“సిద్దిపేటకు మేమే స్వాతంత్రం తెస్తాం…ప్రజా జీవితం నుంచి హరీశ్ రావును తరిమేస్తాం”

సిద్దిపేట : సిద్దిపేటకు తామే స్వాతంత్రం తెస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన హరీశ్ రావును ప్రజా జీవితంలో లేకుండా చేస్తామని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ సిద్దిపేట ప్రజలు మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్రం లేకుండా బతుకుతున్నారని.. ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురవేసి వారికి స్వాతంత్రాన్ని తెస్తామన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్న చందంగా కేసీఆర్ సిద్దిపేటను హరీశ్ రావుకు ఇస్తే పూర్తిగా ఈ ప్రాంతాన్ని దోచుకోవడం మీదే ఆయన దృష్టి పెట్టారన్నారు. భూమి, నీళ్లు, బొగ్గు ఇలా ఏదీ వదలకుండా అవినీతి చేశాడని చెప్పారు. అవినీతి పరుడు మాత్రమే కాదు.. బొగ్గును కూడా వదలని దొంగ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తిని ప్రజా జీవితంలో కొనసాగనివ్వడం మంచిది కాదన్నారు. శుక్రవారం సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తాలోని అమర వీరుల స్తూపం సమీపంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి కవిత, అనిల్ దంపతులు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకమ్మ సాగర్ లలో ఆయన చేసిన అవినీతిని పూసగుచ్చినట్లు వివరించారు.

సిస్మిక్ జోన్ లో మల్లన్న సాగర్

సిస్మిక్ జోన్ లో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారని ఎన్ జీఆర్ఐ హెచ్చరించినా అప్పటి ఇరిగేషన్ మంత్రి వినలేదని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో లోపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని తెలిపారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం చేస్తున్న బ్లాస్టింగ్స్ తో మల్లన్న సాగర్ కట్ట దెబ్బతింటుందని కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. భూకంప ముప్పు నుంచి రక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ జీఆర్ఐ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా 6 వేల కోట్ల ప్రాజెక్ట్ ను 9 వేల కోట్లకు పెంచి అడ్డగోలుగా అవినీతి చేశారన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వలేదన్నారు. రంగనాయకమ్మ సాగర్ భూమి మునిగిపోతుందని రైతులను భయపెట్టి వాళ్ల నుంచి తక్కువ ధరకు 14 ఎకరాలు కొట్టేసి అక్కడ ఫాం హౌస్ నిర్మించుకున్నాడని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ కు నీటిని తరలించే పనుల డిజైన్ లలో మార్పులు చేసి రూ. 1700 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచారని తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పనులు నాసిరకంగా చేయడంతో అక్కడ లీకేజీలు అవుతున్నాయని.. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి బ్లాస్టింగ్ అంటూ హరీష్ రావు డ్రామా మొదలు పెట్టారని చెప్పారు. ఇటీవల మల్లన్న సాగర్ కు వెళ్లి అక్కడ ప్రభుత్వం బ్లాస్టింగ్ చేసిందంటూ హరీష్ రావు చేసిన హంగామా అంత కూడా మల్లన్న సాగర్ లో తన అవినీతి బయటపడకుండా ఉండేందుకేనని అన్నారు.

నిమ్స్ లో 100 కోట్ల స్కామ్

ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు నిమ్స్ హాస్పిటల్ లో వందకోట్ల స్కామ్ చేశారని కవిత చెప్పారు. వాటికి సంబంధించి అన్ని ఆధారాలను తనకు హాస్పిటల్ లోని ఉద్యోగులే పంపించారన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ బాడీ మీటింగ్ లేకుండానే, ఉద్యోగులతో మాట్లాడకుండానే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెప్పి రూ. 25 కోట్లు వేరే ఖాతాలకు మళ్లించాడన్నారు. మొత్తంగా నిమ్స్ లో ఆయన వందకోట్ల స్కామ్ చేశారని చెప్పారు. ఆ మీటింగ్ కు సంబంధించి మినిట్స్, వివరాలన్నీ కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈనెల 19న సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Also Read-

కొండపోచమ్మ సాగర్ లో 1700 కోట్ల అవినీతి

కొండపోచమ్మ సాగర్ లోనూ హరీశ్ రావు భారీగా అవినీతికి పాల్పడ్డారని కవిత చెప్పారు. ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించాల్సిన టన్నెల్ ను మార్చి కాలువ నిర్మించారని.. దాని కోసం ఏకంగా 17 వందల కోట్లు అధికంగా వ్యయం చేశారన్నారు. దీనిలో అప్పటి ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇద్దరు ఇంజనీర్లపై కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏజెన్సీల నుంచి అవినీతి సొమ్ము రికవరీ చేయాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. 2016-2017 లో కొండపోచమ్మ సాగర్ పొంగి పెద్ద ఎత్తున ఓ గ్రామంలోకి నీళ్లు చేరాయని గుర్తు చేశారు. నాసిరకంగా ఈ పనులు చేపట్టి పెద్ద ఎత్తున అవినీతి చేశారన్నారు.

