హైదరాబాద్ : భవిష్యత్ వృత్తులను తీర్చిదిద్దేది ఏఐ నైపుణ్యాలే కానీ, ఏ. ఐ. మాత్రమే కాదని ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఫైనాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీనియర్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ గుజ్జు పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో శుక్రవారం విశ్వవిద్యాలయంలో “బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు వినియోగం–విద్యా విధానంలో ప్రపంచ దృక్పథం” అనే అంశంపై అధ్యాపకులకు అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ… సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అవసరం తప్పనిసరి అయిందని, విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది ఏ.ఐ. పై పట్టు సాధించాలని, అప్పుడే విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అర్ధం అయ్యేలా బోధించడానికి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ప్రత్యేకంగా ఏ.ఐ. ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధ్యాపకులు మార్కెట్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఎప్పటికప్పుడు వచ్చే సాంకేతిక మార్పులను గమనిస్తూ వాటిపై పట్టు సాధించాలని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సూచించారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఫైనాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీనియర్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ గుజ్జు మాట్లాడుతూ ఏ.ఐ. ఉద్యోగాలను తొలగించదని, ఏ.ఐ. మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఏ.ఐ.ని సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకున్న నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఊహించిన ఫలితాలను తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అందుకోవడానికి, ఉత్పాదకత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఏఐ సాధనాలను సహాయకులుగా మాత్రమే స్వీకరించాలని సూచించారు. పరిజ్ఞానం పొందిన తర్వాత సొంతంగా ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. అవకాశాలను అంచనా వేయడం, కంటెంట్‌ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి ఆయా రంగాల్లో మానవ మేధస్సు (ఏ. ఐ.)ను ఉపయోగించాలని వివరించారు. ఏఐకి సంబంధించిన అపోహలు, వాస్తవాల మధ్య వ్యత్యాసాలను సమగ్రంగా వివరించారు. ఏ అంశంలో అయినా మానవ విచక్షణ అనివార్యమని పేర్కొన్నారు. ఏఐ రూపొందించిన సమాచారంపై గుడ్డిగా ఆధారపడకుండా ముందు, దానిని జాగ్రత్తగా మరొక్కసారి ధృవీకరించుకోవాలని సూచించారు. అధ్యాపకులు చక్కగా రూపొందించుకున్న పాఠ్య ప్రణాళికలు, నిర్మాణాత్మక అభ్యాస అనుభవాలను జోడించి అధ్యాపకులు ఏ.ఐ.ని ఉపయోగించుకోవాలని, స్కాలర్స్ కి పరిశోధనలో కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
Also Read-
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్, కోల్ (COEL) డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ… మారుతున్న ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ప్రాముఖ్యత పెరిగిందని, అయితే ఏ.ఐ. ని చాలా జాగ్రత్తగా, సమాజానికి ఉపయోగపడేలా వాడాలని పేర్కొన్నారు. ఏ.ఐ. పై అధ్యాపకులు పట్టు సాధించాలని ప్రొ. పుష్పా చక్రపాణి సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణ రెడ్డి, ప్రొ. ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్; ప్రొ. పల్లవీ కాబడే, ఏ.ఐ. సాంకేతిక నిపుణురాలు సుష్మనా రావు, ప్రొ. బోజు శ్రీనివాస్, ప్రొ. కృష్ణా రెడ్డి, ప్రొ.చంద్రకళ, ప్రొ. మేరీ సునంద, ప్రొ. ఎస్వీ రాజశేకర్ రెడ్డి, డైరెక్టర్లు, డీన్‌లు, ఆయా శాఖల అధిపతులు, విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

