కమలేకర్ నాగేశ్వర్ రావు రచించిన “చెదరని బంధం” ప్రేమకథ కోవలో నిలిచే నవల మాత్రమే కాదు; మానవ సంబంధాలు విలువలు, కుటుంబ బాధ్యత, పేదరికం మనిషి జీవితంపై చూపే ప్రభావాన్ని, ఆశయ సాధన కోసం చేసే నిరంతర పోరాటాన్ని హృద్యంగా ప్రతిబింబించిన సామాజిక నవల. శీర్షికకు తగినట్టుగానే ఈ నవలలోని అనుబంధాలు కాలం, దూరం, పరిస్థితులు ఎన్ని పరీక్షలకు గురిచేసినా చెదరని బంధాలు గా నిలుస్తాయి. కథలోని ప్రతి మలుపు పాఠకుడిని పాత్రలతో పాటు నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది.
రచయిత కథను ప్రారంభించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. సముద్రతీరంలో గతాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్న రాధాకృష్ణ దృశ్యం కథకు భావోద్వేగ భరితమైన నేపథ్యాన్ని అందిస్తుంది. ఆ ప్రారంభమే కథలోని అంతర్మథనానికి, విరహాన్ని, జీవితం చేసిన గాయాలను పాఠకుని పరిచయం చేస్తుంది. అనంతరం చిన్ననాటి అనుబంధాలు, తల్లి మరణం, తండ్రి అనారోగ్యం, పేదరికం, చదువు కోసం రాధాకృష్ణ పడే కష్టాలు ఒక్కొక్కటిగా కథలో మిళితమవుతూ, అతని వ్యక్తిత్వాన్ని దృఢంగా నిలబెడతాయి.

ఈ నవలలో అత్యంత బలమైన అంశం పాత్ర చిత్రణ. రాధాకృష్ణ పాత్ర కేవలం కథానాయకుడిగానే కాకుండా, జీవితంలో పోరాడే ప్రతి యువకుడికి ప్రతినిధిగా కనిపిస్తుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చదువును ఆయుధం గా మార్చుకుని తన భవిష్యత్తును నిర్మించుకోవాలని అతని తపన ఎంతో సహజంగా ఆవిష్కరించబడింది. తండ్రి ఆరోగ్యం కోసం చదువును త్యజించడం, అవసరమైతే కూలి పని చేయడానికి వెనుకాడకపోవడం, అయినా తన లక్ష్యాన్ని మరవకపోవడం వంటి సంఘటనలు అతని వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెడతాయి. రచయిత రాధాకృష్ణ ఒక ఆదర్శవంతుడిగా కాకుండా, బలహీనతలు, భావోద్వేగాలు, ఆశలు, నిరాశలు కలిగిన సాధారణ మనిషిగా చిత్రించడం ఈ పాత్రకు జీవం పోసినది.
Also Read-
కృష్ణవేణి పాత్ర ఈ నవలలో మరో ప్రధాన ఆకర్షణ. చిన్ననాటి అభిమానాన్ని ప్రేమను మలుచుకున్న, స్వార్థం లేకుండా రాధాకృష్ణ ఎదుగుదల కోసం తన వంతు సహాయం చేయడం ద్వారా ఆమె పాత్రకు రచయిత గొప్ప గౌరవాన్ని కల్పించారు. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదని, ఎదుటివారి అభివృద్ధి కోరుకునే నిస్వార్థ త్యాగమని కృష్ణవేణి పాత్ర ద్వారా స్పష్టం చేశారు. ఆమె ప్రేమలో అధికారం లేదు, ఆత్మీయత ఉంది; ఆశ లేదు, అండ ఉంది; స్వార్థం లేదు, సమర్పణ ఉంది. అందుకే ఆమె పాత్ర పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
నవలలో కుటుంబ సంబంధాలు కూడా రచయిత సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. తండ్రి–కొడుకు మధ్య ఉన్న అనుబంధం, సవతి తల్లి రాకతో ఏర్పడిన మానసిక సంఘర్షణ, స్నేహితుల అండ, జీవితంలో ఎదురయ్యే అనుకోని మలుపు అన్నీ కథను వాస్తవ జీవితాన్ని మరింత చేరువ చేస్తాయి. ముఖ్యంగా పేదరికం ఒక మనిషి కలలను ఎలా పరీక్షిస్తుంది రచయిత ఎంతో సహజంగా చూపించారు. అయినప్పటికీ ఆశను కోల్పోని మనస్తత్వమే చివరకు విజయానికి దారి తీస్తుంది సందేశం నవల అంతా ప్రతిధ్వనిస్తుంది.
రచయిత భాష సరళమైన అయినప్పటికీ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా సాగుతుంది. అలంకారాల కంటే అనుభూతులకు ఎక్కువ స్థానం కల్పించారు. సంభాషణలు సహజంగా ఉండటం వల్ల పాత్రలు నిజజీవితంలో ఎదురుపడిన మనుషుల్లా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కవితాత్మకమైన వాక్యాలు కథకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ప్రతి ధారావాహిక ముగింపులో ఉత్కంఠను సృష్టించడం వల్ల తదుపరి భాగాన్ని చదవాలనే ఆసక్తి పాఠకుడిలో పెరుగుతుంది.
అయితే విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే, కొన్ని చోట్ల కథనం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. రాధాకృష్ణ మనోవేదన, కృష్ణవేణి ప్రేమ భావాలు రచయిత పదేపదే వివరించడం వల్ల కొన్ని సందర్భాల్లో పునరుక్తి కనిపిస్తుంది. అలాగే కొన్ని ఉప పాత్రలకు మరింత ప్రాధాన్యం, కథలో మరింత క్రియాశీలక పాత్ర ఇచ్చి ఉంటే కథనం ఇంకా బలంగా నిలిచేది. అయినప్పటికీ ఈ చిన్న లోపాలు నవల యొక్క భావోద్వేగ బలాన్ని తగ్గించలేవు.
“చెదరని బంధం” ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పిన నవల. ఇక్కడ ప్రేమ అనేది కలిసిపోవడమే కాదు; ఎదుటి వారి విజయాన్ని తన విజయంగా భావించడం, కష్టకాలంలో చేయి అందించడం, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్న అనుబంధాన్ని నిలబెట్టుకోవడం. ఈ నవలలో ప్రేమ, బాధ్యత, త్యాగం, ఆత్మవిశ్వాసం అనే నాలుగు స్తంభాలపై కథ నిలబడి ఉంది. అందుకే ఈ రచన ప్రేమకథలు ఇష్టపడే పాఠకులతో పాటు జీవిత పోరాటాలను ప్రతిబింబించే సామాజిక నవలలు అభిమానించే వారికి కూడా హృదయానికి హత్తుకునే పఠనానుభూతిని అందిస్తుంది.
సమగ్రంగా చెప్పాలంటే, కమలాకర్ నాగేశ్వర్ రావు రచించిన “చెదరని బంధం” నవల ప్రేమ, కుటుంబ బంధాలు, పేదరికం, బాధ్యత, త్యాగం, ఆత్మవిశ్వాసం వంటి జీవన విలువలు హృద్యంగా ఆవిష్కరించిన భావోద్వేగ ప్రధాన సామాజిక నవల. కథానాయకుడు రాధాకృష్ణ జీవిత పోరాటం, కృష్ణవేణి నిస్వార్థ ప్రేమ, కుటుంబ పరిస్థితుల మధ్య వ్యక్తిగత ఆశయాల కోసం జరిగే సంఘర్షణలో రచయిత సహజమైన కథనంతో, సరళమైన భాషలో హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. పాత్రల మానసిక సంఘర్షణ, ప్రేమలోని నిర్మలత్వం, కష్టకాలంలో అనుబంధాలు బలం, జీవితాన్ని జయించాలనే సంకల్పం నవలకు ప్రధాన బలాలు గా నిలిచాయి. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాల పునరావృతి కథనం కొద్దిగా నెమ్మదించినా, మానవ సంబంధాల సౌందర్యాన్ని, నిజమైన ప్రేమ గొప్పతనాన్ని, ఆశయ సాధనకు అవసరమైన సహనం, పట్టుదల ప్రభావవంతంగా ప్రతిపాదించిన ఈ నవల పాఠకుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచే రచనగా చెప్పవచ్చు.
ప్రతుల కోసం : కమలేకర్ నాగేశ్వర్ రావు (9848493223) సంప్రదించగలరు.

— శైలజామిత్ర
