలగల రాలిపోతాయి. అప్పుడే నాగోబా కేస్లాపూర్ జాతర, అది అయినంకా కొద్ది రోజులకే మంచిర్యాలకు చాలా దగ్గరలో మరో పెద్ద జాతర గాంధారి ఖిల్లా. ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అడవిలో వందల పులుల‌ అడ్డా. ఇది వాటికి నివాసమని అవి బాగా కనబడేటియని అప్పటి మనుషులు చూసినోళ్ళు చెబితే విన్నాను. 1920 సంవత్సరంలోని ముచ్చట. ఆసిఫాబాద్ నుంచి తాలుకా లశేట్టిపేట దాకా కొత్తరోడ్ఠు వేశారని వేలితపాటలో పుస్తకంలో చదివాను. అప్పుడే‌ వ్యాపారులు ఎక్కువగా ప్రవేశించారట, కొత్త అంగళ్ళు వచ్చినయట. అది లోయల్లోని వారు సంతకోసం వచ్చేవారు. అట్లా భూములు పోయినయని విన్నాను. అంటే ఈ నూరెళ్ళచరిత్ర గల్ల తోవన్న మాట.

మా ఇల్లు కూడా గద్దరాగడే, ఇది వరకు రామక్రిష్ణ పూర్. మందమర్రి, ఆసిఫాబాద్కు అప్పుడోటి ఇప్పుడోటి ఆ తోవలో సైకిల్, మోటార్ సైకిల్, బస్సులు, జీపులు పోయేటివి. సీకటైతే శాన దొంగల భయం. బొక్కలగుట్ట రోడ్డు నుంచి కిలోమీటర్ దూరంలో రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఉంటుంది.అది డిల్లీ రూట్. అప్పటికి ఇంకా భాగ్యనగర్ రైలు షురువు కాలేదు‌. రామక్రిష్ణపూర్ అడవికి దగ్గర ఉన్నోళ్ళు కాలినడకతోటి వచ్చి మంచిర్యాలకు పోయేటోళ్ళు.

బొగ్గుబాయిలకు నౌకరికోసం చుట్టుపక్కల నుంచి వచ్చారు.రాను రాను ఉపాధి కోసం మిగత వ్రృత్తులవారు వచ్చి సెటిల్ ఇక్కడే .పక్కనే ఎసిసి సిమెంట్ కంపనీ ఉంది.దాంట్ల ఎక్కువ ఉత్తర భారతదేశం నుంచి అధికారులు ఉండేవారు.ఊళ్ళ నుంచి వచ్ఛిన కుటుంబమే మాది‌. దండేపల్లి దగ్గర వెలగనూర్ వెలుగులేని ఊరు అంటే కరెంట్ లేని ఊరుకి నుండి రామక్రిష్ణ పూర్ మా బాపు లచ్చన్న వచ్చిండు.ఆ తర్వాత అనేకమంది వచ్చారు. బొక్కల గుట్ట ఊరు గుట్టానుకోని ఊరు చాలా బాగుంటుంది.పులులు జంతువులు చంపి తింటే వాటి బొక్కలు ,ఎముకలు గుట్ట దగ్గర పడేసిండ్రని ఊరోళ్ళు చెప్పారు. అందుకే ఇది బొక్కల గుట్ట. ఊరులో నుండి రాళ్ళవాగు పోతుంది. అది తిర్యాణి గుట్టల్లో కెళ్ళి జారుకుంటా ఈ ఊరుని కలుసుకోని గోదాట్ల పోతది.అప్పట్లో తాగడానికి పంటలకు ఇదే ఆధారం .

అటు గద్దెరాగడి, తిమ్మాపూర్,పులిమడుగు,కోటిశ్వరావ్ పల్లి ,ఊరు మందమర్రి ఉండేవి.వీటి చరిత్ర కూడా గమ్మతి ఉంటుంది. పులిమడుగులో లంబాడీలు తెగ. అప్పట్లో ఊరిలో నాటుసారా అమ్మితే ఎక్సైజ్ అధికారులు వారు అనేక సార్లు అవగాహన మంచిగ బతుకాలని చెప్పేవారు.ఇప్పుడు అలాంటిది ఏమి లేదనే చెప్పాలి.పెదవాగు మడుగు ఎగ్గండిలో పులులు మేకలను చంపి తినేది అందుకే” ఈ “పులి మడుగు”ఊరు. మూలమలుపు ఒక కర్వ్ లా ఉండేది. ఆ దారిలో నిత్యం ప్రమాదాలతో ఘౌరమైన నెత్తురు రోడ్డు మీద పారేది‌. చాల మంది చనిపోయారు. కొన్ని రోజులకు అక్కడ మైసమ్మను ప్రతిష్ట చేయడం వల్ల ప్రమాదాలు తగ్గాయని ఆ నమ్మకం కలిగి మెల్లగా అక్కడ భక్తులు మేకలు, కోళ్ళు, గొర్రెలు కోసి రోడ్డు పక్కన వంటవార్పు చేసేవారు. మైసమ్మ గుడి పేరు అందరికి బాగా తెలిసింది. భక్తులు పెరిగారు.ఆషాడ మాసంలో కూడా బాగా బోనాలు ఫేమస్. తెలంగాణ వచ్చిన కొత్తలా అప్పుడు “గాంధారి వనం” పేరుతో అర్బన్ లంగు స్పెస్ మొదలుపెట్టారు. అప్పుడు సినిమాలు పాటలు గీటలతో నా జీవితం అప్పుడే మొదలైంది.నాకు కూడా అడవిలా తిరిగి చెట్టు పుట్ట తెలుసుకోనుడు ఇష్టమే.

మూడువందల యాభై ఎకరాలతో “గాంధారి వనం”గా అప్పుడు మంచిర్యాల జిల్లా అటవీ అధికారి బిట్టు ప్రభాకర్ గారూ ఉన్నప్పుడే ప్రపోజల్ పంపితే షురువైంది. అందరి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు పోయేవారు. అప్పుడు అసల్ల అప్పయ్య ఎఫ్ ఆరో వో కూడా చాలా చురకుతో అనుకున్న సమయంలో మొత్తం పూర్తిచేశారంటే వారు కమిట్మెంట్ గొప్పది. అందుకే మా వంతుగా గాంధారి పార్క్ అభివృద్ధిలో చేయి కలిపాము. ఈ తల్లిదండ్రులు చనిపోతే వారి గుర్తుగా ఒక మెక్కను నాటుకోవచ్చు దాని పూర్తి సంరక్షణ బాధ్యత అటవీశాఖదే. దాని కొంచెం ఫీజు ఉంటుంది. అప్పుడు నాతో ఒక చెట్టు కూడా ఒక ప్రభుత్వ అధికారి నాటించారు. అది ఇపుడు ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. అట్లా రాశివనం, ఔషధ వనంలో వివిధ రకాలైన తెచ్చి పెట్టారు. లోపల మూడో కిలోమీటర్ల నడక దారి కూడా ఉంది. అంతేగాక చెరువులో బోటింగ్ కూడా ఉండేది. అయితారం వస్తే పిల్లలతో పెద్దలు బోటింగ్ చేసి సాయంత్రం దాకా వనంలో గడిపేవారు. ఓ వరం ఇది. ఎందుకో కొన్ని రోజులు ఏవో కారాణాలతో బంద్ ఉంది ఎవరిని పంపేవారు కాదు ఇప్పుడు అందరిని పంపుతున్నారు.

Also Read-

ఇప్ఫుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెన్నూరు నియోజకవర్గం ఎం ఎల్ ఏ వివేక్ వెంకటస్వామి గారూ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు ఉంది. ఐ ఎఫ్ ఎస్ అషిస్ సింగ్ గారూ కూడ వేగంగా పనులు చేస్తున్నారనిపిస్తుంది. కొత్త కొత్తవి లోపల నిర్మాణం చేస్తున్నారు. రంగులతో ముస్తాబైతంది. గాంధారి వనం తోరణాన్ని ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, తోరణం ఎలా ఉంటే బాగుంటుందని సలహా కోరాను. దాని బోమ్మగా త్రిడిలో గీశారు. మూరల్ చేసే కళాకారునితో మర్రిచెట్టు ఆకారంలో ఓ చిన్న నమునాని చేశారు. దానితోటి అచ్చం అలాగే ఇప్పుడు తోరణాన్ని చేశారు.

గాంధారి ఖిల్లా

గాంధారి ఖిల్లా “కందాళ పట్నం”అనీ నాకు ఈ మధ్యే తెలిసింది. దానికి ఓ కథ ఉంది.కుండ పెంకులతోటి వాటి కుండ మూతి కడియం అంచును ఉన్న కోట ప్రాంతాన్ని కందాళపట్టణమట. అదే ఇప్పుడు ఖిల్లానటా.దీన్ని మైసమ్మ జాతర కరపత్రంలో ఇది‌ చదివాను. ఇది గాంధారి తాలుకానట మెసినేని రాజయ్య నాయక్ పోడు సంస్కృతి మీద మంచి పట్టున్న వ్యక్తి చెప్పింది. మంచిర్యాలకు పాత పేరు (గర్మిళ్ళ) మందమర్రికి పోతావుంటే జాతీయ రహదరి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో గాంధారి ఖిల్లా లోపలికీ ఉంటుంది. అటు పోవడానికి ఆటోలు, బస్సులు ఏమి ఉండవు‌. మనకు మొదట రాళ్ళవాగు వస్తది. వాగు మీద ఐదేండ్ల కిందనే వంతెన కట్టించారు. అది దాటగానే బొక్కగుట్టల గ్రామం, ఒక వెయ్యిమంది జనాభా ఉంటారు కావచ్చు. ఊరి మధ్యలోనే గుడి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బిసి కులాలు, కాపుదనపోళ్ళు, గౌడ్స్ కూడా ప్రధానంగా ఉంటారు.

