డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ దేశ అస్తిత్వపు ప్రతీక : CM KCR

హైదరాబాద్‌: జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేదర్‌ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కూడా సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తరతరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేద్కర్ మహాశయుడేనని సీఎం తెలిపారు. ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసి మెలసి జీవించాలనే వసుధైక కు టుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు అంబేద్కర్‌ అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను సీఎం కేసీఆర్‌ స్మరించుకొన్నారు.

హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులు వడివడిగా సాగుతున్నాయి.

తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్‌గా తీసుకొని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనదని కొనియాడారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేదర్‌ మూర్తిమత్వాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.

తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠిస్తున్నట్టు సీఎం తెలిపారు. అంబేదర్‌ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. అదే దిశగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని పేర్కొన్నారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X