హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు, ఇతర అధికారుల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఆమె ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
చట్టసభల పవిత్రతను మంటగలుపుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సదరు ప్రజా ప్రతినిధులపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా అడ్డుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికల సంఘం ద్వారానే ఏ పౌరుడికైనా ఓటు హక్కు లభిస్తుందని, అలాంటి ఓటర్ల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే, ఇలా ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమంటే ఓట్లను దుర్వినియోగపరచడమే అవుతుందన్నారు.

అర్ధనగ్న ప్రదర్శనలు, దాడులకు యత్నం..
ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన పేరుతో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ఇందిరాశోభన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల ముందే కనీస ఇంగితజ్ఞానం లేకుండా తమ టీ షర్టులు విప్పేసి అర్ధనగ్నంగా ప్రదర్శనకు దిగారని మండిపడ్డారు. అంతేకాకుండా ఇతర పోలీసు అధికారుల కాలర్లు పట్టుకుని దాడికి యత్నించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆమె విమర్శించారు. చట్టాలను అమలు చేసే పోలీసుల పట్ల, అందులోనూ మహిళా అధికారుల పట్ల చట్టసభల ప్రతినిధులే ఇలా అమానుషంగా ప్రవర్తించడం వారి నైతిక పతనానికి నిదర్శనమని ఘాటుగా స్పందించారు.
Also Read-
రాజ్యాంగ విలువల ఉల్లంఘనే..
నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అది ఇతరుల గౌరవానికి, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని ఇందిరాశోభన్ గుర్తుచేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, 15, 21లతో పాటు, భారత న్యాయ స్మృతి ప్రకారం మహిళల పట్ల ఈ తరహా ప్రవర్తన తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి గెలిచిన ప్రజాప్రతినిధులే.. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని కోరారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరపాలి
ఈ ఘటనపై అసెంబ్లీ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలు, వీడియోల ఆధారంగా సమగ్ర విచారణ జరిపించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. నైతిక పతనం, రాజ్యాంగ విలువల ఉల్లంఘన కింద ఈ ఘటనను పరిగణించి బాధ్యులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తరహా నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో తిరిగి చట్టసభల్లో అడుగుపెడితే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను, మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించే దిశగా ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె తన వినతిపత్రంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మహిళా నాయకులు రేణుక గౌడ్, రజని, జోత్స్న తదితరులు ఎలక్షన్ కమిషన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

One thought on “బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోండి, తెలంగాణ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ ఫిర్యాదు”