కొన్ని సంవత్సరాలు కిందట ఖిల్లా దగ్గరలో ఒక స్త్రీ చనిపోయిందనేది చాలామంది అప్పుడప్పుడు ఆ విషయం మాట్లాడుతారు. అదే ఎంత నిజమో? దానితోటి ఖిల్లా కాడ జాతర ఆగింది.ఇగ దాన్నెవరు పట్టించుకోలేదు. 2016 సంవత్సరంలో జాతరను మళ్ళీ చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది. గొండు, కొలాం, నాయక్ పోడ్, పర్థాను, ఒజారీ ఆదివాసీలు ఇక్కడ ఉంటారు. పున్నంలా జాతర ఖిల్లాలో చేసేది నాయక్ పోడులది. కొన్ని సంవత్సరాలు గోండోల్లదని, నాయక్ పోడులదని పంచాయితీ జరిగింది. ఇప్పుడైతే అసోంటిది లొల్లి ఏమిలేదు. మంచిగా చేస్తున్నారు. ఒక్కో తెగకు ఒక్కో రీతి రివాజు వేరు వేరుగా ఉంటాయి.

గాంధారి మైసమ్మ జాతర

మైసమ్మ జాతరను మాఘ శుద్ధ పౌర్ణమి నాడు నాయకపోడ్ తెగ చేస్తారు. అది ఈ ఫిబ్రవరిలో 14,15,16 వ తేదీన మూడురోజులు చేసిండ్రు. “తప్పెటగూళ్ళు-పిల్లన గ్రోవి” తో ఆటపాటలతో తెల్లగా మెరిసేటి బట్టలు వేసుకుని గంగాజలాన్ని గోదావరి నది నుంచి తీసుకత్తరు. ఇది మొదటిది మాత్రమే‌ ఇంకా రెండు రోజులు జాతరకు వస్తుంటారు. అది ఒడవదు. నాయక్ పోడ్ ఆచారాలు ప్రకారం గోదావరి జలాలతో మంచిగ కడిగి గ్రామ దేవత పోశమ్మ తల్లికి పూజ, భీమన్న దేవుడి పట్నాలు, పూజలు అదే రోజు వేరు వేరు ఊళ్ళ నుంచి వచ్చినప్పటికి కూడా మరియు లక్ష్మీదేవిలా కళాకారులచే ఆట పాటలు జోర్థార్ చేశారు.

రాత్రి 12 గంటలకు దాకా పెద్ద పట్నంతో మొక్కులు చెల్లిస్తారు. మూడో రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్క ఆదివాసీ పండుగకు “దర్బార్” ఏర్పాటు చేసి రాజకీయ నాయకులకు, అధికారులకు వాళ్ళ ఆపతి సంపతి సెప్పనికీ ఒక వేదిక. కానీ లీడర్, అధికారులు ఈ సారి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ సారి ఎవరు రాకపోవచ్చనీ అక్కడ అనుకుంటున్నారు. ఐటిడిఏ అధికారిణి ఖుష్బు గుప్తా వచ్చి కొండపైకి వెళ్ళారు. నేను కొంతదూరం పోయి తిరిగొచ్చాను.

ఇందులో పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, చతీస్గడ్, జార్ఖండ్ ఆదివాసీలు కూడా వచ్చారు. ఓ పక్క ఫారెస్ట్ అధికారులు పక్కనే పులి కొండల మధ్యలో తిరుగుతుందని మొన్ననే చిరుతలు కూడా ఉన్నాయని సాయంత్రం అక్కడికి వచ్చిన ఆర్ డి వో కి ఫారెస్ట్ అధికారి సుభాష్ విషయాలను చెబుతున్నాడు. ఎన్ ఆర్ శ్యాం రచయిత, అక్కడి చదునుగా చేసిన ప్రదేశంలో తిరిగారు. ఎంతో జాగ్రత్తలు తీసుకొవాలి. ఏమి ఇబ్బందులు రాకుండా ఫారెస్ట్ అధికారులు ఓ వైపు మంటలు అడవికి అంటకుండా పులి మూమెంట్ మానీటరింగ్ చూసుకుంటా ఏర్పాటు చేశారు.

గాంధారి చరిత్ర

ఇది వెయ్యి సంవత్సరాలది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1993 సంవత్సరంలా ఐదువేల రుపాయలతో జాతర చేశారట అప్పటి బిడి శర్మ అధికారి, ఐటిడిఏ అధికారి చిత్రాలు అక్కడ ఒక సాంస్కృతిక పోస్టర్ మీద కనబడింది. ఇక చరిత్రలోకి పోతే, గాంధారి ఖిల్లా చరిత్ర మీద ప ఏటవాలు కొండలో శిలాశాసనంలో “శ్రీరస్తు శుభమస్తు శ్రీ పెద్థిరాజు ఆనంతరాజు రఘనాయకులకు సమర్పించిన హనుమంత్త తిరువని ప్రతిష్ట శ్రీ యున్” అని ఇనిస్క్రిషన్ ఉంటది. సూర్య చంద్రుల ఆకారంలో రాతిశిల మీద ఉంటుంది‌. మొదట నాకు అర్థం కాలేదు. చాలాసార్లు దాని చూసి చదవడం వల్ల అర్థం అయ్యింది.గాంధారి ఖిల్లా చరిత్ర మీద భిన్నమైన అభిప్రాయాలు ఉందనిపిస్తుంది. ఇప్పుడుప్పుడే చరిత్ర బయటకువస్తుంది. బొక్కల గుట్టలో సాంబయ్య “మైథాలజీ “గురించి బాగా చెప్పేవాడు. నేను ఆ విషయాలను రికార్డు చేయడం జరిగింది. ఇంక చుట్టూ పక్కల గ్రామాల మేడారం పాతతరం అడిగితే ఇంకా కొంచెం తెలుస్తది.

మొదటిసారి ప్రయాణం

మొదటిసారిగా 2012 వ సంవత్సరం వరకు గాంధారి ఖిల్లా నేను చూడలేదు.కానీ అప్పుడు చిన్న తొవ్వ మధ్య మధ్యలో కాలువలు, ఖిల్లా పోవడానికి చాలా కష్టమే.పెద్ద వాహనాలు పోవడం కష్టం.ఒకసారి వర్షాకాలంలో ఓ అధికారి అధికారితో పోయాను‌. తిరిగి వస్తాంటే, పెద్ద వర్షం మమ్మల్ని ఏటు పోనికుండా చేసింది‌. మట్టి రోడ్డు హహనం బురదలో దిగబడింది. ఒక మూడు గంటలు మేము వెహికల్ తోసి, చెట్లకోమ్మలు ఇరిసి పయ్యల కింద వేస్తూ ముందుకు దొబ్బితే బయటకొచ్చింది.

అడవిలో చీకటి పడింది. అక్కడ ఆ వైపుకి ఎవరు రాలేదు. ఎందుకంటే అంతా నిర్మానుష్య ప్రాంతం. ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏమిలేదు. ఊరు కోస దాకా డాంబర్ రోడ్ ఉంది. చుట్టూరా తాటిచెట్టు, ఈత చెట్లు ఆటలు ఆడేందుకు రెండు, మూడు ఎకరాలు ఉన్నట్లు ఉంది.అంతటా రియల్ ఎస్టేట్ జరుగుతుంది ఆడుకోవాలని ఉన్న స్థలం లేక పిల్లలు యువకులు ఆడటం లేదు. ఇంకా ఏదో సంపాదించలన్న ఆకాంక్ష పోలేదనిసిస్తుంది ఇక్కడ కొండలు కరగడం చూస్తుంటే. ప్రక్రృతి విధ్వంసం తెరలేసిందన్నమాట.

కవ్వాల్ టైగర్ జోన్ (కెటిఆర్)

మంచిర్యాలలో అడవి ప్రాంతం అంతా “కవ్వాల్ ” కిందికి వస్తుంది. మనం గాంధారి ఖిల్లా పోతావుంటే అది కెటిఆర్(కవ్వాల్ రిజర్వ్ టైగర్) సెంట్రల్ గవర్నమెంట్ అధికారంగా నోటిఫై చేసింది. ఇందులో కోర్, బఫర్ జోన్ చేసింది. అప్పటి నుంచి అడవిలోకి కట్టెలు కొట్టడం, మంటలు పెట్టడం జంతువులు వేటాడటం నిషిద్దమన్నమాట. అనుమతి లేనిదే లోపలికి పోవడం నేరం. ఈ అడవిలో పులులు, అడవి దున్నలు, స్లొత్ బీర్, జింకలు, నీలుగాయి మరియు ఇండియన్ గార్ మనం చూడవచ్చు. రెండు వందల యాభై రకాల పక్షులు ఉన్నాయి. అప్పుడప్పుడు అటవీ శాఖ బర్డ్ వాక్ చేస్తుంది. శివ్వారంలా మొసళ్ళు అభయారణ్యం కూడా ఉంది .

నలభై గ్రామాలను అడవి లోపల ఉన్నోళ్ళను ఖాళీ చేయించి టైగర్ రిజర్వ్ చేశారట. గిరిజనులు బాధలో ఉన్నారు. ఇదివరకు లెక్క లేదనిపించింది. వాళ్ళకి అడవి నుంచి బయటికి పోవడం ఇష్టం లేదనిపిచ్చింది. ఎందుకంటే తిండి తిప్పలు అంతా అడవిలోనే కదా.

మనం నిర్మల్ కోయ్యబోమ్మలు తయారు కోసం వాడేటివి పోనికల్ చెట్లు ఈడ అడవిలనే కనబడుతాయి. ఇప్పుడు ఈ అడవిలా తక్కువైతన్నయ్. ఒక సంవత్సరం నుంచి కవ్వాల్ వార్తల్లో ప్రతిరోజూ కనబడుతుంది. కాగజ్ నగర్,గన్నారం అడవిలకు పత్తి ఏరుతాంటే పులి దాడి చేసిందని, ఆ యువతి అక్కడే చనిపోయిందనే వార్త దేశమంతటా తెలిసింది. ఇసోంటివి ఇక్కడ మాములు అయిపోయాయి. ఏండ్ల కిందటైతే వాటితోటె మనుషులు ఉన్నారు. భయం గీయం జాన్త నహీ ఇప్పుడెందుకు ఇలా అయితందో ఏ మర్మం ఉందో ఎట్లా తెలుస్తది మనకు.

పర్యటక ప్రదేశాలు- టూరిజం

ఈ మధ్యనే మంచిర్యాల అడవిని ఇకో టూరిజం కింద అటవీశాఖ ఇక్కడ పనులు బాగా చేస్తుంది. జన్నారంలా హట్స్ విడిది లాగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు.అక్కడక్కడ లోపలికి వెళ్ళేదారి చాలా రోడ్డు అధ్బుతంగా చేశారు‌. సైక్లోథాన్ అనే ఓ పాతిక కిలోమీటర్లు అడవి లోపల చాలామంది పాల్గోన్నారు. మా పిల్లలు సుస్వర ఏడు సంవత్సరాలు, స్వరన్ అడవిలో ఉత్సాహంగా పాల్గోన్నారు. ఏ బెరుకు గీరుకు లేకుండానే చేసింది. అది ఇప్పటికే చెబూతూనే ఉంటారు. శారీరక, మానసిక ఎదుగుదల ఉపయోగమే కదా మరీ ఎప్పటి గుర్తుంటుంది .

క్వారీ పైకెక్కితే ఒక తోరణం ఉంటుంది. అక్కడి నుంచి గాంధారి ఖిల్లా వైపుకు అడవిలో పోయేటట్లు చేసిండ్రు. మనం సఫారీలో పోతే ప్రయాణం బాగా ఉంటుంది. ఇదోక గమ్మతి తడోబాకు వెళ్ళే కంటే ఇక్కడ పర్యటన చేయడం బాగుంటుందనే వెళ్ళినవారు చెబుతున్నారు. సఫారీతో ఆగి కొండల మధ్యలో మంచెను ఆనుకొని కొండలుంటాయి‌.గుహలు కూడా ఉన్నాయి. అప్పటి మానవుడు ఇక్కడ తిరిగినట్టుగా బోమ్మలు రాతి శిలల మీద ఎద్దు, గుర్రం వ్యవసాయం పనిముట్లు గుర్తులు గుహలో చూడవచ్చు.ఈ మధ్యనే మా మిత్రురాలు ప్రాన్స్ నుంచి వస్తే చూపించాను. పదివేల సంవత్సరాలు మానవుని మనుగడ సంబంధించిన అనుభవాలను పోటో తీసుకుని రీసెర్చ్ రాసింది. ఈ అడవిలో చెట్లు తప్సి,పాచి, నల్లమద్ది,జిట్టిరేగు, టేకు, మోదుగ చెట్లు తెలిసిన వారితో పోయి వాటి గురించి తెలుసుకుంటే మంచిది.

ఇదివరకు చుట్టుపక్కల మొత్తం ప్లాస్టిక్, వ్యర్థాలు, ఉండేటివి. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందనిపిస్తుంది. పాఠశాల విద్యార్థులు కూడా చూడటానికి వస్తున్నారు.చెట్లు, ప్రకృతి మీద అవగాహన చేయించడం చాలా సంతోషకరమైనది అనిపిస్తోంది. కొండ మీద మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలోని జలగుట్ట, పూల గుట్టల మధ్యన నాచురల్ ఉంటుంది. గాంధారి ఖిల్లాలో లభించిన ఆధారాలను పరిశోధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు లభించిన గుహలలో పదుల సంఖ్యలో పాదముద్రలు, జంతువులు, మానవులు అవయవాలు అచ్చులు, రాతియుగల కాలం నుండి రాళ్ళ బొగడ, చెరువు తూములో రాతిని తొలచిన కాలువ నిర్మాణం, కోటగోడలు భోగం గుళ్ళు, కోటకొండలపై బైరవ విగ్రహాలు శివలింగాలు, ఆంజనేయులు కొండ ఎక్కుతూ ఉంటే మనం చూసి ఆనందపడుతాము‌. మట్టి పాత్రలు (కుండ పెంకులు) పాతవిలాగా కనబడుతాయి‌.మనం చేతితో తడిమి చూసుకోవచ్చు. అంటే‌ పదివేల సంవత్సరాలు క్రితం మనుషులు ఆనవాళ్లు అన్నమాట. ఏమి చరిత్ర ఇది‌.ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తది.