బొగ్గును కూడా వదలని దొంగ

హరీష్ రావు బొగ్గును కూడా వదలని దొంగ అని కవిత అన్నారు. హైదరాబాద్ లో కాకుండా సిద్దిపేటలోనూ ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారని చెప్పారు. బొగ్గు డంపింగ్ యార్డుల పేర్లతో పర్మిషన్లు తీసుకొని వాటిలో కూడా అవినీతి చేశారని చెప్పారు. మహారాష్ట్ర నుంచి బొగ్గు తెస్తామని పర్మిషన్ తెచ్చుకొని సింగరేణి నుంచి అక్రమంగా బొగ్గు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట టౌన్ లో ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఒక వ్యాపారికి లాభం చేసేందుకు వెయ్యి గజాల స్థలం కొట్టేసి ఊరి చివరన పెట్టారన్నారు. వ్యాపారి భూములతో పాటు తాను కొట్టేసిన భూములకు విలువ పెంచుకోవటం కోసమే ఇలా చేశారన్నారు. రోజు కో గుడి దగ్గర నామాలు పెట్టుకొని కనిపించే హరీశ్ రావు దేవుడి భూములను కూడా వదలండం లేదని తెలిపారు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి గుడి భూములు మూడు ఎకరాలు దోచుకున్నారని తెలిపారు. మరో రెండు ఎకరాలను తన సన్నిహితులకు ఇప్పించుకున్నారని అన్నారు.

అమరవీరులకు అగ్గిపెట్టే దొరికింది.. కానీ హరీష్ రావుకు దొరకలేదు

కేసీఆర్ సిద్దిపేటను హరీష్ రావు ఇచ్చిన నాటి నుంచి ఆయన వెన్నుపోటు పొడవడం మొదలు పెట్టారని తెలిపారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ ను అల్గనూర్ వద్ద అరెస్ట్ చేసినప్పుడు గ్యాస్ నూనె పోసుకొని అగ్గిపెట్టే దొరకలేదని డ్రామా చేశారని చెప్పారు. అమరవీరులు 12 వందల మందికి అగ్గిపెట్టే దొరికింది గానీ హరీష్ రావు దొరకలేదా అని ప్రశ్నించారు. 12 వందల మంది అమరులైతే వారిలో 6 వందల మందికి మాత్రమే సాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హరీష్ రావు సహా కొంతమంది నాయకులకు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యమం చేసినందుకు ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారా అని నిలదీశారు. అమరుల కన్నా వీరి త్యాగాలు గొప్పవా అని ప్రశ్నించారు. 2004లో హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్ లో ఉన్న ఆస్తులకు 2023 నాటికి అఫిడవిట్ లో ఉన్న ఆస్తులకు పొంతన లేదన్నారు. అన్ని కోట్ల ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేసిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని.. ఇలాంటి వ్యక్తులకు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హత లేదన్నారు.

మౌనంగా ఉంటానంటే ప్రజలు మౌనంగానే బుద్ది చెప్తారు

తాను అడిగి ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదీ అడిగినా మౌనంగా ఉంటానంటే ప్రజలే మౌనంగా బుద్ది చెబుతారన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పానని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా వారిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువ ఉందో లేదో కూడా సమాధానం ఇవ్వాలన్నారు. ఇన్ని తప్పులు పెట్టుకొని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తామంటే కుదరదన్నారు. తాను అడిగి వాటికి సమాధానం చెప్పకుండా తనను యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తిట్టిస్తే నిజాలు అబద్దాలు కావని చెప్పారు.

గుంటనక్క అవినీతిపై విచారణ చేపట్టే దమ్ము గుంపుమేస్త్రీకి ఉందా?

గుంటనక్క, గుంపుమేస్త్రీ ఇద్దరు కుమ్మక్కు అయ్యారని కవిత అన్నారు. లేదంటే హరీష్ రావు పాలవ్యాపారం నుంచి నిమ్స్ స్కామ్ వరకు అవినీతి అంశాలపై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవటం లేదన్నారు. నిమ్స్ లో జరిగిన వందకోట్ల స్కామ్ పై ఆధారాలు పంపిస్తే చర్యలు తీసుకునే దమ్ము ముఖ్యమంత్రి కి ఉందా అని సవాల్ విసిరారు. మల్లన్న సాగర్ వద్ద భూకంపం పొంచి ఉందన్న నివేదికను బుట్ట దాఖలు చేశారని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దమ్ముంటే సిద్దిపేటలో హరీష్ రావు అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాలన్నారు. మళ్లీ ఆమ్యామ్యాలు తీసుకొని వదిలేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మారన్నారు.

