తెలంగాణలో ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు : కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం రాష్ట్ర ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ వెయ్యి రోజుల్లో కేవలం ప్రభుత్వం మాత్రమే మారలేదు తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి పునరుద్ధరించబడింది.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేతుల్లో కేంద్రీకృతమైంది. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, చివరకు సామాన్య ప్రజల గొంతుకకు కూడా విలువ లేకుండా పోయింది. సచివాలయం ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, ప్రశ్నించే వారిని శత్రువులుగా చూశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరంకుశ సంస్కృతికి ముగింపు పలికింది. నేడు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది. మంత్రులు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి, గ్రామసభలు, ప్రత్యక్ష ప్రజా సంప్రదింపుల ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకువచ్చాం.

ప్రజాస్వామ్య పునరుద్ధరణతోపాటు విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేశాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వారి ఆర్థిక స్వావలంబనకు, స్వేచ్ఛకు దోహదపడింది. గృహజ్యోతి ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తూ పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చాం.

పౌర సరఫరాల రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచే సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.42 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. లక్షలాది అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి, ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల సహాయంతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్నాం.

Also Read-

రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచాం. భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు బోనస్ ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశాం. వ్యవసాయ కూలీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్రబిందువుగా మార్చాం.

సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాం. దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పట్టణ మౌలిక వసతులు భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులు వేస్తున్నాయి. సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో సాధించిన పురోగతి సామాజిక న్యాయం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన భారీ అప్పులు, బడ్జెట్ వెలుపలి రుణాలు, పెండింగ్ బకాయిలు, అసంపూర్తి ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఈ విజయాలను సాధించాం. భారీ రుణాలు, వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమాన్ని కొనసాగించి, అభివృద్ధికి పెట్టుబడులను పెంచాం.

బీఆర్ఎస్కు ఆందోళన చేసే స్వేచ్చ ఉంది ఆ స్వేచ్చే తెలంగాణలో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందనడానికి నిదర్శనం. కానీ వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ విజయాలను వారు చెరిపివేయలేరు. కుటుంబ పాలన నుంచి ప్రజా పాలన వైపు తెలంగాణ నిర్ణయాత్మకంగా అడుగులు వేసింది. మరింత సంకల్పంతో ఈ ప్రజా ప్రస్థానం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X