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)

ఇది ఉట్నూర్ మండలం కేంద్రంలో ఉంది.ఇదే అదిలాబాద్ ఉన్న గిరిజనులకు సంబంధించిన ప్రతి ఒక్కటి చూసుకుంటుంది. దీనికి పి వో (ప్రాజెక్టు ఆఫీసర్) ఉంటారు. దీన్ని 1975లో ఉట్నూర్ స్థాపించారు.గిరిజనుల పాఠశాలలు ఆరోగ్యము మిగతా విషయాల్లో ఇదే చూసుకుంటుంది. మంచిర్యాల నుండి ఆదిలాబాద్ రూట్ వెళ్తూంటే మనకు ఉట్నూర్ ఐటిడిఏ చూడొచ్చు. ఏప్రిల్ ఇప్పపువ్వు ట్రైబల్ అడవిలో నుండి సేకరించి ఐటిడిఏ అమ్ముతారు అదోక ఉపాధి మార్గం.అక్కడ ఆదివాసీ ఆహారం పేరిట ఒక కుటీర పరిశ్రమ కూడ ఉంది‌.పండుగలకు జాతరలకు ఐటిడిఏ నిధులు కూడా కేటాయించి బాగా జరిగిలా చూస్తారు‌.

మనం చూడవలసినవి గాంధారి ఖిల్లా విశేషాలు

సహజమైన శిల్పాలతో ఉంటుంది. ఎన్ని సార్లు చూసిన మంచిగనిపిస్తుంది.బొక్కలగుట్ట దాటినంకా సదరు భీమన్న విగ్రహం చూడవచ్చు. సదర్ భీమన్న గద్దె నుండి రెండు కిలోమీటర్లు ఉండొచ్చు అంతే గాంధారికల్లా. ఆ పెద్ద మేడిచెరువుని మేడిరాజు అప్పట్లో కట్టాడని, పంటలు పండడానికిదే ఆధారమని అక్కడివారు చెప్పుకుంటారు. ముఖద్వారం గోడలపై చెక్కిన చిన్న చిన్న బైరవుల విగ్రహాలు, సూర్యచంద్ర చిత్రాలు, ఎగురవేసిన సూర్య చంద్రుల జెండాలు చూడోచ్చు‌. కొంచెం దక్షిణం తిరగగానే దర్వాజా, రాతిగోడలపై పది అడుగుల కాలభైరవ విగ్రహం బాగా ఉంటుంది. కళాకారులు ఎలా చెక్కారో అని ఆలోచనలో పడుతాము. రాతిని చదునుగా తొలిచి దక్షిణానికి అభిముఖంగా ఏటవాలుగా ఖిల్లా పైకి ఎనిమిది అడుగుల వెడల్పు దారి, .కొంచెం అది దాటగానే ఎడం వైపున జీడికోట స్థలం. అది వ్యాపార కేంద్రం లాగా ఉపయోగించేవారట.

పైకి ఎక్కుతా ఉంటే దారిలో సర్పం తొండానికి చుట్టుకుని ఉన్న ఏనుగు శిల్పం ప్రక్కన రాతి గోడలపై మొండి భైరవుల ప్రతిమలు చూసేలోపే మనల్ని కుడి చేతి వైపుకు తిరిగి పడమర దిక్కుగా రాతిలో పెద్ద దర్వాజా కుడిపక్క కమ్మీపై మైసమ్మ తల్లి విగ్రహం పైనున్న అడ్డకమ్మి పై లక్ష్మీ దేవర, పూలమాలలతో ఏనుగు బోమ్మలు ఇవన్నీ ఎన్నిసార్లైనా చూసిన బోరు కొట్టదు.పెద్ద దర్వాజాకు తూర్పు వైపు ఎత్తైన శిఖరం నాగార గుండు, భీముని పాదం. అటు పోతా ఉంటే. మరొక కొండపై ఆంజనేయ విగ్రహం దాని రూపం ఆకర్షణీయంగా ఉంటుంది ‌ఇట్లా ఇందులో తెల్వని చాలా విషయాలు ఉన్నాయి. ఎంతో ఓపికతోటి తిరగాలి కోటలో.

నాయకపోడ్ల చరిత్ర

కొలాములు నివసించే ఆదిలాబాద్ జిల్లాలోని కొండ లోయలు అటవి ప్రాంతంలో మరోక తెగనే నాయకపొడ్లు.అయితే ఇక్కడ కొలాం నివాసించే చోటనే వీరు చిన్న చిన్న సముహాలే. 1940 వరకు పోడుతో పంటసాగు చేసుకునేవారు.ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఓ పిడికెడు మంది మాత్రమే ఉన్నారు‌.చాలామంది పట్టణాలు కూలీలై బతుకుతున్నారనేది వారి చూసినప్పుడు నాకు అర్థమైంది. నాయక్ పోడు దాదాపు తెలుగులోనే మాట్లాడుతారు. వారంతా హిందూ సమాజంలో కలిసిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్షమంది వరకు ఉండవచ్చు ‌‌.పచ్చబొట్లు ముసలి వాళ్ళు చూస్తే వారి శరీరానికి కనబడుతాయి.

ఒకప్పుడు పచ్చజోన్నలు, గట్క తినేవారు అది ఇప్పుడు మారింది. ఇంకా తిండి విషయంలో గోండులు, నాయక్ పోడుల ఇంటిలో గోండులు తింటారు కానీ నాయక్ పోడులు వారింట్లో మాత్రం తినరు. ఎందుకంటే తాము గోండుల కంటే పవిత్రులమనీ నాయక పోడులు భావిస్తారని అనేది వెలితపాట పుస్తకంలో యార్క్ రాశాడు. సాధారణ ద్రృష్టితో చూస్తే గోండు, నాయక్ పోళ్ళు వ్యవసాయిక సామూహలే. వీరి గోత్రాలు పాలకాయ, నల్లెల్ల ఇవి రెండు నీటికి సంబంధం ఉంటుంది. మద్ది, కోలకాని, ముచినేని, మేశినేని, ఏదుల ఇట్లా ఇంటిపేర్లు ఉంటాయి. స్ర్రీలైతే పెద్దవారు చీరలు, పైభాగంలో రైకలు ముడివేసి కనిపిస్తారు‌. ఇప్పుడు యువకులు ప్యాంటు వేసుకుంటున్నారు. తెల్లగా నారింజ ఎరుపు రంగు గుడ్డలపై సూర్యుడు, చంద్రుడు ముద్రించి ఇల్లార్ల వద్ద ఎగురవేస్తారు.

ఆచారాలు పుట్టుక నుండి సావు దాకా

నాయకపోడులం తమ ఇంటిలో బిడ్డ పుట్టుకకు చనిపోయిన పూర్వీకులు తిరిగి పుట్టినట్లు సంతోషిస్తారు. పురుటి సమయంలో ఒక పక్క తడికలతో చాటు కట్టి వేరుగా ఉంచుతారు. భూతప్రేత పిశాచాల చూపారకుండా అడవి నుండి తెచ్చిన ఆరే,గార మండలు ఇంటి గుమ్మానికి కడుతారు.బిడ్డ పుట్టిన దగ్గరనుంచి పదకొండు రోజుల వరకు స్నానం చేయడానికి.ఐదువంతులుగ చేస్తారు .చిన్న పిల్లలు రోగం రోష్టులతో వస్తే చనిపోయిన పెద్దలకు కొంటెతనం వల్లనేనని చల్లగా కాపాడాలని తమను కొలుచుకుంటామని చనిపోయిన (పిత్రృదేవతలకు )కోడిని కోసి నీళ్ళారబోసి మొక్కుతారు. బిడ్డ పుట్టడం ఒక అపూర్వ సంఘటన భావిస్తారు .బిడ్డ పుడితే సంతోషంగా పుట్టిన బిడ్డను పూర్వీకులు పోలికలతో మురిసిపోతారు.

కుండ మార్పిడి పెండ్లి

ఈ రకం పెళ్లిళ్లు సాధారణంగా మేనరికం సంబంధంలో జరుగుతాయి.పూర్వం తమ్ముళ్లు చాలా చిన్న వయసు వారు ఉంటె అక్కపిల్లలను మేనమామ ఇచ్చి పెండ్లి చేసేవారు‌. తాత గారికి పుట్టిన ముందు తరం వారిని కూడా ఈ రకం పెండ్లిలో అంగీకరించి ఆమోదిస్తారు. ఒక ఇంటి ఆ పిల్లను (పెళ్లికూతురు) ఏ ఇంటి వారికైతే ఇస్తారో అదే ఇంటి పిల్లను మొదటి పిల్లనిచ్చిన వారి పిల్లవాడికి. ( పెళ్లి కొడుకు )ఇచ్చేస్తారు ఇలాంటి సంబంధంతో పాలపేరిట వారు నీళ్ల పేరిట వారిని తమ వాళ్ళుగా ఆమోదించించి ఎంచుకుంటారు. ఒకే తాతకు పుట్టిన తల్లిదండ్రులు పిల్లలకు కొరకు పాలీ వాళ్ళుగా మరియు ఒక ఇంటి పేరు కలిగి ఉన్న వారిని నీల్ల పేరిట వారుగా పిలుస్తారు‌. హేమన్ ఢార్ఫ్ అదిలాబాద్ గిరిజనుల మీద అధ్యయనం .

ఆదివాసులు తిరుగుబాటు తర్వాత హేమన్ డారైఫ్

నిజాం గవర్నమెంట్ ఆదివాసీల మీద అధ్యయనం 1940 తర్వాత అదిలాబాద్ వచ్చాడు. ముప్పై వేల ఆదివాసీ కుటుంబాలకు ఒక లక్ష అరవై వేల ఎకరాలు ఇప్పించుటలో నిజాంను ఒప్పించాడు.

ఆదివాసీలు మీద సాహిత్యం

సాహు, అల్లం రాజయ్య ఆదివాసీలు మీద కోమురం భీం నవలగా రాశారు.ఇప్పుడు కొలాం వారు రాస్తున్నారు. నాయక్ పోడ్ సాహిత్యం ఎక్కువేమి లేదు.నిన్న మెస్రం మనోహర్ తను రాసిన “ఇరూక్” ఇప్పపువ్వు మీద కథలు గురించి ఇప్పపువ్వు ఏరేటప్పుడు పందులు వస్తే గోలి కొడుతారట .ఆ గోలి పందికి తగిలితే ఒక్కసారిగా మీదకి కోపంగా వచ్చే తీరును ఆ కథలు ఉంటాయని చెప్పాడు. “అడవి” నవల వసంతరావు దేశ్ పాండే రాశారు.నేనోక పది కథలు కేడా కోడ్సా… మ్యూజియం కథ, కాకోబాయి… తదితర కథలు రాశాను. త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.

పరేషాన్ సినిమా గాంధారి ఖిల్లా వీడదియరాని అనబంధం

“గాంధారి ఖిల్లా కొత్తవా గంగమ్మ “అంటూ స్థానికంగా రాయడం మొదటిసారి తెలంగాణ సినిమాలలో ఒక ప్రత్యేకతను చాటిందనిపిస్తుంది.ఇది నాయక పోళ్ళు,ఆదివాసీలు ఈ పాటను ఓన్ చేసుకున్నారు. అయితే ఇంకా ఈ సినిమా గురించి లోతుగా చెప్పొచ్చు‌‌.బొక్కలగుట్టలోనే ఇరవై రోజులు షూటింగ్ చేశాం. అది మళ్ళీ కరోనా రెండో వేవ్ టైంలో ఊరు అంత బాగా సహకరించారని అప్పటి సినిమాటోగ్రాఫర్ వాసు, సినిమా నటుడు తీరువీర్, నటీ పావని మరియు దర్శకుడు రూపక్ ఎప్పటికీ క్రృతజ్ణత ఉంటాననీ చెప్పాడు. ఈ ఊరికి అప్పటి సర్పంచ్ జిల్లా అధికారులు సహాయం కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేయడం ఆనందంగా ఉంది. ఊరు వాళ్ళు ఈ చిత్రంలో చాలామంది నటించారు. అంతేగాకుండా ఆ ఊరిలో డెబ్భై సంవత్సరాల సాంబయ్య బక్కపలుచ మనిషికి నటించడం అంటే ఇష్టం. ‌బాగా మంచి నటుడు‌. సినిమాలో బాగా పెద్ద కారెక్టర్ .సినిమా విడుదలకు ముందే ఆనారోగ్యం కారాణాల వల్ల చనిపోవడం బాధాకరం.

గిరిజనులు కలిసే ప్రదేశం

గాంధారి జాతర అందరూ మంచిగ కలిసే చోటు. మహారాష్రట,ఇంకా ఛత్తీస్గఢ్ కావోచ్చు. ఎవరైనా ప్రతి సంవత్సరం రావడానికి అందరిని కలవడానికి వస్తారు. తిరిగి పోయేటప్పుడు కష్టాలు సుఖాలు అడుగుతారు. అది మనిషికి సంబంధించినవి భావోద్వేగ క్షణాలు అక్కడే చూడొచ్చు అందుకే ఇది ఒక అనుభూతిని అనుభవాలను పోగు చేసే స్థలం.

మా సక్కని సినిమా

తెలంగాణ, ఆదిలాబాద్ రీతి రివాజుల మీద ఇక్కడ యువత ఇప్పుడిప్పుడే అధ్యయనంలోకి వస్తున్నారు. స్థానికులతో కలిసి సినిమా, కళలు, పేయిటింగ్, కథలు అభివృద్ధి చేయడంలో ముందుకు నడక సాగుతుంది. గాంధారి ఖిల్లాలో చారిత్రక ప్రదేశంలో కళలకు సంబంధించినది మొదలుపెట్టాము. ఇది శుభ పరిణామం.

అక్కల చంద్రమౌళి, సినీ గేయ రచయిత 91775 41446

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X