బీఆర్ఎస్ అవినీతిలో పైసా భాగస్వామ్యం లేదు

పదేళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కుటుంబంలో సభ్యురాలినైనప్పటికీ వారి అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని కవిత స్పష్టం చేశారు. తాను ఏదైనా పనికోసం పైరవీలు చేసినట్లైనా, కేసీఆర్ గారిని ఏదైనా పనికోసం అడిగినట్లైనా నిరూపించాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టు ఎంతో మంది కుటుంబ సభ్యులు, ఇతర నేతలకు భూములు వచ్చాయని ఆ వివరాలను మీడియాకు చూపించారు. ఆ ప్రాంతంలో తనకు గానీ తన కుటుంబ సభ్యులకు గానీ ఒక్క ఎకరా భూమి లేదన్నారు. తాను అఫిడవిట్ లో చూపించిన దాని కన్నా గజం స్థలం ఎక్కువగా ఉన్న ప్రభుత్వానికే రాసిస్తానని చెప్పారు.

కాళేశ్వరం ద్వారా మెదక్ లో లక్ష ఎకరాలకే నీళ్లు

బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి సిద్దిపేటకు ఉమ్మడి మెదక్ జిల్లాకు గానీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి ఉమ్మడి మెదక్ లో లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా అందులో 10 లక్షల ఎకరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక లో కలిసి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తున్నారని చెప్పారు. పదేళ్ల పాలనలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అమరవీరులకు కుటుంబాలకు కూడా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ను ఉద్దరించానని చెప్పే హరీష్ రావు అక్కడి ప్రజలకు కూడా చేసిందేమీ లేదన్నారు. వైశ్యులు, పద్మశాలీలు, అవుసుల వాళ్ల ఉపాధి దెబ్బకొట్టేలా సిద్దిపేటకు కార్పొరేట్ సంస్థలను మాత్రమే తెచ్చాడన్నారు. కేవలం ప్రచారం కోసమే సిద్దిపేటలో వెయ్యి పడకల హాస్పిటల్ ను ప్రారంభించారని.. వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఎందుకు అక్కడ సిబ్బంది నియమించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదని కవిత అన్నారు. బీఆర్ఎస్ మీద కోపంతో ఆ పార్టీకి అవకాశం కల్పిస్తే వాళ్లకు పాలన చేతకావటం లేదన్నారు. లోయర్ మానేరు డ్యామ్ నుంచి మల్లన్న సాగర్ ను పైసా ఖర్చు లేకుండా తీసుకురావచ్చని ఏడాది క్రితమే తాను చెప్పనని కవిత గుర్తు చేశారు. కానీ ఈ చేతగానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పుడే దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు కరువు పరిస్థితి ఉండేది కాదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవటం లేదని మండిపడ్డారు.

మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

బీఆర్ఎస్ కు రెండుసార్లు, కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారని.. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామన్నారు. కమీషన్ల కోసం రోజుకో కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పి ప్రజలకు నష్టం చేయమని చెప్పారు. రాజకీయాల్లో కొత్తవారు రావాల్సిన అవసరముందన్నారు. తాను పార్టీ పెట్టే ముందు ఏడాది పాటు అధ్యయనం చేశానని చెప్పారు. ఉచిత విద్య, మెరుగైన ఉచిత వైద్యం ప్రజలకు అందాల్సిందేనన్నారు. ఎంతో మంది మేధావులతో చర్చించిన తర్వాతే పాంచజన్యం పేరుతో ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నామన్నారు. కచ్చితంగా ప్రజలు తమకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉందన్నారు. సిద్దిపేటలో కచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని.. మున్సిపల్ ఎన్నికల నుంచి తాము పోరాటం మొదలు పెడతామన్నారు. హరీష్ రావు ఓటమిని ఇక్కడి ప్రజలు ఎప్పుడో రాసిపెట్టారన్నారు. సిద్దిపేట తన సొంత ఊరని… పుట్టింటి వాళ్లు పట్టించుకోకపోయిన సరే గతేడాది ఊరి ప్రజలు బతుకమ్మ ఆడేందుకు తనకు ఆహ్వానించారని గుర్తుచేసుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం నేను మొదలుపెట్టిన పార్టీకి సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. కేసీఆర్ గారిని తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించారో తనను అలాగే ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

కవితకు ఘనస్వాగతం

పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు సిద్దిపేటకు వచ్చిన కవితకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత.. అనంతరం రంగదాంపల్లి చౌరస్తా లో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి సీఎస్ఐ చర్చికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఇక్బాల్ మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar