హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విజయ సంకల్ప సమ్మేళనం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను సమీక్షించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణకు మూడు రోజుల పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటన తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైనది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పార్టీ సంస్థాగత బలం, కార్యకర్తల ఉత్సాహం, రాబోయే రాజకీయ దిశ స్పష్టంగా కనిపించబోతున్నాయి.
జూన్ 28న హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం నితిన్ నబిన్ శంషాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి మొత్తం రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు మరో 9 జిల్లాల బీజేపీ జిల్లా కార్యాలయాల వర్చువల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత విస్తరణలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.
తదనంతరం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), మల్కాజగిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ లెవల్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, బీఎల్ఏ-2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగరంలోని ముఖ్య నాయకులు హాజరవుతారు. దాదాపు 15,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నితిన్ నబిన్ గతంలో తెలంగాణకు వచ్చినప్పటికీ, హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఎంపీ శ్రీమతి రేఖా శర్మ కూడా హాజరై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై విలువైన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా నితిన్ నబిన్ గారు తెలంగాణ ప్రజలకు స్పష్టమైన రాజకీయ సందేశం ఇవ్వబోతున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఇప్పటికే మా నాయకత్వం స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పారు. రాబోయే తెలంగాణ అధికారమే లక్ష్యంగా పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనే సంకల్ప నినాదం ఈ వేదిక నుంచి వినిపిస్తాం.
Also Read-
ఇది కేవలం GHMC లేదా హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. తెలంగాణ మొత్తం రాజకీయ భవిష్యత్తుకు ఇది నాంది. ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కొత్త దిశ నిర్ణయించబడుతుంది. ఇదే పర్యటనలో వరంగల్‌లో కూడా బూత్ స్థాయి నాయకులతో సమావేశం జరుగుతుంది. అలాగే ఘట్‌కేసర్ సమీపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే. ఈ సమావేశాన్ని నితిన్ నబిన్ ప్రారంభిస్తారు.
అదేవిధంగా యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషించేందుకు VBIT క్యాంపస్‌లో Youth & Students Conclave నిర్వహించబడుతుంది. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని దేశ భవిష్యత్తు, యువత పాత్ర, వికసిత భారత్ లక్ష్యంపై ఆయనతో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత భారత్ దిశగా వేగంగా పయనిస్తోంది. అదే వికసిత సంకల్పంతో తెలంగాణలో కూడా బీజేపీ ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ నగరంలోని మూడు కీలక కార్పొరేషన్లలో GHMC, మల్కాజ్, సైబరాబాద్-భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని నమోదు చేస్తుందనే పూర్తి నమ్మకం మాకు ఉంది. మా కార్యకర్తల్లో అపార ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. GHMCతో పాటు మల్కాజగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయం.
MIM, కాంగ్రెస్, BRS-ఈ మూడు పార్టీలు కలిసినా కూడా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేవు. ఈ మూడు పార్టీల అసలు స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పునకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయే. రంగారెడ్డి జిల్లా ( గ్రామీణ) నూతనంగా నిర్మించిన బిజెపి పార్టీ జిల్లా కార్యాలయాన్ని రేపు బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ప్రారంభం చేయనున్న సందర్భంగా నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు మరియు ఇతర నేతలు పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
