అదానీ గ్రూప్- అదానీ షాక్‌తో LICకి భారీ నష్టం, ప్రజల సొమ్ముతో ఆడుకుంటున్నారు: MLC కవిత

ప్రజల పైసలతో ఆటలా ?

ఎల్ఐసి పెట్టుబడులు ఆవిరవుతుంటే మౌనం ఎందుకు ?

సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా ?

అదాని వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం

హైదరాబాద్ : ఆదాని కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

అదాని కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత తీవ్రంగా స్పందిస్తూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.

ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయినా సిబిఐ ఈడి రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని నిలదీశారు.

హిడెన్బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి ఆదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జెపిసి ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జేపీసీని నియమించాలని డిమాండ్ చేశారు

మరోవైపు అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎల్‌ఐసీ ఉసురు తీస్తున్నది. ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం పెట్టుబడుల విలువను అమాంతం తగ్గించేస్తున్నది. అదానీ గ్రూప్‌పై ఏర్పడిన ప్రతికూల వాతావరణం మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నమోదైన ఆ కంపెనీల షేర్లు గత నెల రోజులుగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా సంస్థల షేర్లలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పెట్టిన పెట్టుబడులూ అంతకంతకూ తరిగిపోతున్నాయి.

అసలుకే ఎసరొచ్చిందిప్పుడుఅదానీ సంస్థల్లో పెట్టుబడుల విషయమై మునుపెన్నడూ మార్కెట్‌ వినని సరికొత్త వాదనను ఎత్తుకున్న ఎల్‌ఐసీకి.. ఇప్పుడు నష్టాల సెగ మొదలైంది. ఈక్విటీల్లో తాము పెట్టిన పెట్టుబడులు రూ.30,000 కోట్లేనని, ఇప్పుడు చూసినా వాటి విలువ అంతే ఉందంటూ మొన్నటిదాకా ఎల్‌ఐసీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గురు, శుక్రవారాల ట్రేడింగ్‌తో ఎల్‌ఐసీకి ఈ అవకాశం దూరమైంది. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ కంటే కిందిస్థాయికి షేర్ల విలువ వచ్చిందిప్పుడు. జనవరి 24న అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రిపోర్టు విడుదలైన దగ్గర్నుంచి అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు నష్టపోతున్న సంగతి విదితమే.

అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపిస్తున్నది తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో స్పందించిన ఎల్‌ఐసీ గత ఏడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి ఐదు అదానీ కంపెనీల్లో తమ పెట్టుబడులు రూ.35,917 కోట్లుగానే ఉన్నాయని, ఇందులో ఈక్విటీల వాటా రూ.30,127 కోట్లేనని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడిది రూ.26,193 కోట్లకు క్షీణించింది. దీంతో దాదాపు రూ.4,000 కోట్లు నష్టపోయినైట్టెంది. నిజానికి అదానీ గ్రూప్‌లోకి ఇటీవల వచ్చిన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీల్లోని ఎల్‌ఐసీ పెట్టుబడుల నష్టాలనూ చూస్తే ఇది ఇంకా ఎక్కువే.

ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే ఎల్‌ఐసీ పాలసీలకు అంత ఆదరణ. అయితే ఈక్విటీ మార్కెట్లలో ఎల్‌ఐసీ పెడుతున్న పెట్టుబడులు ఇప్పుడు పాలసీదారుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. అదానీ వ్యవహారం.. యావత్తు భారతీయ స్టాక్‌ మార్కెట్లనే కుంగదీస్తున్నది మరి. దీంతో స్టాక్‌ మార్కెట్లలో.. ముఖ్యంగా అదానీ కంపెనీల షేర్లలో పెట్టిన ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ భారీ ఎత్తున కరిగిపోతున్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎల్‌ఐసీ ఆర్థిక పరిపుష్ఠిని ప్రభావితం చేయగలవన్న భయం నేడు సగటు పాలసీదారునిలో వ్యక్తమవుతున్నది.

ఈ క్రమంలోనే అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ వ్యవహారం పార్లమెంట్‌నూ కుదిపేస్తున్నది విదితమే. ప్రధాని నరేంద్ర మోదీకి, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకున్న సంబంధాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. మొత్తానికి అదానీ సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల వెనుక కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి.

☞ అదానీ గ్రూప్‌లోని ఐదు సంస్థల్లో నిరుడు డిసెంబర్‌ ఆఖరు నాటికి ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రూ.35,917 కోట్లు

☞ అదానీ గ్రూప్‌లోకి రాకముందే ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ల్లోనూ ఎల్‌ఐసీ
పెట్టుబడులు పెట్టింది. వీటినీ పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింత ఎక్కువే

☞ జనవరి 24తో పోల్చితే అంబుజాలో ఎల్‌ఐసీ వాటాల విలువ రూ.1,925 కోట్లు పడిపోయింది. నాడు రూ.6,261 కోట్లుగా ఉంటే.. నేడు రూ.4,336 కోట్లే

☞ ఏసీసీలో పెట్టుబడులు రూ.2,081 కోట్లకు దిగజారాయి. జనవరి 24న రూ.2,811 కోట్లుగా ఉన్నాయి. రూ.730 కోట్ల నష్టం వాటిల్లింది.

☞ డెట్‌ మార్కెట్‌ ద్వారా 5,790 కోట్లు

☞ స్టాక్‌ మార్కెట్‌లో రూ.30,127 కోట్లు

☞ జనవరి 24న అదానీ గ్రూప్‌ లోని 5 సంస్థల్లోఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.72,196 కోట్లు

☞ శుక్రవారం (ఫిబ్రవరి 24) రూ.26,193 కోట్లకు పతనం

☞ కరిగిపోయిన ఎల్‌ఐసీ సంపద రూ.46,003 కోట్లు ప్రస్తుత విలువతో పోల్చితే ఎల్‌ఐసీ అసలు పెట్టుబడులకు వాటిల్లిన నష్టం రూ.3,934 కోట్లు

☞ మొత్తంగా అదానీ గ్రూప్‌లోని 7 సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులుండగా, జనవరి 24న వాటి విలువ రూ.81,268 కోట్లు. ప్రస్తుతం రూ.32,610 కోట్లు. నెల రోజుల్లో రూ.48,658 కోట్లు హరించుకుపోయింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X