హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గ BRS జనరల్ బాడీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఆయన సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌కు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళనే వెన్నుపోటు పొడిచారన్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అన్న కెటిఅర్ అమెపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్ గాంధీకి చెప్పినందుకే రేవంత్ పగపట్టారన్నారు. అందుకే మీనాక్షి నటరాజనం మీద రేవంత్ రెడ్డి హైదరాబాదులో దొంగ కేసు పెట్టించారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కుట్ర సమాచారం కూడా లేని అమె రాజ్యసభకు నామినేషన్ వేసిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి తాను పెట్టిన దొంగ కేసు వివరాలు బిజెపికిచ్చారని అరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర అరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి పాలనను “అట్టర్ ఫ్లాప్”గా అభివర్ణించిన కేటీఆర్, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు మిగిలిండ్ ఏండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హమీలిచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదన్నారు. సగం కాలం ముగిసినా ఒక్క హమీల అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఒక అట్టర్ ప్లాప్ సినిమాతో పోల్చారు.
Also Read-
నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ. 4 వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. మహిళా హామీపై స్పందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని అన్నారు.
త్వరలో ఉపఎన్నికలు వస్తాయన్న కెటిఅర్ ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ BRSను గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నర ఏళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు.
కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సాయాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. “జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ మరియు మంచినీటి సమస్యలపై కేటీఆర్ మాట్లాడుతూ, “2014కు ముందు హైదరాబాద్‌లో కరెంట్ సమస్యలు ఉండేవి, కానీ కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించాం. ఎండాకాలం వచ్చిందంటే కుండలతో ధర్నా చేసే పరిస్థితి ఉండేది, కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తాం. 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే” అని స్పష్టం చేశారు.
ఆరోగ్య రంగంలో BRS ప్రభుత్వం చేసిన కృషిని కేటీఆర్ గుర్తుచేశారు. “నిజాం కాలం తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి నిర్మించలేదు. కానీ కేసీఆర్ నాలుగు TIMS ఆస్పత్రులను, వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి, బసవతారకం ఆస్పత్రిలో పేద రోగుల సహాయకుల కోసం ధర్మశాలలు కట్టించారు. రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మనది. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం” అని ఆయన విమర్శించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ, “ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశాం, మూడోసారి కూడా సిద్ధం కావాలి. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ వల్ల త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయం. ప్రతి ఓటు విలువైనది, జూబ్లీహిల్స్‌లో లాగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలి” అని పిలుపునిచ్చారు.
చివరగా, రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ, “జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే SIR (సమగ్ర ఇంటింటి సర్వే) నమోదులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలి. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలి. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నాం, టికెట్ ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సచివాలయానికి ఆయన పేరు పెట్టారు. అంబేద్కర్ చెప్పినట్లుగా జనగణన మరియు ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
