హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయమైన సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాన విభాగాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు, సీనియర్ అధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారంలో దక్షిణ మధ్య రైల్వే చురుకుగా పాల్గొందని తెలిపారు. ఈ ప్రచారం 2026 మే 15 నుండి జూన్ 5 వరకు “క్త్లెమేట్ చేంజ్ : ఫోకసింగ్ ఆన్ ది ఛాలెంజస్ ఫేస్డ్ బై మథర్ ఎర్త్” (వాతావరణ మార్పు: భూమాత ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించడం) అనే ఇతివృత్తంపై కేంద్రీకృతమై ఉంది. జోన్ వ్యాప్తంగా నిర్వహించిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా సమన్వయం చేస్తూ నిర్వహించినందుకు పర్యావరణ మరియు హౌస్ కీపింగ్ నిర్వహణ విభాగం చేసిన కృషిని జనరల్ మేనేజర్ అభినందించారు. పిల్లల కోసం నిర్వహించిన చిత్రలేఖనం మరియు వ్యాస రచన పోటీలు మన భూమిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

జనరల్ మేనేజర్ అత్యంత పర్యావరణహితమైన రవాణా మార్గాలలో రైల్వే ఒకటి అని, ట్రాక్ల విద్యుదీకరణ, పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం మరియు వనరుల సుస్థిర వినియోగం వంటి వివిధ ప్రయత్నాల ద్వారా ఈ లక్ష్యం పట్ల దక్షిణ మధ్య రైల్వే నిబద్ధతను ప్రదర్శించిందని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, ఇకపై పర్యావరణ దినోత్సవం కేవలం ఆచరణాత్మక దశలోకి ప్రవేశించిందని పర్యావరణ హిత భవిష్యత్తు కోసం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన దక్షిణ మధ్య రైల్వే బృందానికి తెలియజేశారు.
Also Read-
ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే బృందం జోన్ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలలో కనబరిచిన ఉత్తమ పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమాలలో అన్ని విభాగాలు, శాఖలు ఉత్సాహంగా పాల్గొన్నాయని, ముఖ్యంగా ఇంధన పొదుపు, చెట్ల పెంపకం కార్యక్రమాలలో మంచి పురోగతి సాధించబడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే తరాల కోసం భూమిని, మన పర్యావరణాన్ని పరిరక్షించి, కాపాడాలని ఆయన నొక్కి చెప్పారు. ఇంధనాన్ని, వనరులను వివేకవంతంగా వినియోగించడం మరియు పర్యావరణాన్ని తిరిగి పచ్చగా, అందంగా తీర్చిదిద్దడం ద్వారా నేడు మనం ఎదురుకుంటున్న గరిష్ట ఉష్ణోగ్రతలను అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు నాందేడ్ డివిజన్ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వైద్య విభాగాల ప్రతినిధులతో కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచారం సందర్భంగా తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలపై వివరణాత్మక నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమాలలో పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, ప్లాస్టిక్ తగ్గింపు మరియు సుస్థిర పద్ధతులు, ‘ఏక్ పెడ్ మా కే నామ్’ మొక్కల పెంపకం కార్యక్రమం, హరిత మరియు సుస్థిర రైల్వే కార్యకలాపాలు, నీరు మరియు ఇంధన పరిరక్షణ కార్యక్రమాలు మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో, ” క్త్లెమేట్ చేంజ్ : ఫోకసింగ్ ఆన్ ది ఛాలెంజ్ స్ ఫేస్డ్ బై మథర్ ఎర్త్ ” అనే అంశంపై రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన చిత్రలేఖనం మరియు వ్యాస రచన పోటీల విజేతలకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే బోర్డు స్థాయిలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ , ఇతర సీనియర్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో, రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు సీఈఓ అయిన సతీష్ కుమార్ గారు, భారతీయ రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా పరిశుభ్రత మరియు సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రతను రోజువారీ పనులలో అంతర్భాగంగా చేసుకోవాలని, దానిని ప్రత్యేక కార్యక్రమంగా చూడకూడదని పేర్కొన్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతిరోజూ ప్రతి ఒక్కరం ఆచరించాల్సిన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
