విదేశీ కుట్రలు, విచ్ఛిన్నకర శక్తులతో దేశంలో అలజడులకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కుట్ర

హైదరాబాద్: భారతదేశంలో అశాంతిని సృష్టించి, యువతను రెచ్చగొట్టడం ద్వారా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు మరియు విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు తీవ్రంగా మండిపడ్డారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF), ఏఎస్ఏ (ASA) వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో “కాక్రోచ్ జనతా పార్టీ” వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పుణే, ముంబై, హైదరాబాద్ మరియు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల వెనుక ఈ దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక్తుల నుంచి రూ. 10 కోట్లు, కతార్, కెనడా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ల నుంచి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు అందుతోందని ఆధారాలతో సహా సంచలన విషయాలు బయటపెట్టారు. ఏ ఖలిస్తానీ శక్తులైతే రాహుల్ గాంధీ గారి నానమ్మను పొట్టనబెట్టుకున్నారో, అదే శక్తులతో రాహుల్ గాంధీ జతకట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

‘నీట్’ (NEET) పరీక్ష మరియు మోదీ ప్రభుత్వ పారదర్శక చర్యలు :

నీట్ ఎగ్జామినేషన్ లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన రాంచందర్ రావు గారు, లీకేజీ విషయం తెలిసిన వెంటనే ఎన్డీయే ప్రభుత్వం తక్షణమే స్పందించి 31 మందిని అరెస్ట్ చేసిందని తెలిపారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుకూల వ్యక్తులే ఈ లీకేజీకి కారణమని తేలిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం రీ-ఎగ్జామ్స్ నిర్వహించిందని, ఏ ఒక్క విద్యార్థి కూడా దీనిపై రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలపలేదని రాంచందర్ రావు గారు పేర్కొన్నారు. గతంలో పరీక్షల పేపర్ లీక్ అయితే కేవలం 420 కేసులు పెట్టి వదిలేసేవారని, కానీ మోదీ ప్రభుత్వం 2024లో “ప్రివెన్షన్ ఆఫ్ అన్-ఫెయిర్ మీన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్” తీసుకువచ్చి కోటి రూపాయల జరిమానాతో పాటు కఠిన శిక్షలు అమలులోకి తెచ్చిందన్నారు. అలాగే ప్రొఫెసర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA)ని బలోపేతం చేసి సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు.

Also Read-

2014కు ముందు యుపిఏ పాలనలోనే రికార్డు స్థాయి లీకేజీలు :

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ శక్తులు తమ గత చరిత్రను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు (టీఎంసి, డీఎంకే, ఎస్పీ,… బీఆర్ఎస్ మొదలైనవి) పాలించిన రాష్ట్రాల్లో సుమారు 53 కంటే ఎక్కువ ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని వివరించారు. 2005 నుండి 2014 వరకు సిబిఎస్ఈ, ఎయిమ్స్, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి అనేక జాతీయ స్థాయి పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆధారాలు చూపారు. ఆ సమయంలో ఏనాడైనా కాంగ్రెస్ లేదా నాన్-బిజెపి ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేశారా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధి కల్పనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన గణాంకాలతో తిప్పికొట్టారు.

ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎన్డీయే కొత్త చరిత్ర :

2004-2014 మధ్య యుపిఏ ప్రభుత్వం కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తే, 2014-2024 మధ్య మోదీ ప్రభుత్వం 17 కోట్ల ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ఎన్డీయే పాలనలో ఇప్పటివరకు 12 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేశామని, 19 రోజ్‌గార్ మేళాల ద్వారా నిరంతరం నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. 2017-18లో 6%గా ఉన్న నిరుద్యోగిత రేటు 2025 నాటికి 3.1%కి తగ్గింది. ఎంప్లాయ్‌మెంట్ రేటు 46.8% నుండి 57.4%కి పెరిగిందని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో ఐఐటీ (IIT), ఐఐఎమ్ (IIM), ఎయిమ్స్ (AIIMS), ఎన్ఐటీ (NIT) మరియు మెడికల్ కళాశాలల సంఖ్యను రెట్టింపు చేశామని, ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 4.5 కోట్లకు పైగా పెరిగిందని వివరించారు. వికసిత్ భారత్, ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా ద్వారా కోట్లాది మంది యువతకు స్వయం ఉపాధి లభించిందన్నారు.

తెలంగాణ యువత దేశానికే కొండంత అండ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు, విదేశీ నిధులతో నడిచే సంఘాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో జరిగిన పరిణామాలను ఇక్కడ పునరావృతం చేయాలని చూస్తే భారతీయ యువత చూస్తూ ఊరుకోదని, వారంతా దేశభక్తితో ప్రధాని మోదీ గారి నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X