హైదరాబాద్ : నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026” రూపకల్పనకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో భర్తీ చేయడం ద్వారా పట్టణ ప్రజా రవాణాను నెట్-జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులకు చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం కారణంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ఇంధన ధరల పెరుగుదల ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా CURE ప్రాంతంలోని అర్హత కలిగిన అన్ని ICE ఆటో రిక్షాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర పథకాన్ని రూపొందిస్తోందని మంత్రి వెల్లడించారు.
Also Read-
18,766 ఆటోలు పథకం పరిధిలోకి
రవాణా శాఖ అధికారిక డేటాబేస్ ప్రకారం CURE ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌తో క్రియాశీలంగా ఉన్న 18,766 అర్హత కలిగిన ICE ఆటో రిక్షాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
డీజిల్ ఆటోలు – 11,254
పెట్రోల్ ఆటోలు – 7,512
మొత్తం అర్హత కలిగిన ఆటోలు – 18,766
అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి తన అవసరానికి అనుగుణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.
అంశం–A: ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్
తమ ప్రస్తుత ఆటో రిక్షా ఛాసిస్‌ను కొనసాగించాలనుకునే లబ్ధిదారులు AIS–123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్ ద్వారా తమ వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చుకోవచ్చు.
ఈ విధానంలో కిట్ ఖర్చు, ఇన్‌స్టాలేషన్ మరియు ప్రామాణిక ఫిట్మెంట్ ఉపకరణాల ఖర్చుతో కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం – ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుంది. ఎంపానెల్ చేసిన విక్రేతల ద్వారా అమర్చే ఫిక్స్‌డ్ బ్యాటరీ కిట్ లేదా అవసరమైనప్పుడు తొలగించి తిరిగి అమర్చుకునే స్వాపబుల్ బ్యాటరీ కిట్‌లలో లబ్ధిదారులు తమకు అనుకూలమైన ఎంపిక చేసుకోవచ్చు.
అంశం–B: కొత్త ఎలక్ట్రిక్ ఆటోతో పూర్తిస్థాయి మార్పు
తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను పూర్తిగా అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేయాలనుకునే లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఫ్యాక్టరీలో తయారైన, టైప్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ (L5M) కొనుగోలుకు రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ అందించబడుతుంది.ఎంపిక చేసిన మోడల్ తుది ఆన్‌రోడ్ ధర నుంచి సబ్సిడీ మొత్తాన్ని ఎంపానెల్ చేసిన డీలర్ ముందుగానే తగ్గించి లబ్ధిదారుడికి వాహనాన్ని అందించే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
రూ.200 కోట్లతో పథకం
ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించింది. పథకం CURE ప్రాంతంలోని వాహన యజమానులందరికీ వారి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సమానంగా వర్తించనున్నందున, వివిధ సంక్షేమ శాఖల నుంచి నిధులను సమకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లు సమకూర్చే విధంగా ప్రతిపాదన రూపొందించారు.
మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థ
పథకం పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు అయ్యేలా మూడు స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC):
రోడ్లు–భవనాలు మరియు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా, రవాణా శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
పథకం అమలు కమిటీ (SIC):
రవాణా శాఖ కమిషనర్ అధ్యక్షతన, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, CURE ప్రాంతంలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, నామినేట్ చేసిన సంక్షేమ అధికారులు సభ్యులుగా ఉంటారు. జేటీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
జిల్లా మంజూరు కమిటీ (DSC):
సంబంధిత జిల్లాల కలెక్టర్లు అధ్యక్షతన, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, జిల్లా రవాణా అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఆర్టీవోలు, జిల్లా సంక్షేమ అధికారులు సభ్యులుగా, డీటీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
కాలుష్య నియంత్రణతో పాటు డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనం
CURE ప్రాంతంలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోలను పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు వీలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం ద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఖర్చు నుంచి ఆటో డ్రైవర్లు, యజమానులకు ఉపశమనం కల్పించవచ్చని తెలిపారు.
“తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణ అభివృద్ధి, ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
