హైదరాబాద్ : పాన్ ఇండియా కాన్సెప్ట్ ఓ పెద్ద స్కాం అని బాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఛాయ సాహిత్యోత్వంలో మొదటి రోజు పాల్గొన్న ఆయన భారీ బడ్జెట్ అనేది సినిమా స్పూర్తిని దెబ్బతీస్తుందన్నారు. అది చిన్న సినిమాల మనుగడకు ప్రమాదకరమన్నారు. సౌత్ ఇండియాలో మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. సాహిత్యం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యానికి ఇతర భారతీయ, అంతర్జాతీయ సాహిత్యానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ ఛాయ సాహిత్యోత్సవం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

‘ఛాయ సాహిత్యోత్సవంలో సమజాన్ని కుదిపే సాహిత్యం ఎందుకు అవసరం’ అనే అంశంపై సినీ నటి రోహిణి, ప్రముఖ తమిళ కవయిత్రి, డీఎంకే మాజీ ఎంపీ సల్మ, మృణాళిని, కశ్మీరి కవయిత్రి నిఘత్ సాహెబా మాట్లాడారు. కవిత్వం ప్రపంచీకరణ, పరాయీకరణ అనే అంశంపై అమెరికన్ రచయిత పీటర్ కాన్స్టాంటైన్, కవి యాకూబ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ తమిళ రచయిత జయమోహన్, కన్నడ రచయిత వివేశ్ శాన్బాగ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సాహిత్యోత్సవంలో భాగంగా మొదటిరోజు అమరానందమే ప్రేమ, ఏడు గజాల కోక, ఊరు భంగం, అమ్మనాన్నకు, నీలి నీడలు, కలలు కన్న పిల్లలు పుస్తకాలను ఆవిష్కరించారు.

సాహిత్యోత్సవం లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ నేపథ్యగాయకులు సాయి చరణ్ భస్కరుని, హరిణి సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఫెస్టివల్లో తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్ తదితర భాషలకు చెందిన పలువురు వక్తలు పాల్గొన్నారు. సాహిత్యమే మనిషిని సజీవంగా నిలుపుతుందనే సందేశాన్నిచ్చారు. సంగీతం, సాహిత్యం మధ్య అనుబంధం, సాహిత్యంలో మాండలికాలు, తెలుగు సాహిత్య ఉద్యమాలు, పట్టణ జీవన నేపథ్యంలో కథలు, వ్యంగ్యం, నిరసన వంటి అంశాలు కూడా చర్చల్లో చోటుచేసుకున్నాయి. వివిధ భాషలు, సాహిత్య రంగాలకు చెందిన రచయితలు, వక్తలు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.
Also Read-

ఈ ఛాయ సాహిత్యోత్సవంలో మొత్తం గా 50 కి పైగా స్టాల్ లు ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన రచయితలు, కవులు, పండితులు, పాఠకుల మధ్య సాహిత్య చర్చలు, పరస్పర ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమం ద్వారా విభిన్న సాహిత్య సంప్రదాయాలను తెలుసుకోవడంతో పాటు, భాషలు, ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని సీఎల్ఎఫ్ డైరెక్టర్, సీనియర్ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోని రచయితలు, సాహిత్య ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ సాహిత్య చర్చల్లో కీలక కేంద్రంగా నిలిపేందుకు ఈ ఉత్సవం దోహదపడుతోందని ఛాయా నిర్వాహకులు అరునాంక్ వివరించారు.
