తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ‘కాళోజీ’ : డా. కె. శ్రీనివాస్

హైదరాబాద్ : సామాజిక జీవితంలో శిఖరం లాంటి వ్యక్తి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు అని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ వైతాళికులు కాళోజీ నారాయణ రావు 112వ జయంతిని పురస్కరించుకుని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో శుక్రవారం స్మారకోపన్యాసం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పాల్గొని మాట్లాడుతూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, సమాజ అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కాళోజి అని అన్నారు. ప్రజల వాడుక భాషనే తన భాషగా మార్చుకొని రచనలు చేసేవారని అందుకే ఆయన ప్రజా కవిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కాళోజీ ఆలోచనలు, రచనలు నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని తన రచనల ద్వారా ప్రజల్లో కలిగించారని వివరించారు. ప్రజలను అనునిత్యం చైతన్యపరిచేలా ప్రముఖుల స్మారకోపన్యాసాలను విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు డా. కె. శ్రీనివాస్ ప్రధాన వక్తగా పాల్గొని “తెలంగాణ సాహిత్యం: ప్రజల గొడవ” అనే అంశంపై ప్రసంగించారు. డా. శ్రీనివాస్ మాట్లాడుతూ కాళోజీ తన జీవితం మొత్తం సమాజాభివృద్ధికే పాటుపడ్డారని, తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసమే చివరి వరకు పరితపించారని అన్నారు. తన రచనలతో సమాజాన్ని చైతన్య పర్చారని పేర్కొన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి వరకు పరితపించిన వ్యక్తి కాళోజీ అని చెప్పారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ, అభ్యుదయ సాహిత్య ఉద్యమాలు ముఖ్యమైన దశలుగా గుర్తించబడినప్పటికీ, తెలంగాణలో అవి ప్రధాన సాహిత్య ధోరణులుగా నిలవలేదని పేర్కొన్నారు.

Also Read-

అభ్యుదయ ఉద్యమ కాలంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో గద్య రచనలు, కవితలు, పాటలు వెలువడ్డాయని, ఇవి ఈ ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులు, సామాజిక అసమానతలు, ప్రజల సమస్యలు, పోరాటాలను ప్రతిబింబించాయని చెప్పారు. సామాజిక అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా కాళోజి రచించిన కవితా సమూహాలు గొంతును వినిపించాయని పేర్కొన్నారు. విప్లవ సాహిత్య ఉద్యమం ఏర్పడటానికి, అభివృద్ధి చెందటానికి బలమైన పునాదిని కాళోజి రచనలు, సాహిత్య కార్యకలాపాలు ఏర్పరిచాయని చెప్పారు. సామాన్య ప్రజల పోరాటాలను ప్రతిబింబించడమే కాకుండా, వారి ఆకాంక్షలు, ఆవేదనలు, ప్రతిఘటనకు స్వరంగా సాహిత్యం నిలిచిందని వివరించారు. గద్దర్, చెరబండరాజు, వరవరరావు లాంటి రచయితలు, సాంస్కృతిక ఉద్యమకారులు తమ రచనలు, కవితలు, పాటల ద్వారా 1970ల తర్వాత తెలంగాణలో నెలకొన్న సామాజిక, రాజకీయ కల్లోలాన్ని, ప్రజల ప్రతిఘటనను బలంగా వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

తదుపరి కాలంలో దళిత, స్త్రీవాద, మైనారిటీ సాహిత్య ఉద్యమాలు తెలుగు సాహిత్య పరిధిని మరింత విస్తరించాయని చెప్పారు. తెలంగాణకు చెందిన రచయితలు, కవులు వాటిలోని ప్రగతిశీల విలువలను స్వీకరించి, వాటి అభివృద్ధిలో చురుకుగా భాగస్వాములయ్యారని చెప్పారు. తెలంగాణ సాహిత్య ప్రయాణం కేవలం వివిధ సాహిత్య ఉద్యమాల క్రమం మాత్రమే కాదని, సాహిత్యం సమాజానికి స్వరంగా, ప్రజల జీవితాలకు అద్దంగా, సామాజిక మార్పుకు ఒక సాధనంగా మారిందని పేర్కొన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో తెలంగాణ వైతాళికుల జయంతి సందర్భంగా స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తూ వారి జీవిత విశేషాలు భవిష్యత్ తరాలకు పరిచయం అయ్యేలా, పరిశోధకులకు, చరిత్రకారులకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ వైతాళికుల్లో కాళోజీ ముందు వరసలో నిలుస్తారని, కాళోజీ తనజీవిత కాలం మొత్తం తెలంగాణ భాష, తెలంగాణ యాస, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనే ధ్యాసనే ఉండేదని గుర్తుచేశారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి వందన సమర్పణ చేసారు. కార్యక్రమంలో ప్రొ. ఇ. సుధా రాణి, వీసీ ఓఎస్డీ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. రాణి రజిత మాధురి, ప్రొ. రజనీ, ప్రొ. పి. వెంకట రమణ, పలువురు డీన్స్, డైరెక్టర్స్, ఉద్యోగ సంఘాల నాయకులు కె . ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైదా, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar