“ప్రవీణ్ ఓంఎమ్మార్ షీట్…ఇదీ… లీకేజీ… ప్యాకేజీ… నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్…”

TSPSC పరీక్షలన్నీ లీక్

  • గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ
  • ఇదిగో సాక్ష్యం… ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్
  • పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా?
  • ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా?
  • నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా?
  • టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే
  • రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీంకు లీక్
  • గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ
  • లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందే
  • ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా?
  • లేనిపక్షంలో నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్సీఎస్సీని ముట్టడిస్తాం
  • కేసీఆర్ సర్కార్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను బండి సంజయ్ ప్రస్తావించారు.

ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే… ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని పేర్కొన్నారు. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని చెప్పారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటి ఘటన జరగడం అంత సులువు కాదని అన్నారు.

Related News:

కేసీఆర్ హయాంలో హయాంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీకేజీ అయ్యాయనే అనుమానం కలుగుతోందన్నారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ టీం వద్ద ఉందనే సమాచారం తమవద్ద ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యాంశాలు…

• ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది. ఉద్యోగాలకున్న డిమాండ్‌ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం.

• మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజి వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది.

Related News:

• ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ముందుగానే గ్రూప్-1 ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సేకరించి పరీక్ష రాశారు.

• ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే… ప్రవీణ్ కోసం పరీక్ష రాసే సమయ వేళలను కూడా మార్చేసినట్లు తమ ద్రుష్టికి వచ్చింది. ఈ అంశంపై ఓ పత్రికలో వార్త వచ్చేదాకా టీఎస్పీఎస్సీ స్సందించనేలేదు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలొస్తున్నాయి

• తమకు వస్తున్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిశీలిస్తే… టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ కుటుంబానికి ముందుగానే చేరుతున్నాయని అర్ధమవుతోంది. రాబోయే 2 నెలల్లో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ కుటుంబీకుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

• గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్‌ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది.

• అయినప్పటికీ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చెదురుమదురు ఘటనగా పరిగణించింది. అప్పుడే ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపించి ఉంటే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి. అయినా పట్టించుకోలేదంటే దీనివెనుక కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

• నిబంధనల ప్రకారం…. టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యం. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్లో ఉండటానికి వీల్లేదు. అట్లాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎట్లా ప్రత్యక్షమవుతాయి? వాటిని ప్రవీణ్, రాజశేఖర్ ఎట్లా పెన్ డ్రైవ్ లోకి తీసుకుంటారు? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యం?

• దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తేలికగా కొట్టిపడేసేందుకు యత్నిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరు కిందిస్థాయి ఉద్యోగులను మాత్రమే ఈ మొత్తం కుట్రకు బాధ్యులను చేసి తమ తప్పులను కప్పిపచ్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్లు అర్ధమవుతోంది.

• వాస్తవానికి తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. తెలంగాణను ఆర్దికంగా పూర్తిగా దివాళా తీయించిన కేసీఆర్ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి… నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

• తెలంగాణలో బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం… సుమారు 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… అందులో 80 వేలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలన్నీ లీకేజీ కావడం పరిశీలిస్తే… ఇందులో కచ్చితంగా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

• సీఎం కుటుంబంపై గతంలోనూ అనేక ఆరోపణలొచ్చాయి. కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అనేక వార్తలొచ్చాయి. ఫిర్యాదులు అందాయి. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఆయా ఉద్యోగాలన్నింటినీ అమ్ముకుందనే ఆరోపణలు వచ్చినయ్… అయినా వాటిపై సమగ్ర విచారణ జరపకపోవడం బాధాకరం.

• గతంలో జోన్ల పేరుతో, గుణాత్మక మార్పు పేరుతో కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఆ తరువాత ప్రతిపక్షాలను, కోర్టు కేసులను బూచీగా చూపి ఉద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమీపించడంతోపాటు లీకేజీ, ఉద్యోగుల ప్యాకేజీ పేరుతో డ్యామేజీ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేయడం క్షమించరాని నేరం.
• తాజాగా టీఎస్పీఎస్పీ నియమకాల్లోనూ ఛైర్మన్, కార్యదర్శులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది.

• ఈ మొత్తం వ్యవహారంపై రాష్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జోక్యం చేసుకుని తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X