హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరుగాంచిన దివంగత శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, మాజీ మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యావత్ ప్రపంచం ఉక్కు మహిళగా కీర్తించిన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరా గాంధీ నిరంతరం కృషి చేశారని అన్నారు. గుడిసెలు లేని గ్రామాలు ఉండాలనే సంకల్పంతో పేదల అభ్యున్నతికి ఆమె విశేష ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ‘గరీబీ హటావో’ నినాదం పేదరిక నిర్మూలన పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
దేశం కోసం అనునిత్యం శ్రమించిన మహానాయకురాలు ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
Also Read-
ఇందిరా గాంధీ కోడలు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, అందులోని విషయాల ద్వారా ఇందిరా గాంధీ జీవితం, దేశం కోసం ఆమె చేసిన సేవలను మరింతగా తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
