హైదరాబాద్ : దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే “అమృత్ స్టేషన్ పథకం” కింద దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు.

తెలంగాణలో ఈ పనులకు 2023 ఆగస్టు మరియు 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పథకం ప్రకారం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారు.

Also Read-
హైదరాబాద్లోని ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ కి చేరుకోవడానికి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అత్యంత సమీప రైల్వే స్టేషన్. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఐటీ కారిడార్ విస్తరించడంతో పాటు భారీ స్థాయిలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో కాంట్రాక్ట్ కార్మికుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు అన్ని వర్గాల ప్రజలు ప్రతిరోజూ ఈ స్టేషన్ను వినియోగిస్తున్నారు. ఈ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను అమృత్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు.

హైటెక్ సిటీ అమృత్ రైల్వే స్టేషన్ ముఖ్యాంశాలు
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక సబర్బన్ స్టేషన్.
ఈ స్టేషన్ లింగంపల్లి–సికింద్రాబాద్ ఉపనగర రైల్వే మార్గంలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పశ్చిమ ప్రాంతం మరియు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగపడుతోంది.
ఈ స్టేషన్లో సబర్బన్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్దానగర్, ఫలక్నుమా, మేడ్చల్, ఘట్కేసర్ ప్రాంతాలకు సుమారు 62 రైళ్లు నడుస్తున్నాయి.
ఈ స్టేషన్ను రోజుకు సుమారు 3,000 మంది ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు.

అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు
స్టేషన్ ప్రవేశ ద్వారం ను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.
ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు.
ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్లు మరియు 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.
ప్లాటుఫారం లను మెరుగుపరిచి, అదనపు షెడ్లు, కొత్త శౌచాలయం, వెయిటింగ్ హాల్, ల్యాండ్స్కేపింగ్, ఫసాడ్ లైటింగ్, ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఆధునిక రూపకల్పనతో కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు.
డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు. దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
పాత స్టేషన్ భవనాన్ని అవసరానికి అనుగుణంగా పునరుద్ధరించి, మార్పులు చేశారు.
ఇంతకు ముందు వెయిటింగ్ హాల్ లేకపోవడంతో, ఇప్పుడు కొత్త వెయిటింగ్ హాల్ నిర్మించారు.
స్టేషన్ ప్రవేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త పోర్టికో నిర్మించారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ఆధునిక శౌచాలయం ను ఏర్పాటు చేశారు.

